రాత్రికి రాత్రే తనను సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై రెండో రోజూ సుప్రీంకోర్టులో వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంపై ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది న్యాయస్థానం. సీబీఐ డైరెక్టర్ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్‌ అస్థానాలను రాత్రికి రాత్రే ఎందుకు సెలవుపై పంపారు? సీబీఐ చీఫ్‌ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు సెలక్షన్‌ కమిటీని ఎందుకు సంప్రదించలేదు? కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌.. ఆలోక్‌, అస్థానాలపై చర్యలు తీసుకోవడానికి దారితీసిన పరిణామాలు రాత్రికి రాత్రే జరగలేదని, మీరు అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి కారణం అది కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వం తీసుకునే చర్యలు సంస్థ ప్రతిష్ఠను కాపాడేలా ఉండాలని పేర్కొంది.

దీనికి స్పందించిన అటార్నీ జనరల్.. జులై నుంచి ఇద్దరి అధికారుల మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలైందని, అప్పటినుంచి వాళ్లని భరిస్తున్నామన్నారు. అనివార్య కారణాల వల్ల వాళ్లని సెలవుపై పంపాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ బుధవారం వెల్లడించిన విషయం తెల్సిందే! అటు సీబీఐ కేసుల దర్యాప్తునకు బదులుగా అధికారులు ఒకరిపై మరొకరు దర్యాప్తు చేసుకుంటున్నారని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ సుప్రీంకోర్టుకు తెలిపింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *