India / Time Pass
''పోష్‌కాలనీల్లో ఫ్యాక్షనిస్టులు''
1191 days ago

''పోష్‌కాలనీల్లో ఫ్యాక్షనిస్టులు''  

అను ''ఫ్యాక్షనిజం మైగ్రేటెడ్''

కొండల‌నడుమ పోష్‌ కాలనీలో ఓ సువిశాల భవంతి. పెద్ద గేటు, గేటు బైట: 

''జయ ప్రకాష్ రెడ్డి 

ఫ్యాక్షనిస్టు (రిటైర్డ్)'' 

అనే పాలరాతి నేమ్ ప్లేట్.

గేటు దాటుకుంటూ ఓ ఆగంతకుడు భవన ప్రాంగణంలోకి  అడుగు పెట్టేడు. ఒక చేతిలో గోనె సంచీ, మరో చేతిలో వేటకత్తీ కలవు. హాల్లోంచి ఆ మనిషిని చూసి, ఇంద్రసేనా రెడ్డీ, నరసింహానాయుడూ ఉగ్రులైపోయేరు. 

ఇంద్ర: నీయమ్మ, ఎందిరాగబ్బునాకొడకా! ఈడికొచ్చినావేందిరా?

నర్సింహ: ఈడికి రమ్మని ఎవురు చెప్పినార్రా చెత్త నాయాలా? ఇంద్రన్నా. వీన్ని తన్ని పంపిచాల. ఈ హడావిడి గమనించిన జయ ప్రకాష్ రెడ్డి బైటికొచ్చేడు 

జయ: నర్సింహానాయుడూ. 

నర్సింహ: నాయినా.

జయ: యాదానికప్పా అట్ట అరుస్తాండావు ?

ఇంద్ర: పకీరప్పగాడోచ్చినాడు నాయినా.

జయ: అరె. (కాస్తముందుకొచ్చి) మన పకీరప్పగాడేకదా ?  యామిరా పకీరప్పా? బాగుండావా ! 

ఫకీ: బాగుండాను రెడ్డీ.

ఇంద్ర: పిచ్చినాకొడకా... యాటకత్తి చేతబట్టుకోనొచ్చినావు కదరా!

జయ: ఇంద్రప్పా. నువ్వు గమ్మునుండు.

నర్సింహ: ఆ బస్తాలో యేముందిరా?

ఫకీ: నాబస్తాలో యాదుంటాది నర్సప్పా?   బాంబులేగదా వుండేది?

ఇంద్ర: తిక్క నాయాలా. యాదానికి తెచ్చినావురా బాంబులు?

ఫకీ: ఇయి నాపనిముట్లు ఇంద్రప్పా. నాపనిముట్లు నాతోనే గదా వుండాల?

జయ: (సంబరంగా) చూసినావురా వాని కమిట్‌మెంటు? అందరికీ ఇట్ట కమిట్‌మెంటుంటే ఈ దేశం యానాడో బాగుపడుండేది గాదూ?  ఏమిరా పకీరు. ఎట్లుండాదిరా మనపల్లె?

ఫకీ: యామి చెప్పేది రెడ్డీ? మిరంతా సొగసుగా సిటీలో సెటిలైపోయుండారు. ఆడమామొకం జూసేటోళ్లే లేకపోయిరి. ఇప్పుడు ఇంటి బైట కూసున్న ఆడోళ్లు గూడ మనల్ని జూసి లేచి లోపటికి పోయేదిలా. మమ్ముల్ని జూసి కూడా ఆడనేగూసోని కబుర్లాడుకుంటాండారు. భయపడేదిలా, సిగ్గుపడేదిలా, కోట శ్రీనివాసరెడ్డి పేక్షను పండుకొని చాన్నాళ్లాయె. ప్రకాష్‌రాజ్ నాయుడి పేక్షను యాడుందో ఎడ్రస్సేలేకపాయె. అవుమానంగా వుండాది రెడ్డీ. కాలం యట్ట మారిపోయింది రెడ్డీ.

ఇంద్ర: అరేయ్ మెంటల్ నాకొడకా. మళ్ళా ఫేక్షనిజం చెయ్యమంటాండావా యాందిరా?

ఫకీ: అట్లగాదు ఇంద్రప్పా. యాదానికైనా మనం బలంగా వుండాలగదా?

ఇంద్ర: మా బలానికేందిరా? ఈ సిటీ మాది. మారాజ్యం. మాకన్నుపడిన జాగా మాది. ఈ స్టేటులో పొలిటికల్ పవరు మాది. ఇంగ ఏమికావాల్రా?

నర్సింహ: మాకూ, మా చుట్టాలకూ ఈ సిటీలో తక్కువలో తక్కువ నూరు దేవేంద్ర భవనాలుండాయిరా. యామనుకుంటాండావు? కాంట్రాక్టులన్నీ మనవేగదరా?

ఫకీ: (జయప్రకాష్‌తో) ఈ సిటీ ఏంది రెడ్డీ ఇంత అద్వాన్నంగా వుండాది? మీరందరు వుండికూడా చానా గోరంగావుంది పరిస్థితి. ఏంది మీరు చేసిన కబ్జాలు? అదేందో కేబీఆరు పార్కంట. ఆడ ఎన్నెన్ని ఎకరాలు వేస్టు? ఇంగా బొటానికలు గార్డెనంట-సంజీవయ్య పార్కంట-ఇందిరాపార్కంట-కృష్నాకాంతు పార్కంట-పబ్లిక్కు గార్డెనంట- పార్కులేంది పార్కులు? వందల ఎకరాలు వేస్టుగాదూ? గవర్మెంటు కాలేజీలూ, ఆస్పటళ్లు, ఆపీసులు- యాడ జూసినా జాగాలు మొత్తం వేస్టుగా పడుండాయి. ఇన్ని పెద్ద పార్కులుండాయిగదా- ఈ పొద్దు ఒక్క వెయ్యిమంది జనాలైనా వాకింగ్ జేస్తాండారా? ఎంతవేస్టు? మేము యీడుంటే ఇట్టా జరుగునా రెడ్డీ?

నర్సింహా: వుంటే.. ఏమి చేసేటి వాళ్లురా మీరు? 

ఫకీ : ఆ పార్కులూ, కాళీ జాగాలూ కబ్జా చేసుండేవాళ్లంగాదూ? ఆ కేబీఆరు పార్కులో నాలుగు మల్టీప్లెక్సులూ, పది షాపింగ్  కాంప్లెక్సులూ కట్టేటోళ్లంగాదూ? వేరే పార్కులంతా రిసార్టులూ, పబ్బులూ, క్లబ్బులూ, కేసినోలూ పెట్టేటోళ్లంగాదూ? 

జయ : అరే పకీరూ. (ధృడ నిశ్చయంతో) నీయబ్బతోడు. ఈ పొద్దునుండి మన ప్రోగ్రాం మార్చేస్తాండా చూడురా. 

ఇంద్ర : నాయినా, ఒద్దునాయినా. 

జయ : మనమేంది మన సంప్రదాయమేంది? వీరుడు వీరుని మాదిరిగానే వుండాల. ఇగ జూస్కో నా పెద్ద కుమారుడు ఇంద్రసేనా రెడ్డి ఈ మెగాస్టేటు మొత్తం పొలిటికల్ మాఫియా లీడరై, టోటల్‌గా పాలిట్రిక్సు నడిపిస్తాడు. నా చిన్న కుమారుడు నర్సింహనాయుడు యువరత్నాలను కూడగట్టి ల్యాండ్ మాఫియా నాయకుడై స్టేటంతా కబ్జాలు చేయిస్తాడు. నా తమ్ముడు సమరసింహా రెడ్డి మైనింగ్ మాఫియా, నా మేనల్లుడు చెన్నకేశవ రెడ్డి ఇసక మాఫియా చూసుకుంటారు. ఇంగ ఏమైనా మాఫియాలుంటే నేనే డైరెక్టుగా చూసుకుంటా. అన్ని మాఫియాలూ సూపర్‌వైజ్ చేస్తా. ఇదే నా ప్రతిగ్న. 

ఇంద్ర : మంచిది నాయినా. నీ ఆగ్నె పాటిస్తాం. 

నర్సింహ: నీకు మంచిపేరు తెస్తాం నాయినా. 

జయ : మన పకీరప్పగానికి ఏదైనా మంచి స్లమ్ ఏరియాలో 25 రేకుల షెడ్డు జూడండి. పెండ్లాంపిల్లల్ని తెచ్చుకుంటాడు. రేపే మన పనులు మొదలుపెట్టండి. ఫకీరప్ప హుషారుగా బైటికెళ్లి, నేమ్‌ప్లేట్‌లో వున్న ''రిటైర్డు'' అనే పదాన్ని వేటకత్తితో గీకి పారేశాడు.

-ఎస్పీ

 

Read Also

 
Related News
JournalistDiary