India / General
యూపీలో ఘోరం: 63కి చేరిన చిన్నారుల మృతుల సంఖ్య
9 days ago

చిన్నారుల మరణాలతో యూపీ సర్కార్ వణుకుతోంది. మెద‌డువాపు వ్యాధితో బాధ‌ప‌డుతూ బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుని చనిపోతున్న చిన్నారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆ సంఖ్య శనివారం ఉదయానికి 63కి చేరింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందుబాటులో లేని కారణంగానే వీరంతా మృత్యువాత పడ్డారు. కానీ చిన్నారుల మరణం వెనుక వేరే కారణాలున్నాయని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నమాట. 


ఆగస్టు 9 నుంచి 11 వరకు చోటుచేసుకున్న ఈ మరణాల్లో కేవలం 11 కేసులపై మాత్రమే శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఇదిలావుండగా శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం లోపు మరో ముగ్గురు చిన్నారులు తుదిశ్వాస విడిచారు. మరణాల సంఖ్య పెరగడంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేశారు. వైద్య శాఖమంత్రి సిద్దార్థ్‌‌నాథ్‌ సింగ్‌ సహా ఉన్నతాధికారులు, బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ డీన్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. చిన్నారులు చనిపోవడానికి కారణంగా భావిస్తోన్న ఆక్సిజన్‌ సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం.

 

సీఎం ఆదిత్యనాథ్‌ గతంలో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్‌లో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి బాబా రాఘవ్‌‌దాస్‌ మెడికల్‌ కాలేజీ. గోరఖ్‌పూర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ప్రజలంతా వైద్యం ఇక్కడికి వస్తుంటారు. ఐతే, రోగులకు అవసరమైన ఆక్సిజన్‌ సరఫరా కాంట్రాక్టును ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. కొద్ది నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో సుమారు రూ.70 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. దీనిపై అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో సదరు ప్రైవేటు సంస్థ.. ఆగస్టు 9 నుంచి ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేసింది. ఈక్రమంలో చిన్నారులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోవడం మొదలైంది. అటు ప్రభుత్వ వ్యవహారశైలిపై అన్నివర్గాల ప్రజల నుంచి విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇది ట్రాజెడీకాదని, నరమేధమని ఆరోపించారు కైలాష్ సత్యార్థి. మరోవైపు సీఎం యోగి రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ , వామపక్షాలు డిమాండ్ చేశాయి.

 

Not a tragedy, it's a massacre: Kailash Satyarthi on #Gorakhpur hospital deaths

 
 
Related News