AP and TS / Politics
బీసీసీఐకి ఝలక్
293 days ago

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి దేశ అత్యున్నత న్యాయస్థానం దిమ్మతిరిగే షాకిచ్చింది. తమ ఆదేశాలను అమలు చేయకుండా వ్యవహరించినందుకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌, ప్రధాన కార్యదర్శి అజయ్‌ షిర్కేలను పదవుల నుంచి తొలగించాలని ఆదేశించింది. బోర్డు సభ్యులుగా ఎవరుండాలన్న దాని గురించి ఈనెల 19న ప్రకటిస్తామని వెల్లడించింది. సభ్యుల ఎంపికపై సూచనలు ఇచ్చేందుకు ఓ కమిటీని కోర్టు నియమించింది. తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. 

ఐపీఎల్ టోర్నీలో బెట్టింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో బీసీసీఐలో ప్రక్షాళనకు నియమించిన లోధా కమిటీ తన నివేదికను గతేడాది జులైలో సుప్రీంకోర్టుకు సమర్పించింది. కీలకంగా కొన్ని విషయాలను ప్రస్తావించింది ఈ కమిటీ. 70 ఏళ్లు పైబడినవారు, రాజకీయాల నేతలు క్రికెట్‌ సంఘాల్లో పదవులు చేపట్టరాదని తేల్చేసింది. ఇదిలావుండగా ఈ కమిటీ సిఫారుసులను కచ్చితంగా అమలు చేయాల్సేందేనంటూ సుప్రీంకోర్టు చాలాసార్లు కుండబద్దలు కొట్టింది. ఐతే, బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లు కనిపించలేదు. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు సిఫారుసును బోర్డు వ్యతిరేకిస్తూ వచ్చింది. ఒకానొక దశలో కొన్ని సిఫారుసులను అమలు చేయడం కష్టమంటూ న్యాయస్థానానికి వివరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు.. బీసీసీఐపై కొరడా ఝుళిపించింది. ప్రపంచంలోనే అధిక నిధులున్న బీసీసీఐ బోర్డులో పదవులను దక్కించుకునేందుకు ఇటు రాజకీయ నేతలు, అటు బిజినెస్ మేన్లు పోటీపడడం చూస్తూనేవున్నాం. గతేడాది మేనెలలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఠాకూర్ బాధ్యతలు చేపట్టారు. ఆయన గత పార్లమెంటు ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైన విషయం తెల్సిందే! 


 

Read Also

 
Related News
JournalistDiary