India / Politics
కొండెక్కిన 'లడ్డూ'ల పథకం
226 days ago

నోట్ల రద్దు వల్ల కష్టాలు పడుతున్నప్పటికీ వాటిని సహిస్తూ ఏటీఎంల ముందు పడిగాపులు పడుతున్న ప్రజలకు కృతజ్ఞతాపూర్వకంగా లడ్డూలు పంచాలన్న యోచనను బీజేపీ విరమించుకుంది. దీనిపై పెద్ద  ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ఈ ప్లాన్ ను క్యాన్సిల్ చేసుకున్నామని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ తెలిపారు. (ఈయనే ఈ లడ్డూ పథక సూత్రధారి). డిమానిటైజేషన్ తరువాత  నగదు కోసం ఏటీఎంల వద్ద భారీ క్యూలలో నిలబడుతున్నా..ప్రధాని మోదీ నిర్ణయాన్ని తప్పు పట్టకుండా సహనంతో నిలబడినవారికి. (ఇంటింటికీ తిరిగి) లడ్డూలు పంచాలని, జనవరి 1 నుంచి 10 వరకు ఈ తతంగం చేపట్టాలని తివారీ నిర్ణయించారు. అయితే  వీటిని పంచే బదులు తమ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి థ్యాంక్స్ చెబుతారని, నోట్ల రద్దు మంచిదేనని ఆయా కుటుంబాలకు వివరిస్తారని ఆయన చెప్పారు. 

కాగా ఈ చర్య (నోట్ల రద్దు) ప్రజలను ఎంత దారుణంగా దెబ్బ తీసిందో తివారీ తెలుసుకోవాలని ఆప్ పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా ధ్వజమెత్తారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు గడిపేందుకే అనేకమందికి  సమయం పట్టిందని, దీంతో ఉపాధి కోల్పోయి ఢిల్లీ వదిలి వెళ్లిపోయారని వారన్నారు. ఇలా వెళ్ళిపోయినవారి సంఖ్య నాలుగు లక్షలవరకు ఉంటుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో లడ్డూలు పంచుతారా అని ప్రశ్నించారు. అటు ప్రజలు కూడా బీజేపీ ప్లాన్ ను అపహాస్యం చేశారు. దీంతో లడ్డూల పంపిణీ కార్యక్రమం అటకెక్కింది.

 

 

Read Also

 
Related News