India / Crime
యాసిన్ భత్కల్ క్రైమ్ హిస్టరీ
307 days ago

అతడు స్కెచ్ వేస్తే విధ్వంసమే.. తుముకూరులో ఉన్నాడు.. బెంగళూరును పేల్చాలనుకున్నాడు.. అసలు విషయం లీక్ కావడంతో కోల్‌కతాకు ఎస్కేప్ అయ్యాడు. అక్కడ దొంగనోట్ల కేసులో పట్టుబడ్డాడు. ఇవి యాసిన్ భత్కల్ నేర చరిత్రలో కొన్ని మాత్రమే. ముజాహిద్దీన్‌తో లింక్ కలిశాక రెచ్చిపోయాడు. అదెలా అంటే... 

యాసిన్ భత్కల్.. ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు. ఉత్తర కర్నాటకకు చెందిన భత్కల్ గ్రామం ఇతని సొంతూరు. చిన్నప్పుడు నుంచే వీడు అదో టైప్. బాంబుల తయారీలో దిట్ట. అతని నేర చరిత్ర భత్కల్ గ్రామం నుండే మొదలైంది. జీహాద్ అంటే చాలు పడి చస్తాడు.. ప్రాణాలైనా ఇస్తాడు. దేనికైనా తెగిస్తాడు. పదోతరగతి వరకు చదువుకున్న అతడు చిన్నప్పుడే తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని ఇల్లు వదిలాడు. అతి భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్‌తో చేతులు కలిపాడు. యాసిన్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించి, ముజాహిద్దీన్లతో పరిచయం చేసింది రియాజ్, ఇక్బాల్. ఈ ముగ్గురు ముగ్గురే! 

విధ్వంసంలో దిట్టలే.. ముజాహిద్దీన్‌లో చేరిన తొలినాళ్లలోనే లక్షలాది రూపాయల విరాళాలు పోగేసి ఉగ్రవాద నేతల దృష్టిలో పడ్డాడు. 2008లో ఢిల్లీకి మకాం మార్చిన యాసిన్, అక్కడ ఓక్లా‌బాగ్‌లో నివాసముండేవాడు. ఫ్రెండ్ చెల్లెలిని ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యతో సహా అక్కడేవున్నాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఢిల్లీలో వరుస పేలుళ్లు జరిపి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసానికి స్కెచ్ వేశాడు.. అమలు పరిచాడు. జైపూర్‌లో వరుస పేలుళ్లు, జర్మన్ బేకరీ బ్లాస్ట్, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియలో జరిగిన విధ్వంసంతోపాటు ఢిల్లీలోని జామా మసీదు దగ్గర పేలుళ్లతో ఇతనికి సంబంధాలున్నాయి. యాసిన్ చేతివాటం, వ్యూహరచన, చురుకుదనం చూసి ఇండియన్ ముజాహిద్దీన్ కమాండర్‌గా నియమించారు. అంతే అక్కడ నుంచి అతడు చెలరేగిపోయాడు.

ఈ క్రమంలో అతన్ని ముజాహిద్దీన్లకు పరిచయం చేసిన రియాజ్, ఇక్బాల్‌లు దుబాయ్‌కి పరారయ్యారు. యాసిన్ మాత్రం భారత్‌లోనే వుండి విధ్వంసానికి తెరలేపాడు. అసలు యాసిన్ టార్గెట్ బెంగుళూరు, ముంబై. ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నంచేసి నడ్డి విరవాలన్నదే అతని వ్యూహం. ఈ క్రమంలోనే చిన్నస్వామి స్టేడియంలో బాంబులు పెట్టాడు. పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తుండడంతో బెంగళూరు నుంచి కోల్‌కతాకు మకాం మార్చాడు. అప్పుడే యాసిన్ భత్కల్ నిజస్వరూపం ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత అతడి నేర ప్రస్థానం హైదరాబాద్‌కు మళ్లింది. దిల్‌షుక్ నగర్ బాంబు పేలుళ్లలో కీలకంగా వ్యవహరించాడు. అనేకమంది ప్రాణాలు హరించాడు. మమ్మద్ జరూర్, ఇమ్రాన్, ఆసిఫ్, షారూఖ్ ఖాన్ అనే మారుపేర్లతో అనేక ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించి విధ్వంసాలకు ప్లాన్ చేశాడు. చివరకు అక్కడ దొంగనోట్లను ముద్రించి చెలామణి చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. 


 

Read Also

 
Related News
JournalistDiary