AP and TS / Entertainment
‘నేనే రాజు.. నేనే మంత్రి’ మూవీ రివ్యూ
70 days ago

లీడర్, కృష్ణవందే జగద్గురుమ్, ఘాజీ లాంటి సినిమాలతో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు రానా, బాహుబలితో నేషనల్ హీరో అయిపోయాడు. ఆయన నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘నేనే రాజు.. నేనే మంత్రి’ శుక్రవారం తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తున రిలీజైంది. కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం తపించిన డైరెక్టర్ తేజ, తన స్టైల్‌ని పక్కన పెట్టి పొలిటికల్ థ్రిల్లర్‌తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మరి అంచనాలను సినిమా అందుకుందా? లేదా? అనేది తెలియాలంటే రివ్యూపై ఓ లుక్కేద్దాం.

 

స్టోరీ.. వడ్డీకి అప్పులిచ్చే జోగేంద్ర (రానా)కి, భార్య రాధ అంటే (కాజల్ అగర్వాల్) చెప్పలేని ఇష్టం. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. ఎంతదూరమైనా వెళ్తాడు. ఎదుటి మనిషి కష్టాల్లోవుంటే ఏ మాత్రం ఆలోచించకుండా ఆదుకోవటం రాధకు అలవాటు. పెళ్లైన మూడేళ్ల తర్వాత రాధ గర్భవతి అవుతుంది. కానీ ఆ ఆనందం జోగేంద్ర లైఫ్‌లో ఎంతోసేపు నిలవదు. ఊరి సర్పంచ్ భార్యతో జరిగిన గొడవల్లో రాధ తన కడుపులోవున్న బిడ్డని కోల్పోతుంది. సర్పంచ్ భార్య వల్లే తమకు ఇలా జరిగిందన్న కోపంతో జోగేంద్ర.. సర్పంచ్‌ను చంపేసి ఊరికి ప్రెసిడెంట్ అవుతాడు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో రాధ కోసం రాజకీయాల్లోకి దిగుతాడు జోగేంద్ర. స్వార్థపరులైన రాజకీయ శక్తుల మధ్యకు వెళ్లిన రానా, ఓ ఎత్తుకు ఎదదిగే క్రమంలో తప్పులు చేస్తూ ముందుకెళ్తాడు. అలా రాజకీయ చదరంగంలో చిక్కుకున్న రాధ- జోగేంద్ర ఎలాంటి కష్టాలు అనుభవించారు? అతడి పొలిటికల్ కెరీర్ ఎలా సాగింది? జోగేంద్ర ముఖ్యమంత్రి అయ్యాడా?అన్నది తెరపై చూడాల్సిందే!

 

విశ్లేషణ...  డైరెక్టర్ తేజ.. రొటీన్‌గా లవ్‌స్టోరీకి వైపు మొగ్గు చూపకుండా పాలిటిక్స్ నైపథ్యంలో బలమైన ప్రేమకథను చెప్పిన తీరు బాగుంది. అంతేగాక స్టోరీకి కావాల్సిన పాత్రల్ని బలంగా రాసుకున్నాడు. జోగేంద్ర పాత్రలో రానా ఒదిగిపోయాడు. భార్యను ప్రాణంగా ప్రేమించే వడ్డీ వ్యాపారీగా, తన గెలుపు కోసం ఎంతకైనా తెగించే మూర్ఖపు రాజకీయ నాయకుడిగా రెండు వేరియేషన్స్ బాగా చూపించాడు. రానా తన పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుని చేసిన సినిమా ఇది. హీరోయిన్ గా కాజల్ ఆకట్టుకుంది. అంతా చీరలో కనిపిస్తూ ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ తనదైన నటనతో మెప్పించింది. వీళ్లిద్దరి మధ్య నడిచే భార్యభర్తల ట్రాక్‌ని తెరపై చాలా అందంగా ఆవిష్కరించాడు.

 

ఫస్టాఫ్ నుండే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్లిపోవడం, జోగేంద్ర రాజకీయ రంగప్రవేశం చేయడం చూపించాడు. సెకండాఫ్‌కు వచ్చేసరికి జోగేంద్ర అసలు సిసలు రాజకీయ నాయకుడిగా మారిపోవడం వంటివి బాగా చూపించాడు. చివర్లో జోగేంద్రతో శత్రువులు ఆడే పొలిటికల్ గేమ్ కూడా బాగానే వుంది. నవదీప్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. విలన్‌ పాత్రలో అశుతోష్‌ రానా మెప్పించాడు. పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో సెటైరికల్‌ డైలాగ్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. రానా సందర్భానుసారం చెప్పే డైలాగ్స్‌ ప్రేక్షకులను మెప్పిస్తాయి. 200 మంది ఎమ్మెల్యేలను చంపడం, ఉరిశిక్ష తప్పే సన్నివేశాలు బలహీనంగా, లాజిక్స్‌కు దూరంగా వున్నాయి.

 

అసెంబ్లీ సన్నివేశం పెద్దగా మాటలు లేకుండానే ముగిసిపోతుంది. కీలకంగా కనిపించిన క్యాథరిన్ పాత్రకు సరైన జస్టిఫికేషన్ కనబడదు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. యాంటీ క్లైమాక్స్ తో ముగించటం కొన్నివర్గాలకు నచ్చలేదు. టైటిల్ సాంగ్‌తో అనూప్ ఫుల్‌మార్క్స్ సాధించాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సీన్స్‌ను మరింతగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇటు క్లాస్, అటు మాస్‌కి కూడా నచ్చుతుంది.

 

Read Also

 
Related News
JournalistDiary