AP and TS / General
కేశినేని కథలో కీలక మలుపు
65 days ago

ఎంపీ కేశినేని వేసిన ఎత్తుగడ బూమరాంగ్ అయిందా? బస్సుల నానిగా పేరున్న కేశినేని.. ఇటీవలే బస్సుల వ్యాపారాన్ని వదిలిపెట్టి.. మిగతా బస్సులోళ్లతో కీచులాటకు దిగడం.. ఏపీ వ్యాప్తంగా ఒక సంచలనం. అయితే.. ఈ మొత్తం వ్యవహారం కేశినేని కిందకే నీళ్లు తెస్తుందా అన్న సందేహాలు బెజవాడ రాజకీయ వర్గాల్లో పుట్టేస్తున్నాయి. ప్రయివేట్ బస్సుల యాజమాన్యాలన్నీ సిండికేట్ గా ఏర్పడి.. కేశినేని మీదకు దాదాపు దండయాత్రకు దిగేసిన పరిస్థితి.. ఏ మలుపు తీసుకుంటుందో అంతుబట్టకుండా వుంది. మొన్న అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఎంపీ హోదాలో లేఖ రాసి తెలుగురాష్ట్రాలకు చెందిన 900 ట్రావెల్స్ బస్సుల లైసెన్సులు రద్దు చేయించిన నాని, నిన్న రవాణాశాఖ కమిషనర్ కు లేఖ రాయటం ట్రావెల్స్ యజమానులకు మంటపుట్టించింది. అంతేకాదు, ట్రావెల్స్ యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆ లేఖలో నాని వ్యాఖ్యలు చేయడం వాళ్లకు మరింత ఆగ్రహాన్ని రప్పిస్తోంది. నిన్నటివరకూ భారీ స్థాయిలో ట్రావెల్స్ నడపడమేకాదు, ఎన్నో అక్రమాలకు పాల్పడి, చిన్నా చితకా ట్రావెల్స్ ను కోలుకోలేకుండా చేసిన కేశినేని నాని ఇప్పుడు తగుదునమ్మాఅని మాట్లాడుతున్నారని ప్రయివేట్ ట్రావెల్స్ యజమానులు విమర్శిస్తున్నారు.

ఆరంజ్ ట్రావెల్స్ నేతృత్వంలో మిగతా ప్రయివేట్ ట్రావెల్స్ అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి కేశినేని కథ తేల్చేందుకు వాళ్లంతా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం ఎపి రవాణాశాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యం మీద టీడీపీ నేతల్ని వెంటేసుకువెళ్లి బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డమేకాదు, ఆయన సెక్యూరిటీ గార్డు మీద కేశినేని నాని చేయిచేసుకోవడం కలకలం రేపింది. ఇది అటు అధికార టీడీపీకి కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అది లాగాయితు కేశినేని చేస్తున్న పనులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఏమాత్రం రుచించలేదంటున్నారు. తగిన ముహూర్తం చూసి కేశినేనికి పూర్తిస్థాయిలో తలంటేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్నది టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో అటు కేశినేని నాని కూడా పొలిటికల్ ఫ్లాట్ ఫాం మార్చేసేందుకు పక్కచూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కేశినేని చూపు వైసీపీ వైపు ఉన్నట్టు ఆపార్టీ నేతల నుంచి సమాచారం అందుతోంది. మొత్తానికి కేశినేని నాని ఎపిసోడ్ క్లైమాక్స్ చేరే సమయం ఇంకెంతో దూరంలో లేదంటున్నారు టీడీపీ నేతలు.

 
 
Related News