Telangana / Politics
టీడీపీని కౌగిలించుకోడానికి తెరాస రెడీ! హీటెక్కిన తెలంగాణ..!
8 days ago

అధిష్టానం ఆదేశిస్తే మాట్లాడతా..! తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రస్తావన వచ్చినప్పుడు తెలంగాణ మంత్రి తుమ్మల ఇచ్చిన స్టేట్ మెంట్! ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారన్న వార్తల సంగతేంటి అంటే.. అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మాత్రమే కూర్చుని మాట్లాడుకున్నాం అంటూ క్లారిటీ ఇచ్చారాయన. ఇప్పటికైతే తెలుగుదేశంతో కలిసి నడిచే ఆలోచన గానీ, అవసరం గానీ కనిపించడం లేదన్న తుమ్మల.. ఖచ్చితంగా ఏదో దాచిపెడ్తున్నారంటూ తెలంగాణా రాజకీయ వర్గాల్లో
చర్చ మొదలైంది. ఒక మీడియా సంస్థకు మంత్రి తుమ్మల ఇచ్చిన ఇంటర్వ్యూ.. టీ-పాలిటిక్స్ ని హీటెక్కించేసింది. నిజానికి.. ఈ పొగ ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. పరిటాల వారసుడి పెళ్లి కోసం అనంతపురం వెళ్లిన కేసీఆర్.. టీడీపీ నేత పయ్యావులను పిలిపించుకుని మాట్లాడినప్పుడే.. గులాబీ, పసుపు కలిసిపోతున్నాయన్న వాసనొచ్చేసింది.

 

మరో ఏడాదిన్నరలో ఎన్నికలు! ఇక్కడ వార్ వన్ సైడేనంటూ సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. మరోవైపు.. చాపకింద నీరులా ప్రభుత్వ వ్యతిరేకత సైలెంట్ గా పెరుగుతోందన్న వార్తలూ గట్టిగా వినిపిస్తున్నాయి. పైగా.. 'ఒకే ఉమ్మడి వేదిక' అంటూ ప్రతిపక్షాలు అట్నుంచి నరుక్కొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ పాచికలు కదపకుండా ఊరికే కూర్చోదు. ప్రతిపక్షాల మధ్య ఐక్యతను మొదట్లోనే తుంచిపడెయ్యడానికి కేసీఆర్ కనీస ప్రయత్నం చెయ్యకుండా వుండరు కూడా! ఈ క్రమంలోనే.. తెలుగుదేశం పార్టీకి తెరాస దగ్గరగా జరుగుతోందని కేసీఆర్ వ్యవహార శైలి గురించి బాగా తెలిసినవాళ్ళు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళితే నష్టమా? లాభమా? అనే కాలిక్యులేషన్స్ ఇప్పటికే కేసీఆర్ వేసుకున్నారని.. ఆ మాటకొస్తే.. టీడీపీతో స్నేహమా..? లేక విలీనమా? అనేదాకా సమాలోచనలు జరిగాయని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఏదైతేనేం.. కేసీఆర్ రాజకీయ జాణతనం మీద మరోసారి లోతైన చర్చ జరుగుతోంది.

 

Read Also

 
Related News
JournalistDiary