India / Time Pass
పెద్దమనుషులు (చిరునాటిక)
1191 days ago

పాత్రలు(2): 1. పెద్ద మనిషి-1

                  2. పెద్దమనిషి-2.

                  (సావిట్లో కుర్చీలో కూచుని పెద్దమనిషి-2 వార్తా పత్రికలో లీనమైపోయి చదువుకుంటూండగా పెద్దమనిషి-1 ప్రవేశం)

 

పె-1: (వస్తూనే రెండో కుర్చీలో కూలబడుతూ) ఏవండోయ్ భావగారూ.. మిమ్మల్నే.. ఏవిటి విశేషాలు?

పె-2: (చిరు కోపంతో) విశేషాలకేం గానీ బావగారూ ప్రతీసారీ మీరు నన్నిలా ‘‘భావగారూ భావగారూ’’ అంటూ ఒత్తి ఒత్తి నలిపేయడమేమిటండీ నాకర్థంకాదూ?

పె-1: (లౌక్యం కలిసిన హాస్యంతో, చనువుగా) ఎంతమాట భావగారూ.. ఎంతో ఉన్నతవైన భావాలు ఎన్నో కలిగినటువంటి మిమ్మల్ని ఒఠ్ఠి ‘‘బావగారు’’ అని పిలుస్తానా? అలాకాకుండా ‘‘భావగారు’’ అని పిలుచుకోవడంలో నాకు మహదానందమూ, ఆత్మ సంతృప్తిన్నీ. ఏది? అర్థంకాలా?

పె-2: (పొగడ్తకి పడిపోయి) ఏదో అంతా మీ అభిమానం బావగారూ.

పె-1: (చనువుతో కూడిన మురిపెంతో) ఇంతకీ పేపరంతా తమరే చదివేసుకోడవేనా - మాక్కూడా ఆ విశేషాలు కాస్త చెవినివేసేదుందా భావగారూ..?

పె-2: చెప్పాలంటే పెద్దవిశేషవేవుంది  బావగారూ. ఇంకా మనదేశంలో న్యాయం-ధర్మం బతికేవున్నాయనిన్నీ, అన్నిచోట్లా కాకపోయినా, అక్కడక్కడా నిజాయితీగా డ్యూటీచేసే జాతిరత్నాల్లాంటి ఆఫీసర్లింకా మనమధ్య వున్నారనిన్నీ స్పష్టంగా తెలుస్తోంది బావగారూ.

పె-1: (ఆశ్చర్యంతో కళ్లు పెద్దవిచేసి) అలాగునటండీ భావగారూ? ఆ విశేషవేదో కాస్త నా చెవినివేసి పుణ్యం కట్టుకోండి.

పె-2: తప్పకుండా బావగారూ. ఈ వార్త వింటే మీరేకాదు-మనలాంటి బాధ్యతగల పౌరులంతా కూడా అమందానందకందళిత హృదయారవిందులు కావడం ఖాయం.

పె-1: (చూపుడు వేలితో బెదిరిస్తున్నట్టుగా, చనువుగా) ఐతే అదేవిటో వేంఠనే చెప్పాలి భావగారూ. లేకపోతే మీ మీద కాస్త దౌర్జన్యం చేసయినా ఆ విశేషవేవిటో తెలుసుకుతీరతాను.    

పె-2:  అంతొద్దు బావగారూ. నిన్న మన ఏసీబీ వాళ్లు ఓ అద్భుతం చేశారు. ఒక మహా అవినీతి తిమింగలాన్ని చాకచక్యంగా వలేసి పట్టుకున్నారు.   

పె-1:  (కాస్త ఎక్కవ ఆశ్చర్యం నటిస్తూ, కళ్లు పెద్దవిచేసి) ఆహా!

పె-2:  అతగాడి అవినీతి ఎంతటి తారాస్థాయికి చేరిందంటే (పేపర్లోకి చూస్తూ) రెండొందల ఎకరాలపొలం, పన్నెండు బంగళాలు, నలభయ్యారు ఇళ్ల స్థలాలు, అరడజను కార్లు, ఇరవై కేజీల బంగారం, నాలుగు క్వింటాళ్ల వెండి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దలిస్టే అవుతుంది బావగారూ.

పె-1: హమ్మహమ్మ. వీడెవడో గుండెలు తీసిన బంటేనండోయ్.

పె-2: ఇంకా వినండి బావగారూ (పేపర్లోకి చూస్తూ) అతగాడి నివాస భవనంలో- చివరికి బాత్రూముల్లోనూ, స్టోర్రూములోనూ, పాత న్యూస్‌పేపర్ల అడుగునా - ఎక్కడబడితే అక్కడ - పత్రాలూ, నోట్ల కట్టలూ, బాండులూ అన్నీయిన్నీకావు బావగారూ. 

పె-1: సందేహం లేదు భావగారూ వీడు గజలంచగొండి. ఇంతకీ వాడి అక్రమార్జన తాలూకు మొత్తం వేల్యూ ఎంతుంటుంది భావగారూ.

పె-2: చెవతా. గుండె చిక్కబట్టుకుని వినండి బావగారూ (పేపర్లోకి చూస్తూ) తిమింగలం మింగిన ఆస్తుల మొత్తం విలువ అక్షరాలా ఏడువందల అరవయ్యెనిమిది కోట్ల పైమాటే!

పె-1: (యమా బ్రాడ్ ఎక్స్‌ప్రెషన్) య్యేడువందల అరవయ్యెనిమిది కోట్లే.. దరిద్రుడు.. ఏం చేసుకుంటాడా ఆస్తి?

పె-2: ఇప్పుడయ్యిందిగా శాస్తి? అరెస్టై జైల్లో వూచలు పదేపదే లెక్కబెడుతున్నాడు.. హిహి..

పె-1: భావగారూ. ఇది.. మనం ఆ ఏసీబీ వాళ్లని వేనోళ్ల కొనియాడి తీరాల్సిన సందర్భవంటే నమ్మండి. ఈ రోజుల్లో కూడా అంత సిన్సియర్‌గా డ్యూటీ చేసే ఏసీబీలాంటి సంస్థ ఒకటివుండటం మనదేశానికే గర్వకారణం.

పె-2: కాదు మరీ!?

పె-1: ఐనా వాడేం మనిషండీ? ప్రజాధనాన్ని నెలనెలా జీతం రూపంలో పుచ్చుకుంటున్నా కూడా అది చాలక కోటాను కోట్ల అక్రమార్జనలా? ఇలాంటి చీడపురుగుల్ని ఏరిపారేయాలి భావగారూ. 

పె-2: (కృతిమ గాంభీర్యంతో) క్షమించండి మీతో నేను ఏకీభవించలేను బావగారూ. ఇలాంటి దేశద్రోహుల్ని పబ్లిగ్గా రాజధాని నడిబొడ్డున ఉరితీసిపారెయ్యాలి అంతే. మీరు నా మాట కాదనకండి.

పె-1: అంతేకాదు భావగారూ. (కోపంగా పళ్ళు కొరుకుతూ) వాణ్ణి కత్తికో కండగా నరికిపారెయ్యాలి. వాడిమీద మీరు జాలి పడకండి.

పె-2: అవసరమైతే చట్టాన్ని సైతం మార్చిపారేసి వాడి ఆస్తులన్నీ పేదవాళ్ళకి పంచిపెట్టాలి.

పె-1: అసలు చట్టంతో నిమిత్తం లేకుండా అడవిలోకి తీసుకెళ్ళి, కాల్చిపారేసి ఎన్‌కౌంటర్లో చచ్చిన గుర్తుతెలియని నక్సలైటు అని ప్రకటిస్తే అడిగే వాడెవడు?

పె-2: పరమ తుచ్ఛుడు.

పె-1: పరమ నీచుడు.

పె-2: ప్రజాద్రోహి. కాదు - దేశద్రోహి.

పె-1: ఇలాంటి దుర్మార్గుడికి వ్యతిరేకంగానూ, ఏసీబీకి మద్దతుగానూ మనం ఓ ఉద్యమాన్ని లేవదియ్యాలి. 

పె-2: తప్పకుండా బావగారూ. రేపే మా కాలనీ జెనాన్ని పురమాయిస్తాను. ఊరేగింపు తీద్దాం.

పె-1: ఆ వూరేగింపు మన సిటీ చరిత్రలో ఓ అద్భుతమైన ఘట్టం కావాలి.

పె-2: మీ సపోర్టుంటే దూసుకుపోమా? ఇక చూస్కోండి. 

పె-1: అవునూ. ఇంతకీ ఆ అవినీతి తిమింగలం పేరేమిటి భావగారూ?

పె-2: (పేపర్లోకి చూస్తూ చాలా కేజువల్‌గా) వాడిపేరూ.. ‘బకాసురమూర్తి’.

పె-1: (షాక్) య్యేమిటీ? బకాసురమూర్తా? కొంపదీసి ఆ చీఫ్ కమిషనర్ కాదుగదా?! సరిగ్గా చూసిచావు. (అసహనం).

పె-2: ( బిక్కమొగం వేసి పేపర్లోకి చూస్తూ) అవును బావగారూ. చీఫ్ కమిషనర్ బకాసురమూర్తే. ‘కమిషన్లు తిని తెగబలిసిన కమిషనర్’ అని పేపరువాడు టైటిలు కూడా పెట్టేడు. వాడు మీకు తెలుసా?

పె-1: (ఉగ్రుడైపోయి) నోటికొచ్చినల్లా ‘వాడూ-వీడూ’ అనకు. నాకు తిక్కరేగిందంటే...

పె-2: (ఆశ్చర్యం) అదేవిటి?

పె-1: (పట్టించుకోకుండా, ఒళ్ళుమరిచి, రెచ్చిపోతూ) అసలేమిటయ్యా ఇదీ? ఒక తీరూ-తెన్నూ లేదా? అంతా ఆ ఏసీబీవాళ్ళ ఇష్టవేనా? మరీ ఇంత దారుణవా? న్యాయం-ధర్మం లేవా? పాపం-పుణ్యం చూడరా? మానవత్వం మంటగలిసి పోయిందా? మంచీ-చెడ్డా లేకుండా, వెనకా-ముందూ చూడకుండా ఇలా రెచ్చిపోతారా? పట్టుకోవడానికి అనేకమందుండగా మన బకాసురమూర్తే దొరికేడా? లంచాలు పుచ్చుకుని కోట్లకి పడగలెత్తినవాళ్ళు ఎంతమందిలేరు? వాళ్ళందర్నీ విడిచిపెట్టి, తేరగా దొరికేడు కదాని మన కులస్తుడు - పెద్దమనిషి - బకాసురమూర్తిగారినే బలిపశువుని చేస్తారా?... పోతార్రోయ్ - రౌరవాదినరకాలకి పోతార్రామీరు.

పె-2: (ఆశ్చర్యం, బాధ, దిగులు, పశ్చాత్తాపం) ఏవిటి బావగారూ. బకాసురమూర్తిగారు మన కులస్తుడా? అయ్యో. నాకు తేలీదు సుమండీ. ఎంత అన్యాయం జరిగిపోయిందీ? పాపం. ఆ కుటుంబం ఇప్పుడేవైపోతుంది? నా కడుపు తరుక్కుపోతుంది బావగారూ.

పె-1: (ధృడంగా) ఏడిశావులే. అన్యాయం జరిగిందని చవటలా చింతిస్తూ కూర్చుంటావా?

పె-2: (కించపడి) అబ్బే. నేననేది అదికాదు బావగారూ.

పె-1: (రగిలిపోతూ, పిడికిలిబిగించి, తనేదో ఉద్యమనేత అయినట్టు పోజుపెట్టి) ఒక అమాయకుడికి - మన కులస్తుడికి - జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలయ్యా. ఆయనకి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేద్దాం. రాజకీయ దురుద్దేశాలు అంటగడదాం. మన కులసంఘాల్ని కదిలిద్దాం. ధర్నాలూ, రాస్తారోకోలూ చేద్దాం. ఆమరణ నిరాహార దీక్షలకైనా సిద్ధం కావాలి.

పె-2: పరిపాలన స్తంభింపజేద్దాం. న్యాయం జరక్కపోతే ప్రాణత్యాగాలు చేసి అమరవీరులమవుదాం.

పె-1: పెట్టుకోక పెట్టుకోక మన కులంతో పెట్టుకుంటారా ? మనకులం పవరేంటో చూపిద్దాం.

పె-2: మన కులానికేం తక్కువ ? జనాభాలో, బలంలో, బలగంలో మనకెవరు సాటి ?

పె-1: మనం కళ్లెర్రజేస్తే అంతా గజగజ. 

పె-2 : మంచినీళ్ల ప్రాయంగా మర్డర్లు చేసే చరిత్ర మనది.

పె-1: మన కులానికే గనక అన్యాయం జరిగితే ఈ రాష్ట్రం మొత్తం అగ్నిగుండమవుతుంది. ఇదే మన హెచ్చరిక. మన కులం ఐక్యత...(చెయ్యెత్తి నినాదం)

పె-2: వర్ధిల్లాల్లి. (చెయ్యెత్తి నినాదం)

పె-1: మన కులం ఐక్యత...

పె-2: వర్ధిల్లాలి. 

(నినాదాలిస్తూనే ఇద్దరూ కలిసి ఆ న్యూస్ పేపర్ని ముక్కలు - ముక్కలుగా, కసిగా చించిపారేస్తారు).

 

గమనిక: ఈ చిరునాటికని సరదాగా - వీకెండ్స్‌లో ఏదైనా ఫంక్షన్‌లోగాని, చిన్నచిన్న గేదరింగ్స్‌లోగాని - చివరికి ఏ ఇంటి హాల్లోనైనా - సులువుగా వెయ్యొచ్చు. ఒక న్యూస్ పేపరూ, రెండు కుర్చీలూ, వీలైతే ఓ టీ పాయ్ తప్ప వేరే సెట్ ప్రాపర్టీ అవసరం లేదు. మేకప్ అక్కర్లేదు. ఓపికుంటే పేంటులకి బదులు పంచెలు కట్టుకోవచ్చు; కండువాలు వేసుకోవచ్చు. ఇద్దరూ కళ్ళజోళ్ళు పెట్టుకోవచ్చు. 

ఈ నాటిక వెయ్యడానికి పర్మిషన్ అవసరం లేదు. ఫ్రీగానే వేసుకోవచ్చు. అంచేత ఈ నాటికని ఎవరైనా, ఎక్కడైనా వేసి, ఆనందించినట్టు తెలియజేస్తే రచయిత సంతోషిస్తాడు. తెలియజెయ్యకపోయినా ఏమీ అనుకోడు.

రచయిత ఈ-మెయిలు : veeyespee90s@gmail.com

-ఎస్పీ.

 

Read Also

 
Related News
JournalistDiary