India / Crime
హడలిపోతున్న గాలి వర్గీయులు.. మరొకరు అరెస్ట్
306 days ago

మైనింగ్ ఘనుడు, మాజీమంత్రి గాలి జనార్థన్‌రెడ్డి పాత‌నోట్ల మార్పిడి వ్యవహారం తీగలాగితే డొంక కదులుతోంది. ఇందులో భాగంగా బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు గన్‌మెన్ చెన్న బసప్ప హోసమనిని మంగళవారం సీఐడీ అరెస్టు చేసింది. కర్ణాటక రెవెన్యూ అధికారి భీమానాయక్ కారు డ్రైవర్ రమేష్ గౌడ సూసైడ్ కేసుని సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నాయక్‌ని విచారించిన అధికారులు, ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఎంపీ గన్‌మెన్‌ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేయడం ఖాయమని అధికారులు చెప్పినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంలో తమ బండారం ఎక్కడ బయటపడుతుందేమోనని గాలి వర్గీయులు భయంతో హడలిపోతున్నారు. డ్రైవర్ సూసైడ్ చుట్టూనే తిరుగుతోందని, దీనిపై లోతుగా నోట్ల మార్పిడి వరకు వెళ్తే తాము కూడా మునిగిపోతామనే ఆందోళనలో వున్నట్లు తెలుస్తోంది. 

గాలి జనార్థన్‌రెడ్డి కూతురు పెళ్ళికి ముందు ఆయనకు సంబంధించిన 100 కోట్ల పాత కరెన్సీని కొత్త నోట్లుగా రెవెన్యూ అధికారి భీమానాయక్ మార్చాడని, దీని నిమిత్తం 20 శాతం కమీషన్‌గా ఆయనకు ముట్టిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో తనను చంపుతామని బెదిరించారని, ఈ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్లు డ్రైవర్ రమేష్ గౌడ తన లేఖలో ప్రస్తావించాడు. 

 

Read Also

 
Related News
JournalistDiary