AP and TS / Politics
అలాకాదు బాసూ.. ఇలా అడుక్కుందాం !
80 days ago

కులం, మతం పేరు చెప్పి ఓట్లు అభ్యర్థించకూడదంటూ రాజకీయ పార్టీల నెత్తిన సుప్రీమ్ కోర్ట్ బండ కొట్టేసింది.  అయితే కోర్టులకు, వాటి తీర్పులకు పొలిటికల్ పార్టీలు జడుసుకుంటాయన్న నమ్మకం మాత్రం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఇవ్వాళారేపూ తెలివిమీరిన పొలిటీషియన్లు.. కొత్త కొత్త దారులు వెతుక్కుంటూనే వున్నారు.  తాము ఏ మతానికీ కొమ్ము కాయబోమంటూ పరోక్షంగా మైనారిటీ ఓట్లకు టెండరేసే లౌకికవాద పార్టీలు సైతం ఎన్నో ఏళ్లుగా మతం పేరు చెప్పకుండానే పబ్బం గడిపేసుకుంటున్నాయి. 

 

రంజాన్ నెలలో ఇఫ్తార్ విందులు, పండగలప్పుడు గుళ్ళూ-గోపురాలు, క్రిస్టమస్ రోజుల్లో చర్చిల్లో కనిపిస్తూ టన్నులకొద్దీ పరమత సహనం పాటించే పార్టీలకు కొత్తగా మార్గనిర్దేశకాలంటూ ఏమీ అక్కర్లేదు కూడా ! సీట్ల కేటాయింపులో, కేబినెట్ బెర్తుల పంపకంలో, నామినేటెడ్ పోస్టుల భర్తీలో.. ఇలా ప్రతిచోటా కుల-మతాలకు సంబంధించిన కోటా ఉండనే వుంది. ఈ తరహా బిస్కెట్ల పంపకాన్ని ఓట్లు అడుక్కోవడం అని కాకుండా ఇంకేమని పిలుస్తారో తెలీదు. మాటల ద్వారా కాకుండా.. రంగులు, వేషధారణ లేదా సైగల ద్వారా ఓట్ల వేటకు బయలుదేరడం పార్టీల వాళ్లకు కొత్తగా నేర్పించాల్సిన అవసరాలెక్కడ ? సుప్రీమ్ కోర్ట్ తీర్పు బైటికొచ్చిన రోజే.. ఏపీ సీఎం చంద్రబాబు 'దివ్యదర్శనం' పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాకో పదివేల మంది చొప్పున ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఖర్చులతో తిరుమల యాత్రకు తీసుకెళ్లడం ఈ పథకం ఉద్దేశం. దీనికోసం ఇప్పటికే 42 వేల  దరఖాస్తులొచ్చాయని సీఎం ప్రకటించారు. ముస్లిం మతస్థుల హజ్ యాత్ర తరహాలోనే పేద హిందువులకు 'దివ్యదర్శనం' కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. 

 

 
 
 
Related News

JournalistDiary