AP / Politics
అతడు రాసిచ్చిందే జగన్ చదువుతున్నాడు!
70 days ago

నంద్యాల బహిరంగసభతో ఫస్ట్ కిక్ ఇచ్చి ప్రచారాన్ని షురూ చేసిన జగన్, ఆ టెంపోను అదే రేంజ్ లో కొనసాగించాలని డిసైడైనట్లు తెలుస్తోంది. అన్ని కమ్యూనిటీల ఓటు బ్యాంకుల్నీ ఆకట్టుకునేలా పటిష్టమైన స్క్రిప్ట్ రాసుకొచ్చి.. ఆ రోజు బాగా ప్రెజెంట్ చేశాడంటూ క్రిటిక్స్ నుంచి ప్రశంసలందుకున్నారు వైసీపీ చీఫ్ జగన్. నంద్యాల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకు.. మసాలా కూడా ఆ మేరకు ఉండాల్సిందే కనుక.. కాసిన్ని కారాలు మిరియాలు కూడా నూరేశారు. చంద్రబాబును నడిరోడ్లో నిలబెట్టి కాల్చినా తప్పులేదన్న డైలాగ్ డెలివరీ కూడా అందులో భాగమే! ఆ విధంగా జనం నోళ్ళల్లో నానడమే కాకుండా ఈసీ దృష్టిలో పడ్డ జగన్, ఫ్రీ పబ్లిసిటీని సొంతం చేసుకున్నారు.

ఎలక్షన్ కమిషన్ కు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చిందుకు పశ్చాత్తాపపడతారని, ఇకమీదట గొంతు తగ్గించుకుంటారని కొంతమంది ఆశించారు. కానీ.. జగన్ శైలిలో మాత్రం మార్పు లేదు. రోడ్ షోలతో నంద్యాల లోపలికి చొచ్చుకెళుతున్న జగన్ లో ఆవేశం పెరిగిందే తప్ప.. వెనకడుగు లేదు. ''ఇటువంటి ముఖ్యమంత్రికి ఉరే సరి'' అంటూ తన మాటల్లో పదును పదింతలు పెంచేశారు. ప్రతి మాటను ఒత్తిఒత్తి పలుకుతూ.. అప్పుడప్పుడూ జనంతో పలికిస్తూ కూడా ముందుకెళ్తున్న జగన్.. తన దూకుడు తగ్గబోదని చెప్పకనే చెప్పేస్తున్నారు. చేతిలో ఒక చిన్న కాగితాన్ని పట్టుకుని.. అందులో రాసుకొచ్చిన కొన్ని 'ప్రత్యేక' పాయింట్లను చూసిచూసి చదువుతున్న జగన్.. తన ప్రిపరేషన్ మీద కూడా చర్చను లేవనెత్తారు. ఈ దఫా ఏ డైలాగ్ వదలాలి.. ఏ విషయాల్ని టార్గెట్ చేయాలి.. ఎవరికి తగలాలి.. లాంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని మరీ.. డైలాగ్ డెలివరీ తయారు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఎత్తుగడ వెనుక సైతం వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెయ్యి వుండొచ్చన్నది మరికొందరి మాట.

 

నంద్యాల బైపోల్ నేపథ్యంలో జగన్ ఎత్తుకున్న ఈ కొత్త స్ట్రాటజీ ఎవరికి ప్లస్? జగన్ కా లేక చంద్రబాబుకా అనేది కొత్త చర్చ. ఒక ముఖ్యమంత్రి మీద సీరియస్ కామెంట్స్ చేసినప్పుడు అవి నేషనల్ మీడియాదాకా పాకిపోవడం సహజం. ఆ కోవలోనే జగన్ జాతీయ ఛానళ్లలో రెండురోజుల పాటు వద్దన్నకొద్దీ కనిపించారు. ఇటు.. జగన్ కామెంట్స్ కి కౌంటర్లివ్వబోయిన టీడీపీ నేతలు.. పరోక్షంగా వైసీపీకే సాయపడ్డట్టయింది. జగన్ సంగతి ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందిలే అంటూ కళ్ళురిమిన వాళ్ళకు సైతం అక్కడ 'అంత సినిమా' లేదని ఆ తర్వాతే తెలిసొచ్చింది. సో.. నంద్యాలలో జగన్ గాత్ర కచేరీకి ఇప్పట్లో ముగింపు లేదన్నది క్లియర్.

 

Read Also

 
Related News
JournalistDiary