India / Time Pass
మినిస్టర్ టూర్‌లో మిస్టర్ ‘ముక్కుసూటి’!
1191 days ago

కాలమిస్టు జంఘాలశాస్ర్తిని యంగ్ ఆఫీసర్ ‘ముక్కుసూటి మనోజ్‌కుమార్’ కలుసుకున్నాడు.

‘‘నమస్కారం సార్ జంఘాల శాస్ర్తిగారూ’’

‘‘నమస్కారం. మీరు..?’’

‘‘నన్ను ‘ముక్కుసూటి మనోజ్‌కుమార్’ అంటారండి. ఇటీవలే డైరెక్టుగా క్లాస్ వన్ అధికారిగా ఎంపికైన యువకుణ్ణండి’’

‘‘ఎక్కడ పనిచేస్తున్నారు ‘ముక్కుసూటి’గారూ?’’

‘‘ప్రస్తుతం ‘వంతలపాడు’ కేంద్రంగా పేదరికాన్ని తరిమేసే ప్రోగ్రాంకి ఇన్‌ఛార్జిగా వున్నాను సార్’’

‘‘మరి తరిమేశారా పేదరికాన్ని?’’

‘‘మా ప్రయత్నం మేం చేస్తున్నాం సార్. తీరామోసి మేం పేదరికాన్ని తరిమేసిం తర్వాత మేం అధాటుగా వున్నప్పుడో, ఆదమరిచి నిద్దరోయిన్నప్పుడో మళ్లీ ఆ పేదరికం గుట్టుచప్పుడు కాకుండా దొంగరూట్‌లో వొచ్చి సెటిలైపోతుందేమోననే గుబులు కూడా వుందనుకోండి’’

‘‘ఒస్తే రానివ్వండి. అసలు పేదలంటూ వుంటేనేకదా ధనికులకి ఈ గుర్తింపు, ఈ పార్టీలకి ఓట్లు?’’

‘‘పాయింటేనండోయ్’’

‘‘ఇంతకీ మీరు ఏ పనిమీద ఇలా దయచేశారో చెప్పలేదు. ‘ముక్కుసూటి’ గారూ!‘‘

‘‘చెబుతాను సార్ నాది పేరుకు తగ్గట్టే ముక్కుకు సూటిగా పోయే తత్వం’’

‘‘అంటే ఖచ్చితంగా విధి నిర్వహణ చేస్తారన్నమాట. అడ్డదారి వ్యవహారం, అక్రమార్జనా అనేవి మీకు పడవు. అంతేనా?’’

‘‘అంతే సార్  అలాంటి నాకు మొన్న ఓ చేదు అనుభవం ఎదురయింది సార్.

‘‘అలాగా’’

‘‘మొన్న మా ‘వంతలపాడు’ కేంద్రానికి ‘ప్రజాలాలన’ శాఖా మంత్రిగారొచ్చిన వైనం మీకు తెలిసే వుంటుంది’’

‘‘విన్నాను’’

‘‘ప్రజాలాలన శాఖా మంత్రిగారి పర్యటనకీ, బసకీ, వారికీ వారి అనుచర గణానికీ, సిబ్బందికీ పెట్టిన షడ్రసోపేతమైన బోయనాలూ, ఫలరసాలూ వగైరాలకే కాకుండా దివ్యంగా అలంకరించిన వేదికకీ, హాలుకీ, లైటింగుకీ, సౌండ్‌కీ, పుష్పమాలలకీ, దుశ్శాలువలకీ ఐన సకల ఖర్చులూ కూడా బడా కాంట్రాక్టరు ‘బొజ్జ గణపతి’గారు స్వచ్ఛందంగానూ, ఆనందంగానూ భరించేరు.’’

‘‘మరింకేం? మీకే చికాకూ లేదన్నమాట. అన్నీ ఆ కాంట్రాక్టరే చూసుకున్నాడు. ఇంతకింతా ‘రేపటి కాంట్రాక్టులో రాబట్టుకుంటాడనుకోండి’’

‘‘అదేమో నాకు తెలీదుగాని సార్  నేను ఎదుర్కున్న అనుభవం గురించి చెప్పనివ్వండి’’

‘‘చెప్పండి. వింటాను’’

 

‘‘సభ చాలా బాగా జరిగింది సార్ . ‘ప్రజాలాలన’ శాఖామాత్యులు ప్రజలకి నీతివంతవైన పరిపాలన అందించాలంటూ వేదికమీంచి బాగా కదిలిపోయి డగ్గుత్తికతో మాటాడేరు. ఆయన ఆవేదన, నిజాయితీ చూసి జెనంలో చాలా మంది ఎమోషన్ పట్టలేక భోరున విలపించేరు. పరిమితంగా వొచ్చిన మహిళామణులు కూడా ముక్కులు చీదుకోకుండా వుండలేకపోయేరు దు:ఖంతో. ఓ జులపాల కార్యకర్త వీరావేశంతో వేదికెక్కి బొటన వేలు మీద బ్లేడుతో చిన్న గంటు పెట్టుకుని అమాత్య శేఖరులకి రక్త తిలకం దిద్ది పూనకం వొచ్చినట్టు ‘జిందాబాదులు’ కొట్టేడు మైకు పగిలేలా. ఆ తర్వాత అమాత్యులకి దుశ్శాలువలూ, నూటొక్క ‘గజ’మాలలూ సమర్పించేరు. సార్. పెళ్లిళ్లకి పంచరత్నాలూ, సన్మానాలకి పత్రాలూ రచించే స్థానిక ప్రొఫెషనల్ కవిగారు ‘మంత్రి మహోదయా, ఏదయా నాపై నీ దయ?’ అంటూ ఆశువుగా కవిత్వంపన్ని జనాన్ని నవ్వించేడు.

 

‘‘అంతా బాగానే వుంది. కాని ఇవన్నీ మంత్రులు వెళ్తున్న సభల్లో మామూలేకదా?’’ 

‘‘నాకు గతంలో ఈ సభల అనుభవం లేదు సార్  ఇదే మొదటిసారి. ఆ తర్వాత ‘రైతాంగ సేవ’ అనే సంక్షేమ కార్యక్రమం కింద ఒక్కోరైతుకీ రెండేసి లంక పొగాకు చుట్టల చొప్పున మొత్తం ఐదు వేల చుట్టలు అమాత్యుల చేతిమీదుగా పంపిణీ జరిగింది సార్. ఇక నిరుపేద కూలీల కుటుంబాలు ఒక్కొక్కటికీ ఐదేసి తేగల చొప్పున ఆరు వందల తేగల కట్టలు కూడా గౌరవనీయ మంత్రివర్యుల కరకమలముల మీదుగా పంపిణీ చేయించేం సార్.

 

‘‘ఇది కూడా మామూలుగా జరిగే తంతేకదా?’’

‘‘ అసలు పాయింటుకొస్తున్నా సార్ సభా కార్యక్రమం ముగిసింతర్వాత అమాత్యశేఖరులు ‘వంతలపాడు’ గ్రామ దేవత ‘శ్రీవంతలమ్మ’ అమ్మవారిని దర్శించుకుని పదవీ కాలంలో తాను వంతలపాలు కాకుండా ప్రత్యేక కుంకుమ పూజలు జరిపించి. విశ్రాంతి భవనం చేరుకుని అక్కడ ఓ రెండు ఘంటల సేపు విశ్రాంతి తీసుకున్నారు సార్. 

‘‘ఇందులో వింత ఏంవుంది ‘ముక్కుసూటీ’?’’ 

‘‘ఒస్తున్నా సార్ మంత్రి మహోదయులు లేచి వెళ్లే సమయానికి అక్కడ వుండి స్వయంగా పళ్లికిలిస్తూ వీడ్కోలు చెప్పాలని నాకు పై నుండి ఆర్డర్సు సార్  అందుకోసం నేను విశ్రాంతి మందిరం దగ్గిరకెళ్లేను. నాతోపాటు నా కింద పనిచేసే ఇద్దరు చిన్నపాటి అధికార్లూ, ఆరుగురు గుమస్తాలూ ముగ్గురు అటెండర్లూ వున్నారు.’’

‘‘ఏవయిందో చెప్పవయ్యా బాబూ’’

‘‘అమాత్యులవారి గన్‌మన్‌లిద్దరూ, కారు డ్రైవరూ, ఇద్దరు అటెండర్లు, ఇద్దరు వ్యక్తిగత సిబ్బందీ నన్ను చుట్టుముట్టి ‘ఏభైవేలు’ అడిగేరు’’

‘‘రూపాయలే?’’

‘‘ఔను సార్ నా జీతం నెలకి కేవలం ముప్పైవేలని, నేను ‘గీతం’ తీసుకోననీ, అంచేత ఇవ్వలేననీ వారికి చెప్పేను. దాంతో గన్‌మన్, డ్రైవరూ నన్ను చాలా కించపరుస్తూ మాటాడేరు. ‘య్యోవ్’ పోయ్యా నీ మాదిరి చావు గిరాకీ ఆఫీసర్లు వేరే నలుగురుంటే చాలు. ఇక మినిస్టర్లు టూర్లే మానేసుకోని ‘అంబో’ అనుకుంటా రాజిదాన్లోనే వుండిపోతారు’ అంటూ ఇంకా ఏమేమో అన్నారు. నాకైతే నా స్టాఫ్ ముందు ఘోరావమానం జరిగింది.’’ 

‘‘బాధపడకు ‘ముక్కుసూటీ’. ఇలాంటివి నీబోటి వాళ్లకి తప్పవు’’

‘‘అదికాదు సార్  ప్రజా సంక్షేమమే వూపిరిగా జీవిస్తున్న మహనీయులైన మంత్రివర్యులు నీతివంతమైన పరిపాలన నందించాలని ఓ పక్క పరితపిస్తోండగా వారి పర్సనల్ స్టాఫ్ ఈ విధంగా దబాయించి లంచాలు వసూలు చెయ్యడం, లక్షలార్జించడం సబబేనా? అకలంక దేశభక్తులూ, పరమ వవిత్రమూర్తులూ, నిలువెల్లా నిజాయితీగలవారూ ఐన అమాత్యశేఖరుల కిలాంటి విషయం తెలిస్తే వారి సున్నిత హృదయం ఎంత గాయపడుతుందో

ఆలోచించండి’’

‘‘సెభాస్ మిష్టర్ ముక్కు సూటీ. మరొక్కసారి ఆ చివరి వాక్యాలు వినిపించు’’

‘‘ఆకలంక దేశభక్తులూ.. వారి సున్నిత హృదయం ఎంత గాయపడుతుందో ఆలోచించండి’’

‘‘సువ్వు చదివిన చదువూ నీ ఆలోచనా శక్తీ ఈ వాక్యాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయ్. విద్యావంతులైన అనేక మంది నీలా ఆలోచించడం వల్లనే దేశం ఈ స్థితిలో వుంది. ముక్కుసూటిగా వున్నంత మాత్రాన చాలదయ్యా, నిజాన్ని విశ్లేషణచేసే దమ్ముండాలి. నీ అమాయకత్వానికి జోహార్లు’’

-ఎస్పీ.

 

Read Also

 
Related News
JournalistDiary