India / Politics
ఎన్టీయార్ కీ, ములాయంకీ ఆ ఒక్కటే తేడా !
291 days ago

యూపీలో 'ఏపీ'యం అంటూ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో రాజకీయ కుట్రలకు పోలిక పెట్టడం మొదలైపోయింది. ఒకప్పుడు ఎన్టీయార్ ను ముంచేసిన కుటుంబరాజకీయాలే ఇప్పుడుములాయం సింగ్ ను కూడా పిచ్చెక్కిస్తున్నాయనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. అయితే.. అటువంటి లోతుల్లోకి వెళ్లడం 'ప్రమాదకరం' కనుక.. ములాయం ఎదిగొచ్చిన క్రమాన్ని తరచి చూడాల్సిన సందర్భమైతే ఖచ్చితంగా ఇదే !

పార్టీ పెట్టిన తర్వాత కేవలం తొమ్మిది నెలల గ్యాప్ తో పవర్లోకి వచ్చి చరిత్రకెక్కిన ఘనత తెలుగు తేజం ఎన్టీ రామారావుది. ఇందులో సందేహమే లేదు. సినిమా స్టార్ గా తనకున్న ఫాలోయింగ్.. ప్లస్.. జనానికి ఏదో ఒకటి చెయ్యాలన్న ఇంటర్నల్ ఫైర్.. ఈ రెండు అంశాలే  ఆయన విజయానికి దోహదపడ్డ ప్రధానమైన పెట్టుబడులు. సుదీర్ఘకాలం రాజకీయ పోరాటం తర్వాత మాత్రమే.. పెద్ద కుర్చీలను అందుకున్న ములాయం సింగ్ యాదవ్ లాంటివాళ్ళది మరో రకం వీరోచిత గాధ. ఈ విషయంలో ఎన్టీయార్ తో పోలికే లేదు. 

చిన్న వయసులో కుస్తీ పట్లు పట్టడం బాగా తెలిసి.. చదువులో కంటే రెజ్లర్ గానే ఎదుగుతూ వచ్చిన ములాయం.. పదిహేనేళ్ల వయసునుంచే జనంలో తిరుగుతూ 'నాయకత్వ' లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు. సైకిల్ మీదెక్కి ఊరూరా తిరిగారు. అనుకోకుండా రాజకీయాల్లోకొచ్చి.. 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యారు. ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా జరిగిన రాజకీయ ఉద్యమాల్లో జయప్రకాష్ నారాయణ్ తో కలిసి అడుగేశాడు. తొమ్మిదినెలల పాటు జైలు జీవితం గడిపారు. జనతా  పార్టీ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. సొంతగా పార్టీ పెట్టి.. వీపీ సింగ్, చరణ్ సింగ్, మాయావతి లాంటి ఉద్దండులతో పోటీ పడ్డారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో కీలకంగా మారారు. 

బాగా చదువుకుకున్నోడని రామ్ గోపాల్ ని, చురుగ్గా ఉంటాడని శివ్ పాల్ ని.. నమ్మి దగ్గర పెట్టుకున్న ములాయం.. సహజంగానే సోదర ప్రేమకు లొంగిపోయారు. ఇప్పుడా బిగ్ బ్రదర్స్ వల్లే తాను కట్టుకున్న కోటకు బీటలు పడిపోతున్న పరిస్థితి. ఇటావా  సెయింట్ యాన్స్ స్కూల్లో మూడో తరగతి చదివేటప్పుడే కొడుకు అఖిలేష్ మీద హత్యాయత్నం జరిగింది. అప్పట్లో ప్రాణం మీదికి తెచ్చిన 'నాన్న పలుకుబడి' మీదే ఇవ్వాళ అఖిలేష్ 'బలప్రయోగం' జరిగిపోతోంది. సరే.. అది వేరే విషయం. 

తెలుగు రాజకీయాల్లో మెరుపులా మెరిసి మాయమైన నందమూరి అందగాడికీ, ఉత్తరాదిని ఒంటిచేత్తో శాసించిన ములాయం అనే మల్లయోధుడికీ తేడాల మాటేమో గానీ.. కొన్ని సారూప్యతలైతే వున్నాయి. ఇద్దరి పార్టీ గుర్తు సామాన్యుడి ఏరోప్లేన్ 'సైకిల్'.  ఇద్దరి పోరాటమూ ఇందిరాగాంధీ సర్కారు మీదే. ఇద్దరి 'పతనానికీ' కుటుంబ రాజకీయమే నాంది. కాకపోతే ఒక పతనం దశాబ్ద కాలంలోనే సంభవిస్తే.. మరొక పతనం కొన్ని దశాబ్దాల తర్వాత మొదలైంది. 

 

Read Also

 
Related News
JournalistDiary