AP and TS / Entertainment
‘మహానుభావుడు’ మూవీ రివ్యూ
21 days ago

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరోసారి స్టార్ హీరోలతో ఈ దసరాకి పోటీపడ్డాడు. ఆయన నటించిన ‘మహానుభావుడు’ మూవీ తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తున రిలీజైంది. జై లవకుశ, స్పైడర్ లాంటి భారీ సినిమాలు ఈసారి దసరా బరిలోకి దిగాయి. చిన్న బడ్జెట్‌తో వచ్చిన మహానుభావుడు చిత్రానికి మారుతి డైరెక్టర్. గతంలో ఆయన దర్శకత్వం చేసిన చిత్రాలు వరసగా బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టడంతో దీనిపై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. మారుతి-శర్వానంద్ కాంబోలో వచ్చిన ‘మహానుభావుడు’ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిందా? లేదా? ఒక్కసారి రివ్యూలోకి వెళ్దాం.

స్టోరీ :

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆనంద్(శర్వానంద్) తన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలని అనుకుంటాడు. ఎవరైనా అశుభ్రతతో కనిపిస్తే ఓవర్‌గా రియాక్టవుతుంటాడు. ఒక్కోసారి పెద్ద క్లాస్ పీకుతాడు. అలాంటి వ్యక్తికి ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) సోకుతుంది. మానసిక వ్యాధి అయిన ఓసీడీతో తను ఇబ్బందిపడడంతోపాటు ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తాడు. ఐతే ఆనంద్.. కొలీగ్ మేఘన(మెహరీన్)ను ప్రేమిస్తాడు. మేఘన కూడా అతడ్ని ఇష్టపడుతుంది. ఆనంద్ ఓసిడి లక్షణాలను పెద్దగా పట్టించుకోదు. సీన్ కట్‌చేస్తే.. కొన్ని సందర్భాల వల్ల తట్టుకోలేక ఆనంద్- మేఘన లవ్ బ్రేకప్ అవుతుంది. ఓసీడీ వల్ల ప్రేమను కోల్పోయిన ఆనంద్ తిరిగి ఎలా దక్కించుకున్నాడు? ప్రేమకు- వ్యాధికి మధ్య ఎలా నలిగిపోయాడు? ఆనంద్ లైఫ్ ఏమైంది అనేది ‘మహానుభావుడు’ స్టోరీ.

విశ్లేషణ:

గతంలో భలే భలే మగాడివోయ్‌లో నానితో మతిమరుపు పాత్ర చేయించిన డైరెక్టర్ మారుతి, ఈసారి ఓసీడీ వ్యాధితో భాదపడే యువకుడి రోల్‌ని మెయిన్ థీమ్‌గా తీసుకున్నాడు. ఓ మాన‌సిక స‌మస్యతో బాధ‌ప‌డుతున్న ఓ వ్యక్తి, త‌న మ‌న‌సుకు ఎదురైన ప్రతికూల పరిస్థితుల నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌నేది సింపుల్ కాన్సెప్ట్ ఇది‌. ఆ రోల్‌లో శర్వానంద్ ఇమిడిపోయాడు. హీరోకి ఇరిటేషన్ వచ్చిన ప్రతిసారి మనకి నవ్వొస్తుంటుంది. హీరో అతి శుభ్రతను ప్రదర్శించే ప్రతి సన్నివేశం మంచి హ్యూమర్ ను కలిగి ఆకట్టుకుంది. శ‌ర్వానంద్ న‌ట‌న‌, అత‌డ్ని ప్రేమించే అమ్మాయిగా రోల్‌లో మెహ‌రీన్ ఆకట్టుకుంది. గ్లామర్ షోతోపాటు నటిగా మంచి మార్కులు కొట్టేసింది ఈ అమ్మడు. ఇక ఆనంద్ క‌జిన్ కిశోర్‌గా వెన్నెల‌కిశోర్, హీరోయిన్ ఫాదర్‌గా నాజ‌ర్‌, మిగతా నటీనటులు ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు.

రొటీన్ స్టోరీ.. ఆసక్తికరమైన ట్విస్టుల్లేవు. ఫైనల్ ఏం జరుగుతుందనేది ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. ఒక పాత్ర చుట్టూ రెండు గంటలకు పైగా సినిమా నడపడమంటే సులభం కాదు. కానీ ఆ విషయంలో మారుతి సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ మూవీని ఓ రేంజ్‌కి తీసుకెళ్లాడు.. సెకండాఫ్‌లో యావరేజ్.. ఓవరాల్‌గా ఫీల్ గుడ్ ఫిల్మ్. పాటలు కూడా బాగున్నాయి. థమన్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెప్పించింది. సినిమాటోగ్రఫీ చిత్రాన్ని చాలా అందంగా చూపించింది. అక్కడక్కడ కత్తెరలు పడితే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి సంక్రాంతి మాదిరిగానే ఈసారి పెద్ద హీరోలతో పోటీపడి శర్వానంద్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు.

 

Read Also

 
Related News
JournalistDiary