India / General
మోదీ సార్.. నన్ను 60 వేలకు అమ్మేశారు..!
9 days ago

కోల్ కతాకు చెందిన ఒక అభాగిని.. నేరుగా ప్రధాని మోదీకి రాసిన లేఖ.. ఇప్పుడు ప్రధాన వార్తల్లో నిలిచింది. రక్షా బంధన్ రోజు మోదీకి అందరూ వరుసబెట్టి రాఖీలు కట్టేస్తుంటే.. ఈ యువతి మాత్రం.. ఒక కన్నీటి లేఖను ఆయన చేతిలో పెట్టింది. ''పెళ్లిచేసుకుంటానని మోసపుచ్చి ఒకడు ముంబై వేశ్యావాటికలో నన్ను 60 వేలకు అమ్మేశాడు. ఆ ఇల్లూ, ఈ ఇల్లూ మారుతూ ప్రతిరోజూ బలాత్కారాల్ని భరిస్తూ ఆరేళ్ళ పాటు నరకాన్ని అనుభవించాను. 2011లో పోలీసుల సాయంతో ఆ
నరకం నుంచి బైటపడ్డాను. కానీ నాలాగే అక్కడ నలిగిపోతున్న లక్షలాది మంది అమ్మాయిల్ని కూడా కాపాడాలని వుంది. మీరేమైనా సాయం చేస్తారా..?'' ఇదీ ఆ లేఖ సారాంశం.

 

ప్రపంచ వ్యాప్తంగా 4.6 కోట్ల మంది సెక్స్ ట్రేడర్స్ ఉంటే.. అందులో ఏకంగా 40 శాతం వాటా ఇండియాదే! దేశం మొత్తంమీద కోటీ 80 లక్షల మంది ఆడపిల్లలు ఇటువంటి నరకకూపాల్లో చిక్కుకుని తమ జీవితాల్ని బలిపెట్టుకుంటున్నారు. వీళ్ళలో సగానికంటే ఎక్కువ మంది 18 ఏళ్ల లోపు ఆడపిల్లలే. ఈ ఘోరాన్ని అరికట్టాల్సిన బాధ్యతను ఏ ప్రభుత్వమూ తీసుకోలేదు. ఇప్పుడు బాలికల్ని బతికించుకుందామంటూ 'భేటీ పడావో' పేరుతో పథకాలు ప్రవేశపెడ్తున్న మోదీ.. బతికున్న బాలికల్ని కూడా కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలన్నది ఆ యువతి కోరిక.

 

సరైన ఉపాధి దొరక్కపోవడం వల్లే ఎక్కువమంది ఆడపిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాకు దొరికిపోతున్నారని, బతగ్గలమన్న భరోసా కల్పించడం ద్వారా.. వాళ్ళను ఆ ఊబి నుంచి బైటపడెయ్యవచ్చని ఆమె సూచిస్తోంది. తాను మోసపోయిన విధానాన్ని, స్వయంగా అనుభవించిన నరకాన్ని ఆ రెండుపేజీల లేఖలో పూసగుచ్చినట్లు రాసింది తావీ అనే ఈ యువతి. అక్కడున్నవాళ్ళందరూ ప్రధాని మోదీని ఒక అన్నయ్యలా భావిస్తున్నారని, ఏదో ఒకటి చేసి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత ఆ మోదీ సారుదేనని తావీ అంటోంది. మరి.. ఈ మెగా అన్నయ్య ఏంచేస్తాడో చూడాలి!

 
 
Related News