AP and TS / Politics
కెసియార్ కిస్సా.. బాబు గుస్సా.. పవన్ కళ్యాణ్ రుసరుస
9 days ago

ఇటీవల పరిటాల రవి ఇంట్లో పెళ్లి సందర్భంగా అక్కడకు వచ్చిన కెసియార్‌తో కొంతమంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆయనతో చనువుగా వుండడం, సన్నిహితంగా మెలిగిన తీరు మీద చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన పార్టీ నేతల సమన్వయ సమావేశంలో ఆయన ఈ విషయం మీద క్లాసు తీసుకున్నారు. ఇలా అతి చనువుగా వ్యవహరించడం వలన తెలంగాణాలో పార్టీ నేతలు హర్ట్ అవుతున్నారనీ.. వాళ్ల మనోభావాల్ని కూడా మనం గౌరవించాలన్నది తన అభిమతమని ఆయన చెప్పారు. పయ్యావుల కేశవ్ కెసియార్‌తో చనువుగా మెలిగిన తీరుపై అటు పార్టీ వర్గాలతోబాటు మీడియాలో సైతం రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. బాబు అసహనంపై పయ్యావుల కాస్త కినుకు వహించారు. ఇందులో తన తప్పేమీ లేదంటూ ఆయన అన్నారు. కెసియార్‌తో అభివాదం చేసి తాను పక్కకు వెళ్లిపోయానని.. తర్వాత తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో ఆయన కబురుచేస్తే వెళ్లానే తప్ప ఇందులో తన తప్పేమీ లేదన్నది పయ్యావుల వాదన.

 

ఇదిలావుండగా.. ఈ మధ్య మంత్రులు అశోక్ గజపతిరాజు, పితాని వేర్వేరు సందర్భాల్లో జనసేన పవన్‌కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మనకు అత్యుత్సాహం పనికిరాదని.. ఆచితూచి మాట్లాడాలంటూ చురకలు వేశారు. ఇటీవల ‘పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ’ మంత్రి పితాని చేసిన కామెంట్‌తో స్వయంగా పవన్ ట్వీట్ చేశారు. ‘తానెవరో తెలియనందుకు సంతోషం’ అంటూ పవన్ చేసిన ట్వీట్ తెలుగుదేశం వర్గాల్ని ఇరుకున పడేసింది.

 

Read Also

 
Related News
JournalistDiary