India / Entertainment
అదితిరావ్.. ఇంట్రెస్టింగ్ హిస్టరీ
71 days ago

హిందీ, తమిళ భాషా చిత్రాల్లో నటిస్తూ పాపులర్ అయిన అదితి రావ్ హైదరి తాజాగా మణిరత్నం మూవీలో నటించి బెస్ట్ యాక్ట్రెస్ అనిపించుకుంది. ‘కాట్రు వెలియిదై’ అనే మూవీలో కార్తీ సరసన డాక్టర్ లీల రోల్ పోషించిన ఈ హీరోయిన్.. మణిరత్నం వంటి దర్శకుల దృష్టిలో తను పడడం అదృష్టం కాక మరేమిటని అంటోంది. అదితి రావ్ నేపథ్యమే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లో.. వనపర్తి రాచ కుటుంబం నుంచి వచ్చిన జె.రామేశ్వర రావు, సలెహ్ అక్బర్ హైదరిల కుటుంబంలో జన్మించింది. హైదరాబాద్ సంస్థాన మాజీ ప్రధాని అక్బర్ హైదరి ముని మనవరాలు, అస్సాం మాజీ గవర్నర్ మహమ్మద్ సలెహ్ అక్బర్‌కు వరుసకు మేనకోడలు కూడా అయిన ఈమెకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కిరణ్ రావు కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి.

రెండు రాచరిక కుటుంబాల నుంచి వచ్చిన అదితి రావ్ హైదరి.. ఆరో ఏటనే భరతనాట్యం నేర్చుకుంది. ఏపీ మదనపల్లిలోని రిషి వ్యాలీ స్కూల్లో చదివిన అదితి ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. మొట్ట మొదటిసారిగా 2006లో ‘శృంగారం’ అనే తమిళ మూవీలో దేవదాసిగా నటించింది. ఈ పాత్రలో ఈమె నటనకు పాజిటివ్ రివ్యూలు రావడం విశేషం. ఆ తరువాత 2011లో సుధీర్ మిశ్రా తీసిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఏ సాలీ జిందగీ’లో తన పర్ఫార్మెన్స్‌కు గాను అదితి ఉత్తమ సహాయ నటిగా స్క్రీన్ అవార్డు పొందింది. ‘రాక్‌స్టార్’ (2011), మర్డర్-3 (2013), ఖూబ్ సూరత్ (2014)  వంటి బాలీవుడ్ మూవీల్లో అదితి నటించి బిజీ స్టార్ అయింది. మణిరత్నం చిత్రం కాట్రు వెలియిదై.. తెలుగులో చెలియా టైటిల్ తో విడుదలైంది. ఈ చిత్రంలో అదితి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక రానున్న... ‘ఔర్ దేవదాస్’, ‘భూమి’, ‘పద్మావతి’ సినిమాల్లోనూ మంచి పాత్రలు దక్కించుకున్న అదితి వెనక్కి చూసుకోవలసిన అవసరమే లేదు. 

 
 
Related News