AP / Politics
బాలయ్యకు 'నంద్యాల' టెన్షన్!
69 days ago

నంద్యాల పోలింగ్ టైం దగ్గరపడుతున్నకొద్దీ.. అధికార ప్రతిపక్ష పార్టీల్లో ప్రచార అలజడి పీక్స్ కి చేరిపోయింది. ఓటర్లను ఆకట్టుకునే ఏ ప్రయత్నాన్నీ వదిలిపెట్టకూడదన్నది ఇరుపక్షాల భావన. వీధివీధీ తిరిగేస్తూ రోడ్ షోలతో ఒకవైపు జగన్ హల్ చల్ చేస్తుంటే.. అడపా దడపా స్పైసీ కామెంట్స్ తో టీడీపీకి చురుకు తగిలిస్తోంది రోజా. ఈ క్రమంలో తెలుగుదేశం కూడా కరిష్మటిక్ పర్సనాలిటీ కోసం సెర్చ్ లైట్ వేసి వెతికేస్తోంది.

 

హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఒక్కరోజైనా నియోజకవర్గంలో తిప్పాలని తెలుగుదేశం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భూమా అఖిలప్రియ కూడా అధిష్టానం వద్ద గట్టిగా లాబీయింగ్ చేస్తోందని, బాల్ ఇప్పుడు బాలయ్య కోర్టులోనే ఉందని చెబుతున్నారు. కానీ.. ఇటీవలే తన 102వ సినిమా షెడ్యూల్ ప్రారంభమైన నేపథ్యంలో బాలకృష్ణ బిజీగా వున్న మాట వాస్తవం. కాకపోతే.. షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చి.. నంద్యాలకొచ్చి కాసేపు సందడి చేసి పోవడం ఆయనకు పెద్దపనేమీ కాదన్నది తెలుగు తమ్ముళ్ల మాట.

 

 

పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన నంద్యాల గెలుపు కోసం.. నేను సైతం అంటూ బాలకృష్ణ కూడా ఒక చెయ్యేస్తే మంచిదని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. కానీ.. బాలకృష్ణ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బావ చంద్రబాబు కూడా నంద్యాలకు తరచూ వెళ్లడం లేదని, అటువంటప్పుడు తాను మాత్రం షూటింగ్ మానుకుని వెళ్లాల్సిన అవసరం ఏమిటని బాలయ్య ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను రంగంలోకి దిగడం ద్వారా ఒక ఉపఎన్నికకు అనవసరంగా రాష్ట్రస్థాయి ప్రాధాన్యత కల్పించడం అవుతుందని బాలకృష్ణ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

 

పార్టీ అధినేత చంద్రబాబు నేరుగా ఆదేశిస్తే తప్ప ఈ విషయం మీద బాలకృష్ణ స్పందించే అవకాశాలు లేనట్లే! పైగా.. ఇక్కడ 'పార్టీలు కాదు.. అభ్యర్థులే ముఖ్యమంటూ' అఖిలప్రియ ఇచ్చిన స్టేట్ మెంట్ పార్టీలోని కొన్ని వర్గాలను ఇబ్బందిపెట్టింది. ఈ క్రమంలో నంద్యాలలో బాలయ్య అటెండెన్స్ మీద క్లారిటీలు తగ్గిపోతున్నాయి.

 

Read Also

 
Related News
JournalistDiary