India / Time Pass
ఊరును ఏమార్చే సాములార్లు
1191 days ago

మావూరి మహిళా సమాజంలో ఏదో గొడవ 'అంటుకుందని' తెలిసి 'మంటలార్పడానికి' వూరి పెద్దలంతా హడావిడిగా తరలి వెళ్ళేరు.

మహిళా సమాజంలో యువసభ్యురాలైనటువంటి కుమారి అయోమయం అహల్యగారు ''కంప్యూటర్ స్వామిని కొలువగరారండీ'' అనే మకుటంతో వున్నటువంటి కరపత్రాలను పంచి పెట్టడానికి కృతినిశ్చయురాలై రావడం వల్ల  గొడవ 'రాజుకుందని' తెలిసింది. అంతేకాకుండా అహల్యగారి వెంట వచ్చిన భక్త బృందం 

'' తాజాగా ఇల వెలసినాడయా 

సరికొత్త దేవుడూ ఈయనేనయా

భక్తుల బ్రోవగ అవతరించిన 

కంప్యూటరు స్వామిని కొలువగరండోయ్''

అంటూ 'బృందరోదనం' లాంటి కోరస్ మొదలెట్టేరు. (ఆ యొక్క సాములారి ఆశ్రమంలో ఆధునిక కంప్యూటర్లు వుండటంచేత వారికా పేరొచ్చినట్లు తెలిసింది)

ఎప్పుడైతే ఈ సరికొత్త సాములారి ప్రసక్తి వచ్చిందో వెంటనే మహిళా సమాజం అధ్యక్షురాలు శ్రీమతి ఆజ్ఞానపు ఆనందలత గారికి చెప్పలేనంత కోపం తన్నుకొచ్చింది. 

''ఏం? నిన్నగాక మొన్నొచ్చిన మీ కంప్యూటర్ స్వామి అంత గొప్పవాడా ? మా భగవాన్ 'ఫైవ్‌స్టార్'  స్వామీజీ మహరాజ్ ముందు మీ కంప్యూటర్ స్వామి ఎందుకూ పనికిరాడు'' అని   కుమారి అహల్యగారిని రెచ్చగొట్టేరు.

''భగవాన్ కంప్యూటర్ స్వామి ముందు మిగతా స్వాములంతా అల్పులు'' అని ప్రకటించారు కుమారి అహల్యగారు. దాంతో ఆమెతో వచ్చిన భక్తబృందం ఈలలు వేసి చప్పట్లు కొట్టేరు. 

''అంటే మీ కంప్యూటర్ స్వామిని శ్రీశ్రీశ్రీ 'జెట్ విమానం' సాములారికన్నా గొప్పవాడని చెప్పే సాహసం చేస్తున్నావా?'' అంటూ వుద్రేకంతో వూగిపోయేరు శ్రీమతి నిరాలోచనం నీరజగారు.

''ఇంకా సందేహవా?'' అని ధీమాగా చెప్పేరు కుమారి అహల్యగారు.

''ఒళ్లు దగ్గిరుంచుకు మాటాడు. మా భగవాన్ ''గోల్డ్ బిస్కెట్ల'' స్వామీజీ గారిని ప్రత్యక్షంగాగాని పరోక్షంగగాని ఒక్కమాటంటే మర్యాద దక్కదు'' అని హెచ్చరించేరు శ్రీమతి నిరామయం నీలవేణిగారు. 

''అదే విధంగా మాయొక్క కులదైవమైనటువంటి పూజ్యశ్రీ 'డాలరు గుట్టల' సాములారి  గురించి అగౌరవంగా మాటాడితే వూరుకునేది లేదమ్మాయ్ '' అన్నారు శ్రీమతి అంధకారం అలివేణిగారు.

''నన్ను మీరెవరూ భయపెట్టలేరు. భగవత్ స్వరూపులైన పరం పూజ్యకంప్యూటర్ సాములారి స్థాయిని ఎవరు తగ్గించినా వూరుకోం'' అని చాటిచెప్పేరు కుమారి అహల్యగారు.

'భగవత్ స్వరూపుడా? అందుకు రుజువేమిటి?'' అనందలతగారి ప్రశ్న. 

''అనేక రుజువులున్నాయి. మా కంప్యూటర్ సాములారు మేఘమల్హరరాగం  ఆలపిస్తే వర్షాలు సమృద్ధిగా కురిసి   పంటలు తెగపండుతాయ్ తెలుసా?' అన్నారు అహల్య గారు.

''ఈసారి రాగం కాస్త ఎక్కువ ఆలపించినట్టున్నాడు. అందుకే మొన్న రాయలసీమలో కూడా అతివృష్టి'' అని నవ్వేరు నిరాలోచనం నీరజగారు.

''మా ఫైవ్‌స్టార్' స్వామీజి రాత్రి పూట కాలికి తడి అంటకుండా అరేబియా సముద్రం మీంచి నడిచెళ్ళిపోయి గల్ఫ్ భక్తులని దీవించి వొస్తుంటారు. శ్రీవారు గాలిలో ఎగురగల శక్తిమంతులు'' అన్నారు అజ్ఞానపు అనందలతగారు. 

''శ్రీ భగవాన్ 'డాలర్ గుట్టల' సాములారైతే రుతువుల్ని శాసించగలరు. తుఫాన్‌లను  శాంతింపచెయ్యగల అద్భుత శక్తులున్నాయి వారికి'' అని సగర్వంగా చెప్పేరు అంధకారం అలివేణి గారు.

''అలాగైతే మొన్న కోస్తాలో తుఫాన్‌ని ఆపేసి వుండొచ్చుగా ?'' అని అడిగేరు నిరామయం నీలవేణి గారు.

'' ఆ టైములో ఆయన వైట్‌హవుస్‌లో వున్నారు. అంచేత ఇక్కడ తుఫానొచ్చినట్టు తెలీదు'' అన్నారు అలివేణిగారు.

''ఏ వైట్‌హవుస్‌లో వున్నారో చెప్పండి'' అన్నారు అహల్యగారు.

''మీకెలా చెబితే అర్ధమవుతుందమ్మా? ప్రెసిడెంట్ ఒబామా మా సాములారి భక్తుడు. ఎప్పుడు తలుచుకున్నా మా'డాలర్ గుట్టల' సాములారు ఒబామా  ముందు ప్రత్యక్షం అవుతారన్నమాట. మా సాములారికి స్థలకాలాలు లేవు. ఒకేసారి రెండు మూడు దేశాల్లో దర్శనం యిస్తుంటారు'' అని వివరించి చెప్పేరు అంధకారం అలివేణిగారు.

''మొన్నామధ్య గ్రీస్ వాడికి ఆర్ధిక సంక్షోభం వొచ్చినప్పుడు మా 'గోల్డ్ బిస్కెట్ల' స్వామిజీ వారే నూటయేభై టన్నుల బంగారం సృష్టించి పెట్టి ఆ గ్రీకు వాణ్ణి  ఆదుకున్నారు'' అన్నారు నిరామయం నీలవేణిగారు. 

''ఈ భోగట్టా ఏ పేపర్లోనూ రాలేదు. మేం నమ్మం'' అన్నారు మిగతా వాళ్ళు.

''ఏమి మీ వెర్రి? భగవత్ స్వరూపులు ప్రచారం కోరుకోరుకదా?'' అన్నారు నీలవేణిగారు.

''మరైతే మన దేశానిక్కూడా బంగారం తయారుచేసి యివ్వొచ్చుగా?'' అని అడిగేరు అహల్యగారు.

''అజ్ఞానాంధకారంలో వుండి ఇలాంటి ప్రశ్నలడుగుతారు మూర్ఖులు. ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎవరికోసం చెయ్యాలో భగవాన్ 'గోల్డ్ బిస్కెట్ల' సాములారికి తెలుసు. దేనికైనా నమ్మకం ముఖ్యమర్రా. మా సాములారొక్కడే భగవంతుడి అవతారం. మిగతా వాళ్ళంతా ఉత్తుత్త నకిలీ సాములే'' అన్నారు నీలవేణి గారు.

దాంతో భక్తురాళ్ళు రెచ్చిపోయేరు. ''నీ సాములారెంత? అంటే నీ సాములారెంత? అనుకున్నారు. జుట్టూ జుట్టూ పట్టుకున్నారు. కొట్టుకోవడం మొదలైంది.

ఈ వింతను చూడవచ్చిన జనంలో మా గురువు జంఘాలశాస్త్రి గారు కూడా వున్నారు. నాలుగు ముక్కలు మాటాడి పరిస్థితిని అదుపుచెయ్యమని వూరిపెద్దలు కోరినమీదట జంఘాల శాస్త్రి క్లుప్తంగా గంభీరంగా వుపన్యసించేరు.

''అమ్మలారా! అయ్యలారా!

ఇదీ మన దుస్థితి. ఒకనాడీ నేలమీద పరిఢవిల్లిన ఏకేశ్వరోపాసన ఎవరికైనా జ్ఞాపకం వుందా? మనం కొలుచుకోవాలంటే మనకున్న ముక్కోటి దేవతలు చాలరా?   ఆకలిదప్పులకీ రాగద్వేషాలకీ, ధన సముపార్జనకీ అతీతులుకానివారు తెల్లారితే అందరిలాగే చెంబట్టుకు వెళ్ళేవారు దైవస్వరూపులెలా అవుతారు? ఎంత అపవిత్రమైన ఆలోచన చేస్తున్నారమ్మా. కాస్త బుర్రకి పదునుపెట్టండి. అయితే ఒక్క గొప్ప వూరట నాకు కలుగుతోంది. అసలు సిసలు మోసకారి నాస్తికలంటూ ఎవరైనావుంటే తమను తాము భగవాన్‌లుగా ప్రచారం చేసుకునే ఈ నాయవంచకులే.  ఊర్లను ఏమార్చే ఈ సాములార్ల వెంట మనలో అధిక సంఖ్యాకులుగా వున్న పేద ప్రజలూ, ఒళ్ళొంచి కష్టించి పనిచేసే వారూ లేరు. నిరంతరం అభద్రతా భావంతో జీవించే కొన్ని వర్గాలు ఈ పటాటోపాలవెంట ఎగబడి పోతున్నాయి.  నిత్య జీవనంలో నిజమైన మానవతా విలువలు కాపాడుకోవాలనుకునేవారికి ఎవరి అవసరమూ లేదు. మన అంతరాత్మే మనకి పథనిర్దేశం చేస్తుంది. శలవు'' అని ముగించేరు జంఘాల శాస్త్రి. భక్తురాళ్ళు మినహా మిగిలిన జనవంతా చప్పట్లు కొట్టి హర్షం ప్రకటించేరు.

- ఎస్పీ

 

Read Also

 
Related News
JournalistDiary