India / Time Pass
ప్రజాస్వా(హా)మ్యంలో పిచ్చోడు
1191 days ago

పార్టీ ఆఫీసులోకి మొదటిసారి అడుగుపెట్టిన సామాన్యరావుని ఆఫీస్ సెక్రట్రీ ఎగాదిగా చూశాడు. 'చీకట్లపల్లె' నియోజకవర్గం నించి పోటీ చెయ్యడానికి టికెట్ కావాలంటూ సామాన్యరావు పెట్టుకున్న దరఖాస్తు అందుకుంటూ ''మీకు మన పార్టీలో 'సభ్యత ఉందా?" అని సీరియస్‌గా అడిగేడు. సామాన్యరావు ఆ ప్రశ్నలో ధ్వనించిన 'జోక్'ని ఎంజాయ్ చేస్తూ ''నిన్నటిదాకా అసభ్యుణ్ణే. ఇవేళే 'అసభ్యత' నించి బయట పడ్డాను" అంటూ 'సభ్యత్వ రసీదు' చూపించేడు. ఆఫీసు సెక్రట్రీకి ఆ ముక్కలు అర్థం కాలేదు గనక అతను నవ్వలేదు. సామాన్యరావుని తిన్నగా సెలక్షన్ కమిటీ దాక్కుని ఉన్న గదిలోకి తీసుకెళ్ళి అక్కడున్న ఓ బడా మోతుబరి చెవిలో గుసగుసలాడేడు.

మోతుబరి సామాన్యరావుకేసి విసుగ్గా చూసి ‘‘ఇయేళ పార్టీలో జేరి ఇప్పుడే టిక్కెట్టు కావాల్నంటే ఎట్టప్పా ?'' అన్నాడు. 

''మా నియోజకవర్గానికి నాకన్నా మెరుగైన అభ్యర్థిని మీరు ఎంపికచేస్తే సంతోషంగా సహకరిస్తా’’ అన్నాడు సామాన్యరావు.

దరఖాస్తు చూసి "ఏందీ? నువ్వు రిటైరైన ప్రొఫెసరువా?" అని అడిగేడు మోతుబరి. 

''అవును''

''అంతచదువు చదివి నీకిదేం పోయేకాలం అయ్యోరా? నీది యా సబ్జెక్టూ?" 

''పాలిటిక్స్'' 

''బాగానే ఉండాదిగాని అయ్యోరా, పార్టీకోసం రేత్రనక పగలనక సెవటోడ్చి పనిచేసిన కార్యకర్తలుండంగా నీకు టికెట్టు ఎట్లా ఇచ్చేదప్పా?" 

‘'బైటకూచ్చున్న మీ పార్టీ నాయకులూ, కార్యకర్తలు చాలామంది నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు దాదాపు అందరూ పైరవీకార్లే. 'పనులు చేయించి పెడతాం' అంటూ ఎడా పెడా జనందగ్గిర సిగ్గులేకుండా డబ్బులు దండుకునే వాళ్ళకీ, ప్రజాప్రతినిధులుగా ఎన్నికై కోట్లు సంపాదించే వాళ్ళకీ టికెట్లివ్వకుండా వుంటేనే... పార్టీకి క్షేమం'' 

''మా వోళ్ళ బయోడేటా నాకు చెప్తున్నావేందప్పా? కార్యకర్తలు పైరవీలు చేసుకోకపోతే ఎట్లా? ఎమ్మెల్లేలూ, ఎంపీలూ సంపాదించుకోకండా ఎట్లప్పా? నీలాగ నెలనెలా పెన్షను రాదుకదా అళ్ళకి? ఐనా సదువుకున్నోళ్ళ కెందుకయ్యా ఈ రాజకీయాలు? మేవంతా లేమా ఏంది?"

"చూడండి. పార్లమెంటుకి ఎన్నికయే వాళ్ళు మొత్తం దేశ ప్రజలందరి సంక్షేమంకోసం చట్టాలు చెయ్యవలసి ఉంటుంది. రాజ్యాంగాన్ని ప్రజల అభివృద్ధికి తగినట్టు అమలు చేయించవలసి ఉంటుంది.  అసలు ఏదీ పట్టించుకోకుండా, ఎప్పుడూ పార్లమెంటులో నోరు విప్పి మాటాడకుండా అప్పనంగా ప్రజాధనంతో వొచ్చే సౌఖ్యాలు అనుభవించే నిరక్షర కుక్షుల్ని బడా వ్యాపారస్తుల్నీ పార్లమెంటుకి పంపకపోవడం చాలామంచిది’’

‘‘ఏందయ్యో ? సదువురానివోళ్ళని ఎగతాళి చేస్తావుండావే? ఆళ్ళేగదయ్యా పెజాసోమ్యానికి పునాదిరాళ్ళూ ? మన ఓటర్లలో శానామంది సదువు రానోళ్ళే గదా ? ఆళ్ళేగదా మనకి శ్రీరామరక్ష?’’

‘‘నా విజ్ఞతనీ, విజ్ఞానాన్నీ పార్టీకి, ప్రజలకి సమర్పించుకోవాలని టికెట్టు కోసం దరఖాస్తు పెట్టేను. మీ పార్టీ ఆశయాలు నాకు నచ్చేయి. ముఖ్యంగా పేద ప్రజల జీవనంలో మంచి మార్పు తేవాలని నా అభిప్రాయం. ఆ తర్వాత మీ ఇష్టం.’’

‘‘సర్లే సర్లే. మేవంతా కంటిమీద కునుకు లేకుండా పరితపించేది ఎవురికోసం? ఆ పేద ప్రజలకోసం కాదూ. ఇంతకీ నీ యెనకాల డబ్బెంతుందో చెప్పరాదూ.’’

సామాన్యరావుకి అర్థం కాలేదు. ‘‘రిటైరయింతర్వాత అందిన డబ్బుతో అమ్మాయి పెళ్ళిచేశాను. ఇప్పుడు నెలనెలా వొచ్చే పెన్షనే నా ఆదాయం’’ అన్నాడు.

‘‘ఏడిసినట్టేవుంది. ఎంపీ ఎలచ్చనుకి ఎంత కరుసవుద్దో తెలుసా?..కోట్లు.. ఏబైకోట్లు నేతాజీ చేతిలో పెట్టు. ఎలచ్చన్ కర్చులకోసం ఇంకో ఏబైకోట్లు సెపరేటుగా పెట్టుకో. అట్టయితేనే టిక్కెట్టు. ఏంది?.. ఇంతకీ నీది ఏ కులమప్పా?’’

సామాన్యరావు తటపటాయించేడు. మోతుబరి రెట్టించిన మీదట చెప్పక తప్పలేదు.

‘‘ఓర్నీతస్సాదియ్యా. బలేవోడివప్పా అయ్యోరూ. నీకులపోడికి ‘సీకట్లెపల్లె’ టికెట్టెవుడిస్తాడు? నేనింకా నువ్వేదో ‘బలిసిన’ అగ్రకులపోడివనుకుంటాడా. పోపో. మా టైం యేస్ట్ జెయ్యబాక.’’ 

‘‘బలిసిన అగ్రకులాల వాళ్ళకే టిక్కెటిస్తారా?’’

‘‘అయ్యోరా. ఇందులో శానా గొడవలుండాయ్. నియోజకవర్గంలో కులాల వారీ జెనాబా సూడాల. కేండేట్‌కి డబ్బూదన్నూ, మందీ మార్బలం ఎంతుందో సూడాల. గెలిసే వోణ్ణే నిలబెట్టాలప్పా. ఇగ నువ్ బోయి నీపన్జూసుకో.’’ 

‘‘మామూలుగానే స్ర్తీలకి ఈ సారికూడా సరైన ప్రాతినిధ్యం లేదనుకుంటా?’’ 

‘‘అది నీకెందుకప్పా ? ఇప్పటికే బుర్రలు యేడెక్కి సస్తావుండాం. నువుబో.’’

‘‘పోన్లెండి. చీకట్ల పల్లె టికెట్టు ఎవరైనా మంచి వ్యక్తికివ్వండి’’ అంటూ లేచాడు సామాన్యరావు.

‘‘అదంతా మేం చూసుకుంటాంలేగానీ నువ్విగబో.’’

లేచి వెళ్తున్న సామాన్యరావుకి ఫ్యాక్షనిస్టు సుగుణాకరరావు తన అనుచరవర్గంతో కలిసి వస్తూ ఎదురయేడు. వెంటనే వెనక్కి తిరిగి మోతుబరి దగ్గరికెళ్ళి ‘సుగుణాకర్రావు ఇక్కడికి ఎందుకొచ్చేడో తెలీదు. అతను చాలా హత్యకేసుల్లో మొదటి ముద్దాయి. హైదరాబాద్‌లో పేరు మోసిన భూకబ్జాదారు. ప్రజాకంటకుడు. అతనికి మాత్రం టికెట్టివ్వకండి’’ అన్నాడు.

‘‘తిక్కతిక్కగా ఉండాదా ఏంది?  మా నాయకుణ్ణి పట్టుకుని నోటికొచ్చినట్టు వాగతా వుండావే ? ఆయన ‘సీకట్లపల్లె’ నించి మా పార్టీ తరపున పోటీ చేస్తాండాడు. ఇది ఎప్పుడో కరారైపోయిందిగదూ’’అన్నాడు మోతుబరి. సామాన్యరావు షాక్ తిన్నాడు.

సుగుణాకర్రావు బృందం వెనకే ‘ధర్మనందనరావు’ తన బృందంతో రావడం చూసి సామాన్యరావు చాలా ఆందోళనపడ్డాడు.

‘‘ధర్మనందనరావు చెయ్యని అధర్మంలేదు. అనేకసార్లు జైలుకెళ్ళొచ్చిన నేరస్తుడు. అమాయకుల ప్రాణాలు తీశాడు. అక్రమంగా వేలాది కోట్లు గడించేడు’’ అన్నాడు మోతుబరితో.

‘‘ఇలాంటి దుర్మార్గులని ప్రజాప్రతినిధులుగా పంపించాలనుకుంటున్నారా? నాగరిక సమాజవేనా ఇది?’’ ఆవేశం తన్నుకొచ్చింది.

‘‘నోరుముయ్యెహ. స్టేట్‌లో మేం ఇంకెవరెవరికి టికెట్టిచ్చుండామో తెలిస్తే గుండె పగిలి సస్తావ్. పో ఈడనుంచి’’ అని గట్టిగా కసిరేడు మోతుబరి.

‘‘ఇది అక్రమం. ఈ అక్రమాన్నెదిరిస్తాను. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాధనంతో నడిచే ఎన్నికలు, పార్లమెంటరీ పరిపాలనా ఓ తమాషాగా దిగజారిపోతే మతిమంతులంతా నోరుమూసుక్కూర్చోవడమేనా ? ఇదేం ప్రజాస్వామ్యం?’’ అంటూ రెచ్చిపోయి అక్కడున్న మైక్ అందుకున్నాడు సామాన్యరావు.

‘‘పాపం, ఈడికి పెజాసోమ్యం పిచ్చిపట్టింది. పిచ్చాసుపత్రిలో జేర్చి జేగర్తగా సూసుకోమని చెప్పిరాండిరా’’ అన్నాడు మోతుబరి. 

కార్యకర్తలు సామాన్యరావు నోరుమూసి, అతన్ని పిచ్చాసుపత్రికి మోసుకుపోయేరు. అభ్యర్ధుల ఎంపిక ప్రజాస్వామ్యయుతంగానూ, సామరస్య పూర్వకంగానూ ముగిసింది. ఆ తర్వాత కూడా

ప్రజానీకం నేతలు ఇచ్చినంత డబ్బుతీసుకుని, పోసినంత సారాయి తాగి శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. స్వస్తి.

- ఎస్పీ

 

Read Also

 
Related News
JournalistDiary