India / Crime
లూటీ చేసి.. గంగలో మునిగారు..
122 days ago

ఢిల్లీలో ఇటీవల పట్టపగలు జరిగిన భారీ దోపిడీని పోలీసులు పది రోజుల్లో ఛేదించారు. ఓ ఏటీఎం వద్ద నిలిపి ఉంచిన క్యాష్ వ్యాన్ నుంచి 10 లక్షలు దోచుకుపోయిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బిట్టూ (29), రోహిత్ (19), సన్నీ శర్మ (22)గా ఈ దుండగులను గుర్తించారు. ఈ నెల 19న వీళ్ళు పాండవ నగర్‌లో నగదుతో ఓ ఏటీఎం వద్దకు చేరుకున్న వ్యాన్ నుంచి పది లక్షలు దోచుకుని పారిపోయారు. వీళ్ళలో రోహిత్, సన్నీ శర్మ తాము చేసిన ‘పాపాల ప్రక్షాళనకు ప్రాయశ్చిత్తం’ చేసుకోవాలనుకున్నారట. అందుకు హరిద్వార్, రిషికేష్ వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్లి అక్కడ గంగా నదిలో ‘పవిత్ర స్నానాలు’ చేసి ఆలయాలకు కూడా వెళ్ళారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

అయితే బిట్టూ మాత్రం తన భార్య కోర్కె మేరకు వెళ్ళకుండా ఢిల్లీలోనే ఉండిపోయాడట. పుణ్య క్షేత్రాలు తిరిగి గంగలో మునిగిన రోహిత్, సన్నీ శర్మ ఇద్దరూ ముస్సోరీకి వెళ్లి పార్టీ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఢిల్లీకి తిరిగి రాగానే వీరిని అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో బిట్టూను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘరానాగాళ్ళు దోపిడీ  చేసిన సొమ్మంతా కొత్త  2 వేలు, 500 నోట్లేనని ఖాకీలు తెలిపారు. వ్యాన్ గార్డు వీరిని ప్రతిఘటించబోగా ఒకడు గన్ తీసి మూడుసార్లు కాల్పులు జరిపాడని, వెంటనే అంతా పరారయ్యారని తెలిసింది. ఈ ‘పవిత్ర పాపులు’ ఇప్పుడు జైల్లో మగ్గుతున్నారు.

 

 
 
 
Related News

JournalistDiary