AP and TS / General
ఆర్టీఏ ఆఫీసులో షూటింగ్ క్యాన్సిల్ !
150 days ago

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫిసులో వర్మ సినిమా షూటింగ్ ఆగిపోయింది. సినిమా అంటే సినిమా కాదు.. అరిస్తే కరుస్తా.. కరిస్తే అరుస్తా అంటూ సాగిపోయ్యే వర్మ మార్క్ సినిమా లాంటిదే మంగళవారం షెడ్యూల్ కొచ్చింది. తీరా షాట్ ఓకే అనగానే పోలీసులొచ్చి ప్యాక్ అప్ చెప్పేశారు. లైవ్ టెలికాస్టుల కోసం ఏర్పాటు చేసుకున్న మీడియావాళ్ళతో పాటు.. జనం కూడా ఉస్సూరుమన్నారు. ఎందుకంటే.. అక్కడ మిస్సయ్యింది మామూలు సీను కాదు.. సీమ సింహం జేసీ ప్రభాకర్ రెడ్డి సీను. మీ బస్సు వ్యాపారమంతా బొక్కలే అంటూ.. తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ జేసీ బ్రదర్స్ మీద నిన్నోసారి రాయేశారు. బొక్కలెక్కడో చూపించమంటూ ఫైళ్లు చంకలో పెట్టుకుని హైదరాబాద్ కొచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి. నేరుగా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులోకే ఎంట్రీ ఇచ్చేశారు. అప్పటికే అక్కడ తిష్ట వేసుకున్న శ్రీనివాస్ గౌడ్.. నా దగ్గరా ఆధారాలున్నాయంటూ రంకెలేస్తున్నారు. ఇద్దరి మధ్య ఈరోజు బాహాబాహీ ఖాయమయ్యేట్టుందని ఆశపడ్డ టీవీలోళ్లు కూడా కెమెరా స్విచ్ఛాన్ చేసుకుని రెడీ చెప్పేశారు. ఇద్దరూ ఇద్దరే కనుక.. యుద్ధం గ్యారెంటీ అని జనం కూడా ఫిక్సయిపోయారు.

అయితే ఎప్పుడూ ఫైటింగ్ తర్వాతొచ్చే అలవాటుండే పోలీసులు.. ఈసారి ముందే మేలుకుని.. సయోధ్య కోసం ప్రయత్నించి.. చెరో వైపు తీసుకెళ్లి.. సర్దుబాటు చేసేశారు. తేల్చుకుందాం రమ్మంటూ రెండువైపులా వినపడ్డ అరుపులే తప్ప.. ఆ రోజుకి ఆర్టీఏ ఆఫీసులో మెరుపులు కాన్సిలైపొయ్యాయి. ఇంతకీ గొడవెక్కడంటే.. అప్పుడెప్పుడో జరిగిన పాలెం బస్ యాక్సిడెంట్ లో బాధితులకు పరిహారం ఇవ్వలేదన్నది శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ. అయితే 22 కోట్ల పరిహారం అప్పట్లోనే ఇచ్చేశామన్నది జేసీ ఇస్తున్న వివరణ. జేసీ ప్రభాకర్ రెడ్డి .. ఆయన బస్సు బిజినెస్ ఏమో గానీ.. ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులకు కూడా అయన ఇంతకుముందోసారి చుక్కలు చూపించినట్లు.. పదో పన్నెండో బీప్ సౌండ్స్ కూడా పడ్డట్లు గుర్తు.

 

 
 
 
Related News

JournalistDiary