సెన్సేషన్ డైరెక్టర్ రాజమౌళి.. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సామాజిక అంశాలపై కూడా చురుగ్గా స్పందిస్తుంటారు. ఒక టీవీ ఛానెల్ కోసం సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ ప్రోగ్రాం కూడా చేశారాయన. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కూడా అలర్ట్ అయ్యారు.

‘ఇప్పుడే RRR మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ముగిసింది. నేను కూడా మీతోపాటు ఓటెయ్యడానికి ఆసక్తిగా వున్నా’నంటూ ట్వీట్ చేశాడు జక్కన్న. మన భవిష్యత్తుని నిర్మించుకోవడం కోసం ఓటెయ్యడం మరిచిపోకండి.. అంటూ పిలుపునిచ్చారు. ‘ఇంతకీ నీ ఓటెవరికి బాసూ..’ అంటూ సోషల్ మీడియా వేదికగా రాజమౌళితో పరాచికాలు కూడా షురూ అయ్యాయి.

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుతో టచ్‌లో వున్న రాజమౌళి.. అమరావతి నిర్మాణానికి సంబంధించి కొన్ని నమూనాల్ని చేసిచ్చారు. సిద్ధాంత పరంగా తెలుగుదేశం పార్టీకి అయన సన్నిహితంగా మెలుగుతారన్న వార్తలు కూడా వున్నాయి.

ఇటు.. కేసీఆర్ కూడా రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తినవారే. అక్కినేని పురస్కార ప్రదానం సమయంలో జక్కన్న ‘ట్రెండ్ సెట్టర్’ అంటూ పొగిడేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.

ఇదిలా ఉంటే.. 2014 మే 17న అప్పటి అసెంబ్లీ ఎన్నికల ఫలితం వెలువడిన సమయంలో రాజమౌళి చేసిన పొలిటికల్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇద్దరు ముఖ్యమంత్రులకూ ఆయనొక సిన్సియర్ కాంప్లిమెంట్ ఇచ్చారప్పుడు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *