World / Health
లైంగిక సందేహమా? ఆన్‌లైన్ వుందిగా?
607 days ago

ఇప్పటికే ఈ మన సమాజంలో సెక్సువల్, మెంటల్ సమస్యలు చెప్పుకోవాలంటే చాలామంది బిడియపడతారు. బాహాటంగా వివరించేందుకు వెనుకంజ వేస్తారు. ముఖ్యంగా హైదరాబాదీలు అయితే చెప్పనక్కర్లేదు. తమ లైంగిక సామర్థ్యం, సేఫ్ సెక్స్, వైఫల్యాలు వంటివేగాక, తమ మానసిక దౌర్భలాల గురించి కూడా ప్రస్తావించడానికి మొహమాట పడతారు. అయితే ఆన్‌లైన్ వేదికలు ఇలాంటివారికి వరాలుగా మారుతున్నాయని తెలుస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు డిజిటల్ పార్టనర్‌గావున్న ‘లైబ్రేట్’ అనే ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్ వేదిక వీరికి ఎంతగానో ఉపయోగపడుతోందట! ఈ సంస్థ ఆరు నగరాల్లో సర్వే చేస్తే.. ఇందులో ఇంటరాక్షన్స్ 56 శాతం హైదరాబాదీలదేనని తేలింది. తమ సెక్యువల్ హెల్త్ గురించి 36శాతం, మెంటల్ హెల్త్ గురించి 20శాతం మంది సందేహాలు వెలిబుచ్చి వాటికి సమాధానాలు పొందారట.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో సభ్యులుగావున్న 90 వేల మంది డాక్టర్లు ‘లైబ్రేట్ హెల్త్ స్కేప్ ఇండియా-2015’ అనే యాప్‌ను ప్రారంభించి ఇలాంటివారికి చేయూత నిస్తున్నారు. ఈ యాప్ ద్వారా జరిపిన సర్వేను విశ్లేషించినప్పుడు దాదాపు 50 లక్షల ఇంటరాక్షన్స్ జరిగినట్టు వెల్లడయింది. ఎక్కువగా హైదరాబాద్ నుంచి చాలామంది (ఆడ, మగ) గతేడాది జనవరి- డిసెంబర్ మధ్యకాలంలో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. లైఫ్ స్టయిల్ డైలమాలు, మహిళల ఆరోగ్య సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఏదిఏమైనా తమ సందేహాలు తీర్చుకోగలిగిన వారి ఐడెంటిటీని గోప్యంగా వుంచుతున్నాం గనుక చాలామంది స్వేచ్ఛగా తమ సమస్యల గురించి చెప్పుకుంటున్నారని లైబ్రేట్ సీఈవో సౌరభ్ అరోరా అంటున్నారు. గతేడాది జనవరిలో లైబ్రేట్ యాప్ లాంచ్ ఐనప్పటి నుంచి దాంతో టచ్‌లోవున్న డాక్టర్ కె. శ్రీనివాస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. లైంగిక, మానసిక సమస్యలు ఒకదానితో ఒకటి ముడిపడి వుంటాయని ఆయన అన్నారు. దాదాపు 70శాతం మానసిక దౌర్బల్యం నుంచి లైంగిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యాంగ్జయిటీ, డిప్రెషన్, సైకో- సోషల్ ఎన్విరాన్‌మెంట్ వంటివి లైంగిక వైఫల్యానికి దారితీస్తున్నాయని మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్‌కు చెందిన న్యూరో సైకియాట్రిస్ట్ అయిన శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అయితే పలువురికి కౌన్సెలింగ్ ద్వారాను, మందులు ఇవ్వడం ద్వారాను కూడా ఈ సమస్యలు తీర్చవచ్చునన్నారు.  కాగా ఢిల్లీలో 75శాతం, ముంబై 67, కోల్‌కతా, చెన్నైల్లో 49శాతం, బెంగళూరులో 45శాతం మంది ఆన్‌లైన్ ద్వారా సందేహాలు తీర్చుకున్నట్లు వెల్లడైంది.

 

Read Also

 
Related News
JournalistDiary