India / Time Pass
ఏయన్నార్ వ్యక్తిత్వంలో ఓ కోణం
1177 days ago

ఓ వ్యక్తి తన వరకూ తాను హేతువాదిగానో, నాస్తికుడిగానో వుంటే అందువల్ల సమాజానికి పెద్దగా ప్రయోజనం వుండదు. చాలామంది హేతువాదులు తమ సహచరుల్నీ, పిల్లల్ని సైతం ప్రభావితం చెయ్యడంలో శ్రద్ధ చూపరు. తీర్థయాత్రల మీదా, ముడుపుల మీదా, కొబ్బరికాయల మీదా ఖర్చులేకుండా తమ వరకూ తాము కాస్త ఆదాచేసుకోవడం తప్ప వారి ‘వ్యక్తిగత’ హేతువాదం వల్ల ఎవరికీ ఉపయోగం వుండదు. 

 

ఓ సెలబ్రిటీ గనక హేతువాది ఐతే అతను చాలా చెయ్యెచ్చు. ఉదా: సతి, ఖాప్ పంచాయత్, నిధులకోసం నరబలి, చేతబడి బాణామతి, దేవరగట్టు కర్రల కొట్లాట, తమని తాము దేవుడిగా పబ్లిసిటీ యిచ్చుకుంటూ కాళ్ళుపట్టించుకుంటూ. కాంతా-కనకాల విషయంలో పరమ జుగుప్సాకరంగా ప్రవర్తించే బాబాలూ, స్వాముల బిజినెస్ ఇలాంటి వాటి విషయంలో ఏఎన్నార్‌ లాంటి సెలబ్రిటీ హేతువాది తన అభిప్రాయాలు సూటిగా చెబితే వెర్రిజనం కొంతైనా ఆలోచించేవారు. నిజనికి ఓ జనవిజ్ఞాన వేదిక ఓ ఏడాదిపాటు ఓ మూఢ నమ్మకానికి వ్యతిరేకంగా జరిపే కృషికన్నా ఏయన్నార్‌లాంటి వారి స్టేట్‌మెంటుకి ఎక్కువ ప్రభావం వుంటుంది.

 

ఓ మనిషి కడదాకా హేతువాదిగా వుండటం ఈ వంకర సమాజంలో మామూలు విషయంకాదు. ఇందుకు  ఏయన్నార్‌ పోస్తుమస్‌గానైనా అభినందిచాలి. ఐతే ఏయన్నార్‌కి ''శాస్త్రోకం''గా అంతిమ ''సంస్కారాలు'' జరగడం ఆయన 'దిల్' ప్రకారమే జరిగిందోలేదో కుటుంబ సభ్యులే చెప్పాలి.

 

నా వరకూ నేనూ ఏయన్నార్ ని హేతువాదిగానే చూస్తాను. సకల భీకర మూఢ నమ్మకాలకీ నిలయమైన సినిమారంగంలో  అగ్రస్థానంలో వుండి కూడా అంత నిబ్భారంగా తన విశ్వాసాలని నిలబెట్టుకోవడం గట్టి వ్యక్తిత్వం గల వారికే సాధ్యం. నాకు తెలిసిన నేను చూసిన ''ఏయన్నార్ హేతు వాదం'' గురించి ఓ సంఘటన చెబుతాను దాదాపు 20ఏళ్ల కిందట హైదరాబాద్ త్యాగ రాయ గాన సభలో ''వాస్తు'' మీద రాసిన ఓ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఆ సభకి ఏయన్నార్ ముఖ్య అతిథి. ముఖ్య అతిథి మాటల్లోనే (నాకు గుర్తున్న వరకూ) కోట్ చేస్తాను 

 

‘వాస్తు మీద పుస్తకవేంటి? దానికి నన్ను ముఖ్యఅతిధిగా పిలవమేంటి? నేను రానన్నాను. ఐనా బలవంతం చేశారు. మొగమాట పెట్టేరు. చివరకి ‘‘ఒక్తానుకానీ నేను మాట్లాడదలిచిందేదో ఖచ్చితంగా మాట్లాడతాను. అందుకు సిద్ధమా?’’ అంటే ‘‘ మీరొస్తేచాలు మీయిష్టం. ఏదన్నా మాటాడండి’’ అన్నారు. సరే వచ్చాను. 

 

''ఈ వాస్తు అనేది ఓ శాస్త్రమే ఐతే ప్రపంచం లో వున్న అన్ని  దేశాల్లోనూ ఇది ఎందుకు లేదో తెలీదు. ఈ వాస్తు అనేది ఓ శాస్త్రమే ఐతే ఓ వాస్తు సిద్దాంతికీ మరో వాస్తు సిద్ధాంతికీ ఏకాభిప్రాయం ఎందుకు కుదరదో అర్ధం కాదు.  వేలం వెర్రి కాకపోతే మొన్న మొన్నటి దాకా ఈ వాస్తు గొడవయింత ఉధృతంగా లేదు. ఈ మధ్య కాలంలోనే కన్ స్ట్రక్షన్ యాక్టి విటీతో పాటు ఇదికూడా బాగా పెరిగింది. ఇదో వ్యాపారం. పెట్టుబడిలేని లాభసాటివ్యాపారం.  ''అంతెందుకు? నన్నే తీసుకోండి. మొన్నటి దాకా బంజారాహిల్స్ లో వుండేవాణ్ని. నాయింటికి ఎదురుగా రోడ్ నెంబర్ టెన్ వీధి శూల చాలా స్పష్టంగా వుంది. చాలా అరిష్టవనీ మరేదో ఆనీ నన్ను జడిపించాలని చూశారు. నేను జడుసుకోలేదు. నిజానికి ఆ 'వీధి శూల' ఇంట్లో వుండగా ప్రతీ రోజూ తెల్లారుతూనే టూరిస్టు బస్సుల్లో జనం వచ్చి నన్ను కలిసేవారు. చాలా సంతోషంగా వుండే వాణ్ణి. అలాగే తరుచుగా ఎన్నో అవార్డులు కూడా అందుకునే వాణ్ణి. చాలా బిజీగా, హేపీగా వుండేవాన్ని '' ఆ తర్వాత బంజారా హిల్స్ లో ఇంటిముందు రోడ్డుమీద ట్రాఫిక్ ఎక్కువైంది.అంచేత ఇప్పుడు కొన్నేళ్ళ నుంచి జూబిలీ హిల్స్ లో వుంటున్నాను. ఈ ఇల్లు వాస్తురీత్యా పర్ ఫెక్ట్ అంటూ అందరూ సర్టిఫై చేశారు. ఇక్కడి కొచ్చిన తర్వాత టూరిస్టు బస్సులూ లేవు, జనాలు లేరు, అవార్డులూ లేవు. అదన్నమాట వాస్తు. నేనిలా అంటే వాళ్ళో  మెలిక పెడతారు. జాతకరీత్యా కూడా చూడాలి కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. బోడి గుండుకీ బొటనవేలుకీ ముడి పెట్టినట్టు నీ జీవిత గమనానికీ నువ్వు కాపురం ఉంటున్న ఇంటిని కట్టిన పద్ధతికీ లింకేవిటి? మిగితా ప్రపంచం ముందుకు సాగుతుంటే ఇదంతా వేలం వెర్రి. మనమింకా వాస్తు లాంటివాటిని పట్టుకువేళ్ళాడుతున్నాం. చెప్పింది విని మీరంతా మారి పోతారని చెప్పడం లేదు. కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తారని ఈ నాలుగు ముక్కలూ చెప్పేను. ఇప్పటికైనా స్వయం కృషిని నమ్ముకున్దాం. '' నేను మూఢనమ్మకాలకీ  వ్యతిరేకంగా  మాట్లాడింది వినేసి మీరు మారిపోతారనే భయం ఏకోశానా ఈ సభా నిర్వాహకులకీ లేదు.  జనం వెనకబాటుతనం మీద వాళ్ళకి అచంచలమైన విశ్వాసం ఉందన్నమాట. కాబట్టే నన్ను ఈ సభకి పిలిచే ధైర్యం చేశారు. ఏది ఏవైనా నేను చెప్పదలిచింది చెప్పాను. తర్వాత మీ  యిష్టం. సెలవ్''

-ఎస్పీ.

 

Read Also

 
Related News
JournalistDiary