India / Crime
క్యాబ్ డ్రైవర్‌‌కు కోట్లకు కోట్లు..
122 days ago

నోట్ల రద్దు తర్వాత బ్లాక్‌మనీ రాయుళ్ల కోసం జల్లెడ పడుతున్నారు ఆదాయపు పన్నుశాఖ అధికారులు. తెలుగు రాష్ర్టాల్లో ఇప్పటికే చాలామందిపై నిఘా పెట్టినట్టు సమాచారం. తాజాగా హైదరాబాద్‌లో ఉబెర్ క్యాబ్ డ్రైవర్ తన ఖాతాలో రూ.7 కోట్ల డిపాజిట్ చేయడంతో ఐటీ అధికారులు అవాక్కాయ్యారు.  మరో విచిత్రం ఏంటంటే... నోట్ల రద్దు చేయక ముందు డ్రైవర్ ఖాతాలో ఒక్క పైసా లేదు.. సడన్‌గా కోట్లకు కోట్లు వచ్చిపడ్డాయి. దీంతో తీగలాగే పనిలో పడ్డారు ఐటీ అధికారులు. 

ఉబెర్ క్యాబ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు ఓ వ్యక్తి. నోట్ల రద్దు ప్రకటన తర్వాత అంటే నవంబరు సెకండ్ వీక్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో అతడు 7 కోట్ల రూపాయలను జమ చేశాడు. ఈ నగదు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ ద్వారా పలు విడతల్లో గోల్డ్ వ్యాపారులకు బదిలీ అయినట్టు ఐటీ విభాగం గుర్తించింది. ఐతే, ఈ డబ్బు ఎలా వచ్చిందో అన్నదానిపై అతడు ఎలాంటి వివరణ ఇవ్వలేదని అధికారులు అంటున్నారు. దీంతో ఆదాయపు పన్ను అధికారులు బ్యాంకు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించారు. నగదు డిపాజిట్ చేయడానికి డ్రైవర్.. మరో ఇద్దరు డ్రైవర్ల హెల్ప్ తీసుకున్నట్లు రికార్డయ్యింది. నిందితుడితోపాటు సహకరించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. డిపాజిట్ చేసిన మొత్తానికి ప్రధానమంత్రి గరీభ్ కల్యాణ్ యోజన పథకం కింద పన్ను చెల్లిస్తామని నిందితుడు విచారణలో అంగీకరించాడట. మరోవైపు బ్యాంకు సిబ్బందిని అధికారులు రేపోమాపో విచారించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. 

 

 
 
 
Related News

JournalistDiary