India / Politics
కొడుకుతో రాజీ.. సైకిల్ సేఫ్..?
55 days ago

సైకిల్ తమదంటే తమదంటూ ఢిల్లీలో పంచాయితీపెట్టిన తండ్రీకొడుకులిద్దరూ తిరుగుటపా కట్టేశారు. వ్యవహారం కోతి-రొట్టె కథలామారి సైకిల్ ఎవ్వరికీ కాకుండా పోతుందనే ఉద్దేశ్యంతో ములాయం- అఖిలేష్ యాదవ్ లు ఇద్దరూ రాజీపడినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు అనవసర అహంలకు పోయి సైకిల్ గుర్తును కోల్పోవడం కంటే, ప్రస్తుతానికి రాజీపడి అంతర్గత విభేదాల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలు సయోధ్యకు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ మధ్యవర్తిత్వంతో రూపొందించిన 'రాజీ ఫార్ములా' లో అఖిలేష్ స్వయంగా ఈ రాజీ ఫార్ములాను ప్రతిపాదించారట. ములాయం సింగ్, శివపాల్ వర్గం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవి నుంచి అఖిలేష్ తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, ఈ ఫార్ములా ప్రకారం అఖిలేష్ యాదవ్ చెప్పిన వారందరికీ పార్టీ టిక్కెట్లు ఇచ్చితీరాలి. అలాగే, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన శివపాల్ యాదవ్‌కు తిరిగి అదే పదవిని అప్పగిస్తారు. ఇదిలాఉండగా, సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తైన సైకిల్ తమకే చెందాలని అఖిలేష్-ములాయం పట్టు బట్టారు. ములాయం సోమవారం ఉదయమే ఢిల్లీ చేరుకొని సైకిల్ గుర్తు తమకే చెందాలంటూ ఎన్నికల కమిషన్ ను కలిసి మెమొరాండం ఇచ్చారు. అయితే అఖిలేష్ వర్గంలోని రాం గోపాల్ యాదవ్ కూడా కమిషన్ ను కలిసి ఇదే డిమాండ్ చేశారు. దీంతో సైకిల్ గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేయాలని ఎన్నికల సంఘం నిర్ణయానికి రావడంతో సైకిల్ కథ కంచికి చేరింది.

 

 
 
 
Related News

JournalistDiary