World / Health
" సిజేరియన్ " పిల్లలకు ఒబేసిటీ ముప్పు
8 days ago

గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టే పిల్లలు పెరిగేకొద్దీ స్థూలకాయులుగా (ఒబేసిటీ) మారవచ్చునని ఓ కొత్త పరిశోధనలో తేలింది. సహజంగా పుట్టే శిశువులతో పోలిస్తే.. వీళ్ళే రానురాను " బొజ్జ గణపయ్య " లుగా మారుతారట. తాజాగా న్యూయార్క్ యూనివర్సిటీ రీసెర్చర్లు జరిపిన స్టడీ ఇది ! మొదట ఎలుకల మీద ప్రయోగాలు జరిపిన వీరు.. సిజేరియన్ ద్వారా జన్మించే పిల్లల కడుపులో మంచీ, చెడూ బ్యాక్టీరియాలు రెండూ హెచ్చు తగ్గుల్లో ఉంటాయని, దీనివల్ల పెరిగే కొద్దీ వాళ్ళు బరువు పెరుగుతారని అంటున్నారు. తమ పరిశోధనలు..అనవసరమైన సిజేరియన్ ఆపరేషన్లను, ఒబేసిటీ రేట్లను తగ్గించవచ్చునని ఈ రీసెర్చర్లు ఆశిస్తున్నారు.

సిజేరియన్, బాడీ వెయిట్ మధ్య సంబంధం ఉందని చెప్పడానికి తాము చేసిన అధ్యయనం ఇదే మొదటిదని అంటున్నారు. ఇదిలా ఉండగా..మరో ఐదేళ్ళలో (2022 నాటికి) ఈ ప్రపంచంలో స్థూలకాయులైన పిల్లల సంఖ్య.. పోషకాహారలోపంతో బాధ పడే చిన్నారులకన్నా పెరిగిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తెలిపింది. తమ వయసుకు మించి బరువు పెరిగిన పిల్లల సంఖ్య 1975 లో కేవలం 1 శాతం మాత్రమే ఉండగా..2016 నాటికి ఇది ఆడ పిల్లల్లో 6 శాతానికి, మగ పిల్లల్లో 8 శాతానికి పెరిగిపోయిందట. అందువల్ల సాధ్యమైనంత వరకు సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించుకుంటే మంచిదని పరిశోధకులు అటు డాక్టర్లకు, ఇటు ప్రజానీకానికి సూచిస్తున్నారు.  

 

Read Also

 
Related News
JournalistDiary