India / Time Pass
ఇచ్చట కథలు వండబడును!
1191 days ago

పనిమీద హైద్రాబాదెళ్లిన నాకు నా బాల్యమిత్రుడూ, ప్రముఖ చలనచిత్ర దర్శకుడూ అయిన సుదర్శకరావు కనిపించి, ఓ రోజంతా తనతోపాటు కార్లో తిప్పుకుని, కాసిని వింతలూ విడ్డూరాలూ చూపించేడు. 

సుదర్శకరావు నన్నో గెస్ట్‌హౌస్‌కి తీసుకెళ్లాడు. గెస్ట్‌హౌస్ కొండలమీద అందంగా, సౌకర్యంగా వుంది. 

తనకి కేటాయించిన గదిలోకి దారి తీసేముందు ‘‘ఇది వేరే కంపెనీ వాళ్ల రూం. వాళ్లేం చేస్తున్నారో చూసిపోదాం’’ అంటూ ఓ రూంలోకి తీసుకెళ్లేడు సుదర్శకరావు. 

రూంలో అడుగు పెడుతూనే ఖిన్నుణ్ణయిపోయేను. ఎంచేతంటే రూంలో ఉన్న ముగ్గురిలోనూ పెద్దాయన గంభీరంగానూ, గద్గదస్వరంతోనూ ఏదో చెబుతున్నాడు. మిగతా ఇద్దరు ఆయన చెప్పేది వింటూ పొర్లిపొర్లి ఏడుస్తున్నారు. వాళ్లనెలా ఓదార్చాలో నాకర్థం కాలేదు. అసలేం జరిగిందో తెలీని అపరిచితుణ్ణి గదా. ఒకవేళ వారందరికి ఆత్మీయులైన వాళ్లు కనీసం పదిమందయినా మొన్నొచ్చిన తుఫాన్లో కొట్టుకుపోయేరంటే ఎలాంటి ఆశ్చర్యమూ కలగని స్థితికి చేరేను. వాళ్ల దుఃఖ తీవ్రత అలాంటిది మరి!

‘‘కానివ్వండి. కానివ్వండి’’ అని చాలా మామూలుగా అంటూ బయటికి కదలబోయేడు సుదర్శకరావు. 

‘‘పర్లేదు పర్లేదు. కూచోండి గురూగారూ’’ అన్నాడు ఆ పెద్దాయన. కూచున్నాం. నేను ఉండబట్టలేక ‘‘ఎందుకేడుస్తున్నారు బాబూ’’ అని ఆ ఏడ్చే వాళ్లిద్దర్నీ ఉద్దేశించి అడిగేను. 

‘‘మనం తియ్యబొయ్యే పిచ్చర్లో మదర్ సెంటిమెంటుకి సమ్మందించిన సీనొకటి చెవుతా వుంటే తట్టుకోలేపోయేరండి మన కుర్రోళ్లు’’ అన్నాడు పెద్దాయన. 

‘‘య్యెలా తట్టుకోమంటారండీ? య్యింత ఉద్వేగంగా, య్యింత హృదయవిదారకంగా, గుండెల్ని పిండేసే సీను మీరు చెబుతావుంటే ఎగదన్నుకొచ్చే దుఃఖానికి అడ్డుకట్ట య్యెలా వెయ్యమంటారు?’’ వెక్కి వెక్కి ఏడుస్తూ మధ్యే మధ్యే అన్నాడు పైజ్మా లాల్చీ కుర్రాడు. అతను కొత్త రచయిత అని తర్వాత తెలిసింది. 

‘‘ఐబాబోయ్. ఏడ్చి ఏడ్చి అలసిపోయేను బాబోయ్. ఇక నేను ఏడవలేను బాబోయ్’’ అన్నాడు జీన్స్ పేంటు కుర్రాడు. అతనో వర్ధమాన కెమెరామన్ అని తర్వాత తెలిసింది. 

‘‘విధవరాలైన తల్లితో ఆ జాలిలేని ముగ్గురు కొడుకులూ తమ ఇళ్లలో ‘వారాలు చేసుకోమ’ని చెప్పడం ఉంది చూశారు అదండీ అసలు పాయింటు, పిక్చరు నడుస్తోండగా ఆ థియేటర్సు ఇక కన్నీళ్ల వానలో తడవక తప్పదు’’ అన్నాడు కొత్త రచయిత గంభీరంగా గొంతుమార్చి. 

‘‘బావుంది. బావుంది’’ అన్నాడు నా మిత్రుడు సుదర్శకరావు. అతనికిలాంటివి మామూలే అనిపించింది. 

‘‘మన పిచ్చరుకి ఆడోళ్లు పిచ్చగా వొచ్చేస్తారండి బాబోయ్. రికార్డులు బ్రేకై పోతాయ్ బాబోయ్. మళ్లీ మళ్లీ టిక్కెటు కొనుక్కుని మళ్లీ మళ్లీ ఏడవడానికొస్తారు బాబోయ్’’ అన్నాడు జీన్స్ పేంట్ విలక్షణమైన ‘మస్కా’ పద్ధతిలో. 

‘‘ఆడది తల్లి అవుతుంది. తల్లికి బిడ్డలుంటారు. బిడ్డలకి పెళ్ళిళ్ళవుతాయి. అయినా తల్లి పరిస్థితి మారదు. తల్లి తల్లే. అలాగే మరో ఆడది పెళ్లి చేసుకొని ఆ ఇంటి కోడలవుతుంది. కొన్నాళ్లకి తల్లవుతుంది. అయినా ఆడదాని పరిస్థితి మారదు. ఆ ఉదాత్తమైన స్థానం మారదు. తల్లి తల్లే. ఈ మహత్తర సందేశం మీద కథ అల్లేను. మన కుర్రోళ్లు విని ఫ్లాటైపోయేరు. మా పిచ్చరు ఓ ఫ్యామిలీ సెంటిమెంటల్ ప్రేమకథ. ఇందులో క్రైం కూడా ఉంటుంది. మొత్తం పాటలు పదిహేడు. అందులో నాలుగు మెడగాస్కర్‌లోనూ, ఏడు ఇండోనేషియాలోనూ, అయిదు సియెర్రాలియోన్‌లోనూ నేత్రపర్వంగా తీస్తాం’’ అని సగర్వంగా చెప్పేడు పెద్దాయన. 

‘‘ఇకనేం? అన్ని ఎలిమెంట్సూ వున్నాయి. దున్ని పారెయ్యండి’’ అన్నాడు సుదర్శకరావు లౌక్యంగా. ఆ పెద్దాయన చెప్పిన కథాంశంగానీ, తియ్యబోయే పద్ధతిగానీ అర్థంపర్థం లేనివిగా నాకనిపించేయి. 

నా ఒత్తిడి మీద ఆ గదిలోంచి బైటికి రాకతప్పలేదు సుదర్శకరావుకి. 

‘‘అతనేదో అర్థంపర్థం లేకుండా చెబుతోంటే అలా తన్మయత్వం నటిస్తావేం?’’ అని నిలేశాను. 

‘‘తప్పదు గురూ. అనుదినం తెల్లారితే ఇది మనకి మహా మామూలు విషయం’’ అన్నాడు సుదర్శకరావు. 

ఆ గదిలో భోరుమని ఏడుస్తున్న వాళ్ల గురించి చెబుతూ ‘‘ఒకడికి స్ర్కిప్టు రైటరుగా అవకాశం రావాలి. మరొకడికి కెమెరామన్‌గా ఛాన్సు కావాలి. అందుకే అంతగా వెక్కి వెక్కి ఏడ్చి మరీ కాకా పడుతున్నారు’’ అన్నాడు సుదర్శకరావు. 

ఇంతలోనే ఆ కేరిడర్‌లోకి కృతకంగా మేకప్ చేసుకున్న ఓ నడివయసు ఆడమనిషి వచ్చింది. ‘‘హలో బావున్నారా’’ అంటూ ఆమెని పలకరించేడు సుదర్శకరావు. ప్రఖ్యాత హీరోయిన్ ‘రతిశ్రీ’ తల్లిగారని చెప్పి నాకు పరిచయం కూడా చేశాడు. 

‘‘ఎక్కడ పోయినాడప్పా ఆ ప్రొడక్షన్ పిళకాయ? బేబీకి ఒకటే తలనొప్పి. టేబ్లెట్‌కోసం కార్ తీస్కోనిపోయి గంటపైనే అయింది. నిండా మోసమప్పా వీళ్లు’’ అన్నాడు హీరోయిన్ తల్లిగారు. 

‘‘కాస్సేపు నిటారుగా కూచుని ప్రాణాయామం చెయ్యమనండి. తలనొప్పినించి రిలీఫ్ రావచ్చు’’ అంటూ ఉచిత సలహా పారేశాను. 

‘‘మధ్యలో నీ ప్రాణాయామం చిట్కా లేవిటయ్యా? అసలే సినిమా ఆడవాళ్లు పాపం. వాళ్ల తలనెప్పులు వాళ్లవి’’ అన్నాడు సుదర్శకరావు. 

‘‘మరీ టేబ్లెట్‌లాంటివాటికోసం కారెందుకోయ్?’’ అని తర్వాత అడిగేను. 

‘‘అదే స్టేటస్. నిర్మాణ ఖర్చులు పెరగమంటే పెరగవా మరి? అయినా ఇదే ఇక్కడ పరిపాటి. ఈ దుబారాని ఎవడూ అరికట్టలేడు’’ అన్నాడు సుదర్శకరావు. 

సుదర్శకరావుకి కేటాయించిన గదిలోకి వెళ్లేం. అక్కడ ముగ్గురు ‘వంటవాళ్లు’ కాయితాలూ, వీడియో కేసెట్లూ వగైరా ‘వంట’ సరంజామా ముందేసుక్కూచుని ఉన్నారు. ఓ పక్కన విసిఆర్‌లో ఏదో మలయాళం సినిమా నడుస్తోంది. చూస్తూ ఏదో రాసుకుంటున్నారు. 

మమ్మల్ని చూడగానే ఆ ముగ్గురూ లేచి మా వాడికి పాదాభివందనం చేసి నిలబడ్డారు వినయంగా. సుదర్శకరావు వాళ్లని కూచోమని గట్టిగా కోప్పడితేనే గాని కూచోలేదు. పైగా సుదర్శకరావు ఎప్పుడూ లేచినా వాళ్లుకూడా లేవడం అతను కూచున్న తర్వాతే కూచోడం చేస్తున్నారు. 

(‘‘ఈ దండేలు బస్కీలూ ఏవిటి’’ అని ఆ తర్వాత అడిగితే ‘‘డైరెక్టరుకున్న స్థానం అంతటిది. మన సినిమా రంగంలో ఈ మాత్రం డిసిప్లిన్ ఉన్నందుకు సంతోషించాలి’’ అన్నాడు సుదర్శకరావు హుందాగా)

‘‘వంట ఎంతవరకూ వచ్చింది?’’ అడిగేడు సుదర్శకరావు. 

‘‘ఆరు మలయాళం కేసెట్లూ, రెండు మరాఠీ కేసెట్లూ, మూడు హాలీవుడ్ కేసెట్లూ క్షుణ్ణంగా చూశావండి. ఆ కేసెట్లలో దొరికిన పాయింట్లతో ఓ చక్కటి సింగిల్ లైన్ సినాప్సిస్ ఫస్ట్ వెర్షన్ వండేశావండి. అన్ని కేసెట్స్‌లోనూ కలిపి మొత్తం ఇరవైఏడు సీన్లు మనం డైరెక్టుగా నంజుకోవచ్చండి’’ అన్నారు వాళ్లు. 

‘‘వెరీగుడ్. అయితే ఎల్లుండి లాంఛనంగా ముహూర్తం షాట్ తీసేద్దాం. నెలరోజుల తర్వాత ‘ముదుమలై’ ఫారెస్ట్‌లో మొదటి షెడ్యూల్ ఆరంభం’’ అన్నాడు సుదర్శకరావు. 

‘‘అసలు కథేవిటో తేలకుండా ముహూర్తవా?’’ అన్నాడు తెల్లబోయి. 

‘‘ఇదో మరో మహామామూలు విషయం. నువ్వు మరీ ఎక్కువగా ఆశ్చర్యపోవద్దు. ఏదో ఓ కథని వొండిపారెయ్యడం సమస్య కాదు. అంతకన్నా ఆర్టిస్టుల డేట్సు దొరకడం ముఖ్యం’’ అన్నాడు సుదర్శకరావు. నాకు జ్ఞానోదయం అయింది.

-ఎస్పీ

 

Read Also

 
Related News
JournalistDiary