AP and TS / Entertainment
‘లై’ మూవీ రివ్యూ
70 days ago

తాను నటించిన సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ కొడుతూ దూసుకుపోతున్నాడు నితిన్. ఈ హీరో నటించిన ఫిల్మ్ శుక్రవారం తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తున రిలీజైంది. ప్రమోషన్‌లో నితిన్‌ స్టైలిష్‌ లుక్‌ మూవీపై ఆసక్తిని పెంచాయి. కృష్ణగాడి వీర ప్రేమ గాథతో తన మార్కును చూపించాడు డైరెక్టర్ హను రాఘవపూడి. ఇటు నితిన్, అటు హను రాఘవపూడి కలిసి చేస్తున్న చిత్రం కావడంతో ‘లై’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలకు లై రీచ్ అయ్యిందో లేదో రివ్యూపై ఓ లుక్కేద్దాం..

 

స్టోరీ... అమెరికా వెళ్తే లైఫ్‌లో సెటిల్ కావచ్చని భావిస్తాడు సత్యం(నితిన్). ఇందుకోసం లాస్ వేగాస్ వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటాడు. ఐతే, సత్యంకి తండ్రి లేకపోవడంతో తొంద‌రగా పెళ్లి చేయాలన్నది అతడి త‌ల్లి కోరిక‌. కొన్ని ప‌రిస్థితుల మ‌ధ్య చైత్ర (మేఘా ఆకాష్‌)తో క‌లిసి లాస్‌వేగాస్‌కి వెళ్తాడు సత్యం. జ‌ర్నీలో ఇద్దరికీ ఇష్టపడతాడు. సీన్ కట్ చేస్తే.. పద్మనాభం (అర్జున్‌) మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అమెరికాలో ఉంటాడు. అతడ్ని పట్టుకోవడానికి పోలీసులు చాలాకాలంగా ట్రై చేస్తారు. ఈ క్రమంలో ‘సూట్’ కోసం పద్మనాభం ప్లాన్ చేస్తాడు. ఇంతకీ ఆ ‘సూట్’ సీక్రెట్ ఏంటి? ఈ మిష‌న్‌లో హీరో ఎలా ఇరుక్కున్నాడు? హీరో, విల‌న్‌కి మ‌ధ్య ఉన్న క‌నెక్షన్ ఏంటి? అనేది అసలు స్టోరీ.

 

విశ్లేషణ... యంగ్ హీరో నితిన్ అంటే గుర్తొచ్చేది లవ్‌స్టోరీ సినిమాలు! మధ్యలో యాక్షన్ సినిమాలు చేసినా వర్కవుట్ కాకపోవడంతో, ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు. యాక్షన్ కమ్ మైండ్‌ గేమ్ సబ్జెక్ట్‌తో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. నితిన్‌.. గతంలో కన్నా ఈసారి స్టైలిష్‌గా కనిపించాడు. అత‌డిలోని న‌ట‌న బాగా ఎలివేట్ చేసింది. ఇంట్రడ్యూస్ నుంచి క్లైమాక్స్ వ‌రకు నితిన్ ఎంత ఎఫ‌ర్ట్ పెట్టాడో స్పష్టంగా తెలుస్తుంది. హీరోయిన్ మేఘాఆకాష్‌ నటనకు అంతగా ప్రయార్టీలేని పాత్ర అయినా, పిసినారి అమ్మాయి రోల్ లో ఆకట్టుకుంది. కొన్నిచోట్ల శ్రియ‌ని గుర్తు చేసింది. నితిన్‌తో రొమాన్స్ సీన్స్‌ ఆక‌ట్టుకున్నాయి.

 

ఈ పిక్చర్‌లో నితిన్ తర్వాత అర్జున్ క్యారెక్టర్‌కే ప్రాధాన్యం ఎక్కువ. విల‌న్‌గా అద్భుతంగా కనిపిస్తూనే, తన బాడీలాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ర‌వికిష‌న్‌, నాజ‌ర్‌, అజ‌య్‌, శ్రీ‌రామ్‌లు తమతమ ప‌రిధి మేర‌కు చ‌క్కగా న‌టించారు. ఒకప్పటి హీరోయిన్ పూర్ణిమ.. హీరో త‌ల్లిగా ద‌ర్శన‌మిచ్చింది. రాజీవ్ క‌న‌కాల హీరోయిన్‌కి తండ్రిగా దర్శనమిచ్చాడు. నితిన్ ఫ్రెండ్‌గా మ‌ధునంద‌న్ మ‌రోసారి అల‌రించే ప్రయ‌త్నం చేశాడు. పద్మనాభం-సత్యంల మధ్య సాగే దాగుడు మూతలాట స్టైలిష్‌గా వుంది. ముంబై, జోర్డాన్‌, లాస్ వేగాస్ ఇలా లోకేష‌న్లు మారినా, క్వాలిటీ ఎక్కడా మార‌లేదు. మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ మ‌రోసారి త‌న స్థాయిని చాటుకున్నాడు. సెకండాఫ్ కాస్త తడబాటు కనిపిస్తుంది.

పద్మనాభంని విలన్‌గా సరిగా చూపించలేదు. అతడు మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ ఎందుకయ్యాడన్నది ఎక్కడాలేదు. కొన్ని డైలాగ్‌లు, ఈక్వేషన్లు ప్రేక్షకులు అర్థంచేసుకోవటం కష్టమే! సినిమా మొత్తం సీరియస్‌ మోడ్‌లో సాగుతుంది. ఇక కామెడీని ఆశించలేం.. పాటలు బాగున్నా, అసందర్భంగా వచ్చి కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. యాక్షన్‌ థ్రిల్లర్‌, మైండ్‌గేమ్‌ చిత్రాలను ఇష్టపడే వాళ్లకి నచ్చుతుంది. లాజిక్ లేని సన్నివేశాలు, రొటీన్ రివేంజ్ డ్రామా ఇది.

 

 

Read Also

 
Related News
JournalistDiary