AP / Politics
అమరావతిలో అందరికీ ఉద్యోగాలు
112 days ago

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిని ఫ్రీజోన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇంతవరకు అమరావతి జోన్-3లో ఉంది. అంటే దీని ప్రకారం రాజధానిలో ప్రభుత్వ ఉద్యోగాలు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వారికే ఎక్కువ ఛాన్స్. విభజన తర్వాత రాజధానిలో అందరికీ సమాన అవకాశాలు కావాలని జిల్లాల నుంచి డిమాండ్లు ఊపందుకున్నాయి. 

ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధికార నేతలు, విపక్షాలు విజ్ఞప్తి చేయడంతో ఫ్రీజోన్‌పై దృష్టి సారించారు చంద్రబాబు. అమరావతిలో అన్నిజిల్లాల వారికీ సమాన అవకాశాలు ఉంటాయని మంగళవారం కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫ్రీజోన్ స్టేట్‌మెంట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలాఉంటే, పరిపాలన సౌలభ్యం కోసం రాష్ర్టం మొత్తాన్ని కొన్ని జోన్లుగా విభజించడం ప్రభుత్వ ఆనవాయితీ. ఒక్కో జోన్‌లో రెండుమూడు జిల్లాలు వుండేలా ఈ ఏర్పాటు వుంటుంది. ఆయా జోన్లలో ఉత్పన్నమయ్యే కొత్త ఉద్యోగాలు ఆయా జిల్లాలకు మాత్రమే వర్తిస్తాయి. బయటి జోన్లకు చెందిన జిల్లాల నుంచి దరఖాస్తులు చేసుకునే వీలుండదు. కానీ, రాజధాని ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వుండడాన్ని ఫ్రీ‌ జోన్‌గా నిర్థారిస్తారు. అంటే రాజధాని ప్రాంతంలో ఉద్యోగాల కోసం రాష్ర్టంలోని నిరుద్యోగులందరూ దరఖాస్తు చేసుకునే వీలుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్ ను ఫ్రీజోన్‌గా చేయాలని అప్పట్లో ప్రభుత్వం భావించినప్పటికీ తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. కానిస్టేబుల్ నియామక విషయంలో ఈ ఫ్రీ జోన్ వ్యవహారం అప్పట్లో న్యాయపరమైన చిక్కులకు ఆస్కారమిచ్చింది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు తెలంగాణ అవతలి తెలుగువాళ్లు తన్నుకుపోతున్నారంటూ అప్పట్లో కేసీఆర్, ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి ఫ్రీ జోన్ అంశాన్ని ఆసరాగా వాడుకున్న విషయం తెల్సిందే! 

 

 
 
 
Related News

JournalistDiary