Telangana / Politics
ఆ బిర్యానీ తిన్నారో..అంతే
14 days ago

కస్టమర్లకు కుళ్ళిన మాంసాహారాన్ని, సీ ఫుడ్ ను సర్వ్ చేస్తున్న రెస్టారెంట్లు, హోటళ్ళపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని  శానిటరీ విభాగం కొరడా ఝళిపిస్తోంది. వారం రోజుల్లో ఇలాంటి 15 పాపులర్ రెస్టారెంట్లను అధికారులు సీల్ చేశారు. ఈ బోర్డు పరిధిలోని 500 కు పైగా రెస్టారెంట్లు, హోటళ్ళపై వీరు ఆకస్మిక దాడులు జరపగా..వీటిలో చాలా హోటళ్ళు 10 రోజులుగా నిల్వ ఉంచిన చికెన్, మటన్, రొయ్యలు, చేపలను వండి వినియోగదారులకు అందిస్తున్నట్టు తెలిసింది. 

డీప్ ఫ్రీజ్ చేయకుండా సాధారణ ఫ్రిజ్ లలో ఈ ఆహారాన్ని ఉంచుతున్నారని, ఫంగస్ సోకినా అలాగే వండి సర్వ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. తిరుమలగిరి, మారేడ్ పల్లి వంటి చోట్ల గల పెద్ద రెస్టారెంట్లు కూడా ఇలా పాడై, కుళ్ళిపోయిన ఫుడ్ ని అందించడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని అంటున్నారు. ఫ్రిజ్ ఓపెన్ చేయగానే దుర్వాసనతో రూమంతా నిండిపోయిందని, కుళ్ళిన ఫుడ్ ని పారవేయించామని తెలిపారు. ఇక్కడి షాహీ బిర్యానీ దర్బార్ అనే ఫేమస్ రెస్టారెంట్ లో తనిఖీలు చేయగా  బిర్యానీకోసం వాడిన మటన్ లో ఫంగస్ ఉన్నట్టు తెలిసింది. ఈ హోటల్ యజమాని బల్క్ లో తక్కువధరకు మటన్ కొని 10 రోజులపాటు నిల్వ ఉంచి దాన్నే బిర్యానీ తయారీకోసం వాడుతున్నాడట.

 కొన్ని జ్యూస్ సెంటర్లు కూడా పాడై పోయిన పండ్లను చౌక ధరలకు కొని వాటినే రసం తీసి వినియోగదారులకు అందిస్తున్నారని వారు చెప్పారు. ఇలాంటి జ్యూస్ సెంటర్లు, కుళ్ళిన ఫుడ్ సర్వ్ చేస్తున్న హోటళ్ళు, రెస్టారెంట్లు 10 రోజుల్లోగా తమ తీరు మార్చుకుని శుభ్రమైన ఆహారాన్ని సప్లై చేయకపోతే వాటిని సీల్ చేయడమే గాక  లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయన్నారు.

 

 
 
 
Related News

JournalistDiary