AP / Politics
మళ్ళీ పట్టాలు తప్పిన ప్రశాంత్ కిషోర్ ఎక్స్ ప్రెస్ !
9 days ago
గడప గడపకూ వైసీపీ, వైఎస్ఆర్ కుటుంబం, మహా పాదయాత్ర.. ఇప్పుడు యువభేరి..! వైసీపీ షెడ్యూల్ ని బాగా టైట్ చేశారు పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఎన్నికల్లోపు అధినేత జగన్ ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా కాళ్లకు బలపం కట్టుకుని తిరగాల్సిన పరిస్థితి! ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్చాపురం వరకు ఆరునెలల పాటు జరిగే పాదయాత్రలో జగన్ మూడువేల కిలోమీటర్లు నడవాల్సి వుంది. నవంబర్ 2 నుంచి మొదలయ్యే జగన్ పాదయాత్ర కోసం ముందస్తు 'కసరత్తు' కూడా జోరుగా జరిగింది.   
చిన్న జీయర్ స్వామికి పాదాభివందనం చేసి, పాదయాత్ర కోసం ఆశీర్వాదం తీసుకోవడంలాంటివన్నీ ప్రశాంత్ కిశోర్ థాట్ బ్యాంక్ నుంచి ఊడిపడ్డవే! ఇటు..  జగన్ పాదయాత్రకు జనాన్ని, పార్టీ శ్రేణుల్ని సమాయత్తపర్చడం కోసమే యువభేరిని రీస్టార్ట్ చేసింది వైసీపీ స్ట్రాటజీ టీమ్. ఎనిమిది నెలల కిందట గుంటూరుతో ఆగిపోయిన యువభేరిని మళ్ళీ అనంతపురంతో మొదలుపెట్టడం వైసీపీకి కొత్త ఊపునిచ్చింది. కాలేజ్ యూత్ ని టార్గెట్ చేయాలన్న సంకల్పం గట్టిదే అయినా.. దాన్ని డ్రైవ్ చేసే స్పెషల్ స్టేటస్ అనే స్లోగన్ మాత్రమే ఇక్కడ సందేహాస్పదం. కేంద్రం ఆఫర్ చేసిన  స్పెషల్ ప్యాకేజ్ కి ఏపీ సర్కార్ కూడా ఒకే చెప్పడంతో కొన్నిరోజులుగా స్పెషల్ స్టేటస్ అనే మాట సోయిలో కూడా లేదు! ఇప్పుడదే స్లోగన్ ని ఏ నమ్మకంతో నెత్తికెత్తుకోవాలన్న సంశయం వైసీపీలోనే వుంది. 
 
 బడ్జెట్ సమావేశాలలోపు ప్రత్యేక హోదా మీద ప్రకటన రాకపోతే.. తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్.. ఆ తర్వాత తూచ్ అనేసిన నేపథ్యం.. ఇప్పుడు మళ్ళీ తెరమీదికొచ్చింది. రాష్ట్రపతి ఎన్నికలప్పుడు, జీఎస్టీ చట్టం చేసినప్పుడు కేంద్రానికి బేషరతు మద్దతు చెప్పిన జగన్.. అప్పుడు 'స్పెషల్ స్టేటస్' డిమాండ్ ను ఎలా మర్చిపోయారన్న ప్రశ్నకు మళ్ళీ ఆస్కారం ఇచ్చినట్లయింది. మంగళవారంనాటి అనంతపురం యువభేరిలో అరగంట పాటు అనర్గళంగా మాట్లాడినప్పటికీ.. పార్టీ స్టాండ్ ను గట్టిగా వినిపించడానికి, జనంలో విశ్వసనీయతను పాదుకొల్పడానికి  జగన్ పడ్డ శ్రమ స్పష్టంగా కనిపించింది. రేపటి పాదయాత్రలో సైతం 'ప్రత్యేక హోదా' నినాదంతోనే ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో.. వైసీపీ అధినేత ఇటువంటి 'కసరత్తు'ను అలవాటు చేసుకోక తప్పదు! అల్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ కిశోర్ !
 
 
 

Read Also

 
Related News
JournalistDiary