World / Health
చిట్టి చిట్కా.. ఆరోగ్యం పక్కా
85 days ago

చాలామందికి తిండంటే తెగఇష్టం ఉంటుంది. కానీ మలబద్దకం కారణంగా కడుపునిండా తినలేరు. డయాబెటిక్ పేషెంట్లు తరుచూ ఎదుర్కొనే  సమస్య మలబద్దకం.. వేధించే మలబద్దకాన్ని వదిలించుకోవడానికి చిన్న చిట్కాలు..  

రోజూ మూడు గ్లాసులు తేనెకలిపిన గోరు వెచ్చని నీటిని(డయాబెటిక్ పేషెంట్లయితే తేనె లేకుండా) తీసుకోవాలి. అదేవిధంగా తొక్కతీయని యాపిల్ ను  రోజూ తీసుకోవాలి.  బియ్యం, గోధుమలు సరిసమానంగా వుండేలా తవుడుతో కూడిన రొట్టెలు తీసుకుంటే శరీరానికి కావలసిన పీచు పదార్థాలు పుష్కలంగా అంది జీర్ణశక్తి మెరుగవుతుంది. ఆహారంతో బాటు వెజిటబుల్ సలాడ్లు కూడా తీసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది.

తరుచూ ముక్కు కారుతూ ఇబ్బందిపెడుతోందా? అయితే మీకో చిన్న ఐడియా. గార్లిక్ ఎక్కువగా ఉన్న హాట్ చికెన్ సూప్ తీసుకుంటే ఫలితం ఉంటుందట. రోజూ క్రమం తప్పకుండా రెండు మూడుస్పూన్లు హాట్ సూప్ లు తీసుకుంటే జలుబు తగ్గిపోవడమే కాకుండా నాసికా రంధ్రాలు శుభ్రపడతాయి.

విపరీతమైన ఎసిడిటీతో బాధపడే వారికి పుదీనా పరమౌషధంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా రోజూ పరగడుపునే ఎనిమిది లేదా పది పుదీనా ఆకులు కడుపులోకి తీసుకుంటే గ్యాస్ నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. రోజు తీసుకునే ఆహారంతోబాటు రా ఆనియన్లు కూడా తీసుకుంటే ఎసిడిటికి దూరంగా ఉండొచ్చంటున్నారు. అలాగే భోజనానికి ముందు నిమ్మరసం కలిపిన గ్లాసు నీళ్లు తాగితే ఎసిడిటీని దూరం చేయవచ్చట. అతిగా కాఫీ, టీలు, ఫ్రైడ్ పదార్థాలు, పులిసిన పదార్ధాలు తీసుకోకపోవడ మంచిది. భోజనానికి ఇరవై నిమిషాల ముందు గ్లాసు మంచి నీరు తాగితే ఎసిడిటీని మాయం చేయొచ్చు.. ప్రతిరోజూ పరగడుపున పది తులసి ఆకులు కడుపులోకి తీసుకుంటే ఎసిడిటీ నుంచి రిలీఫ్ ఉంటుంది. అదే విధంగా రోజూ పండిన దోసకాయ ముక్కలు, జీలకర్ర పొడి కలిపిన మజ్జిగ తీసుకుంటే గ్యాస్ పోతుంది.

రక్త హీనతతో బాధ పడేవాళ్లకో చిట్కా.. ఎండునల్ల ద్రాక్ష పండ్లను రాత్రంతా నానబెట్టి పొద్దునే పరగడుపున తీసుకోవాలి. ఇలా ఒకనెల చేస్తే ఫలితం ఉంటుంది. నల్లనువ్వులు పొడి చేసి గ్లాసు వేడి నీటిలో రెండు టేబిల్ స్పూన్లు కలిపి ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా విటమిన్ సి అధికంగా ఉండే గ్రీన్ వెజిటబుల్స్ కూడా ఆరోగ్యానికి  ఎంతో దోహదం చేస్తాయి.

చాలా మందికి ఆగకుండా వెక్కిళ్లు వస్తుంటాయి, అవి తగ్గాలంటే ఈ చిట్కా ఫాలో అయితే సరి. వెక్కిళ్లు ఇబ్బంది పడుతున్నవారు టేబిల్ స్పూన్ చక్కెర  నాలుక కింద ఉంచుకోవాలి. అలాగే అరనిమిషం పాటు ఊపిరిబిగబడితే వెక్కిళ్ల నుంచి ఉపశమనం ఉంటుంది. టేబిల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి కప్పు వేడినీళ్లలో కలిపి టీ మాదిరి గా తీసుకుంటే వెక్కిళ్ళ నుంచి ఉపశమనం ఉంటుంది. 

 
 
 
Related News

JournalistDiary