World / Health
ముల్లును ముల్లుతోనే..
625 days ago

ముల్లును ముల్లుతోనే తీయాలన్నది సామెత.. అలాగే మలేరియా వ్యాప్తికి కారణమయ్యే దోమలను కృత్రిమ దోమలతోనే నిర్మూలించాలన్నది ప్లాన్. జన్యుపరంగా అభివృద్ధి చేసిన దోమలు మలేరియాను నివారించగలవని సైంటిస్టులు అంటున్నారు. ఈ వ్యాధికి కారణమయ్యే దోమల జన్యువులను అడ్డుకునే కృత్రిమ దోమలను వాళ్లు సృష్టించారు. ఈ క్రమంలో జీన్ ఎడిటింగ్ టెక్నిక్ అనే పద్ధతిని డెవలప్ చేశారు.

అసలైన దోమలు మానవులకు ఈ వ్యాధిని వ్యాప్తి చేసే ‘‘సామర్థాన్ని’’ ఇవి దెబ్బ తీస్తాయట ! కొత్త జన్యుపరమైన దోమలను.. మలేరియా దోమలతో సంపర్కం (బ్రీడ్) చేసినప్పుడు ఆ జీన్‌లు కూడా వాటిలో ప్రవేశిస్తాయని, దాంతో మలేరియా నివారణ సులభమవుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మరిన్ని ప్రయోగాలు జరిపి.. యాంటీ మలేరియా దోమలను సృష్టించగలమని వాళ్లు విశ్వసిస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచంలో లక్షలాది మందిని బలిగొంటున్న మలేరియాను ‘అంతం’ చేయవచ్చునని అంటున్నారు.

ఈ వ్యాధికి కారణమయ్యే ఎనాఫిలిస్ దోమల్లోకి కొత్త డీఎన్‌ఏ తో కూడిన బ్రీడ్‌ను జొప్పించినప్పుడు అది వాటి జన్యువును ప్రభావితం చేసి.. ‘మలేరియా జీన్’లను అడ్డుకుంటుందని, అయితే ఇది తమ ప్రయోగంలో మొదటిదశ అని ప్రొఫెసర్ ఆంథోనీ జేమ్స్ తెలిపారు. గత 20 ఏళ్లుగా ఆయన యాంటీ మలేరియా దోమల అభివృద్ధికి సంబంధించిన ప్రయోగాలు జరుపుతున్నారు. ఈయన జరిపిన అధ్యయనాన్ని మెక్సికోలోని ల్యాబ్‌లలో పరిశోధకులు విశ్లేషించారు. కాగా.. చైనాలో  ఆ మధ్య ఇలాంటి కృత్రిమ దోమలను సృష్టించారని వార్తలు వచ్చాయి. కానీ అవికూడా ప్రయోగాల దశలోనే ఉన్నాయి.

 
 
Related News