Telangana / Crime
రూ.70 కోట్ల ఎయిడ్స్ డబ్బు స్వాహా..?
236 days ago

తెలంగాణా రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ 70 కోట్ల స్కామ్ లో చిక్కుకుంది. ఈ సొసైటీకి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నిధుల్లో ఈ 70 కోట్లు హుష్ కాకి అయినట్టు తెలుస్తోంది.  2014-15-2015-16 ఆర్ధిక సంవత్సరాలకు ఇచ్చిన ఫండ్స్ లో ఈ సొమ్ముకు సంబంధించిన బిల్లులను ఈ సొసైటీ అధికారులు చూపలేకపోయారు. ఇటీవల ఢిల్లీలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి ఈ సొసైటీ అధికారులు హాజరయినప్పుడు ఈ స్కామ్ విషయం బయటపడింది. గత రెండేళ్లలో అయిన వ్యయానికి వాళ్ళు లెక్కలు చూపలేకపోయారు. దీనిపై విచారణ జరిపిస్తామని, సొమ్ము నొక్కేసినవారిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫేర్ కమిషనర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా అయిన వాకాటి కరుణ అన్నారు.

 హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ కార్యక్రమాలను చేపట్టడానికి ఈ సొసైటీకి 2014 ఆగస్టు నుంచి 2015 డిసెంబరు వరకు 113 కోట్లు విడుదల చేశారు. వందలాది కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు కూడా ఈ నిధుల్లో ఉన్నాయి. అయితే 70 కోట్ల వ్యయం గురించి అడిగితే అధికారులు తెల్లముఖం వేశారట.  అవినీతికి పాల్పడిన కొందరు... బినామీ ఎన్జీవోలను సృష్టించినట్టు కనిపిస్తోంది. జంటనగరాల్లో  టార్గెట్ ఇంటర్వెంన్షన్ గ్రూప్స్ అని వ్యవహరించే ఎన్జీవోలు సుమారు 178 ఉన్నాయి. వీటిలో 58 ఎన్జీవోలు ఈ సోసైటీతో కలిసి పని చేస్తున్నాయి. వీటిలో కొన్ని అవినీతి అధికారులతో కుమ్మక్కు కావడమో, లేదా వారే వీటితో చేతులు కలపడమో జరిగిఉంటుందని భావిస్తున్నారు. మహిళా సెక్స్ వర్కర్ల పునరావాసం, వారి సంక్షేమం కోసం పాటు పడుతున్న తమ సంస్థకు రెండేళ్లుగా అధికారులు ఎలాంటి చెల్లింపులూ చేయలేదని హైదరాబాద్ లోని చైతన్య మహిళా మండలి వ్యవస్థాపకురాలు బి.జయమ్మ ఆరోపించారు. దీంతో ఈ సోసైటీతో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంటున్నామని ఆమె చెప్పారు.

 

 
 
Related News