India / Crime
బోఫార్స్.. ఇంకోసారి !
70 days ago

30 ఏళ్ల క్రితం జరిగిపోయిన ఒక పాపాన్ని ప్రభుత్వం మళ్లీ తవ్వితీస్తోంది. రాజీవ్ గాంధీ ప్రధానిగా వున్న కాలంలో రక్షణశాఖ ఇటలీకి చెందిన బోఫోర్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన హొవిట్జర్ గన్స్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరమీదికొచ్చింది. సీబీఐ, పార్లమెంటరీ కమిటీ ముందుకొచ్చి బోఫోర్స్ వ్యవహారంపై తిరిగి దర్యాప్తు చేపట్టడానికి సిద్ధమంటూ ప్రకటించింది.

 

1989లో బయటపడిన ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న మధ్యవర్తి విన్ ఛద్దా, ముగ్గురు హిందుజా సోదరులతో పాటు ఏబీ బోఫోర్స్ అప్పటి అధ్యక్షుడు కూడా వున్నారు. వీరితోపాటు ఆయుధాల డీలరైన ఖత్రోచీ, అప్పటి డిఫెన్స్ కార్యదర్శి ఎస్.కె. భట్నాగర్లపై కూడా సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసింది. రూ. 1,437 కోట్ల కొనుగోలు ఒప్పందం ప్రకారం స్వీడన్ కు చెందిన ఆయుధాల తయారీ కంపెనీ ఏబీ బోఫోర్స్ 155 mm రకం నాలుగు వందల హొవిట్జర్ గన్స్ ను
భారత్ ఆర్మీకి సరఫరా చేయాలి. ఈ ఒప్పందం భారత ప్రభుత్వానికి, స్వీడన్ కంపెనీకి మధ్య 1986 మార్చి 24న జరిగింది. అయితే.. 1987లో స్వీడన్ కు చెందిన ఒక రేడియో భారత రాజకీయనాయకులకు, డిఫెన్స్ కి చెందిన కొందరు అధికారులకు స్వీడన్ కంపెనీ ముడుపులు చెల్లించిందంటూ ఓ వార్తను ప్రసారం చేసింది. అప్పట్లో హిందూ పత్రిక పూర్తి వివరాలతో ఓ పరిశోధనాత్మక వార్తను ప్రచురించింది. దీని ప్రకారం.. రూ. 64 కోట్లు లంచాలుగా చేతులు మారాయి. అయితే.. ఈ కేసును ఆనాటి ఢిల్లీ సీబీఐ కోర్ట్ 2011లో కొట్టేసింది. ఖత్రోచిని విముక్తుణ్ణి కూడా చేసింది. దేశం విడిచిపోయిన ఖత్రోచి ప్రాసిక్యూషన్ కోసం తిరిగిరాలేదు. ఇక.. ఖత్రోచి 2013లో మరణించాడు. ఇతనితోపాటు మాజీ డిఫెన్స్ కార్యదర్శి భట్నాగర్, విన్ ఛద్దా, బోఫోర్స్ అధినేత కూడా మరణించారు. ఢిల్లీ హైకోర్టు 2005లో హిందుజా సోదరులతో పాటు బోఫోర్స్ పై పెట్టిన అభియోగాల్ని కూడా కొట్టేసింది.

 

సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయడానికి దాదాపు 250 కోట్ల రూపాయల్ని వృధా చేసి, ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం వేసిందన్నది విమర్శకుల మాట. అంతకుముందే.. మరో న్యాయాధిపతి ఢిల్లీ హైకోర్టు జస్టిస్ డిజెడి కపూర్ దివంగత మాజీ ప్రధాని రాజీవ్ ని కూడా ఈ కేసులో ఫోర్జరీ అభియోగాలనుంచి విముక్తుణ్ణి చేశారు. ఇది బోఫోర్స్ కుంభకోణం కథాకమామిషు!

 

రూ. 64 కోట్ల ముడుపుల విచారణ కోసం 250 కోట్లు ఖర్చు చేసి, కేసును నీరుగార్చేసిన వైనాన్ని బో'ఫార్స్' అంటే తప్పేముంది? దాదాపు 27 సంవత్సరాల తర్వాత మళ్లీ దీన్ని దర్యాప్తు చేస్తామంటూ ఇదే సీబీఐ వ్యవస్థ ముందుకు రావడంలో ఔచిత్యం ఏమిటన్నది ప్రశ్న. కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తోందంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన సీబీఐ వ్యవస్థే ఇప్పుడు కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆజ్ఞానుసారమే ఈ దర్యాప్తునకు అంగీకరించిందా అన్నది ప్రశ్న.

 

ఇప్పటికీ కేంద్రప్రభుత్వం దర్యాప్తుల పేరుతో నిఘా సంస్థల్ని తమమీద ఉసిగొల్పి.. కక్షసాధింపులకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ బీజేపీ యంత్రాంగాన్ని తప్పు పడుతోంది. తాజాగా.. బోఫోర్స్ పునర్విచారణ కూడా ఇందులో భాగమే అంటూ విమర్శలు పడిపోతున్నాయి. ఖత్రోచీ అనబడే ఇటలీ వ్యాపారి సాక్షాత్తూ సోనియాగాంధీకి సమీప బంధువంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొన్నవాళ్లలో చాలామంది మరణించారు. 250 కోట్ల
ఖర్చుతో కొండల్ని తవ్వి కనీసం ఎలుకల్ని కూడా పట్టుకోలేని చందంగా వ్యవహరించిన సీబీఐ 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ విచారణకు తగుదునమ్మా అంటూ బయల్దేరడం హాస్యాస్పదమే !

 

Read Also

 
Related News
JournalistDiary