India / Crime
నయీం కేసు ఖతం ..?
83 days ago

గ్యాంగ్ స్టర్ నయీం కేసు ఖతమైపోయినట్టే... నయీం తో రాజకీయ పార్టీలకు, నేతలకు  సంబంధం లేదని, అతడి సేవలను పోలీసులు వినియోగించుకున్నారన్న ఆరోపణలు సరి కాదని తెలంగాణా హోం శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. నయీం వల్ల పోలీసు అధికారులు ప్రయోజనం పొందారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. నయీం కేసులకు సంబంధించిన సిట్ విచారణ కంటి తుడుపు చర్యగా ఉందన్న ఆరోపణ కూడా సరికాదన్నారు. ఈ గ్యాంగ్ స్టర్ తో లింకులున్న నేతలను ప్రభుత్వం కాపాడుతోందన్న విమర్శకు కూడా ఆధారాలు లేవని పేర్కొన్నారు.

నయీం ముఠా హత్యా కాండ, భూ దందా లపై సీబీఐ విచారణ కోరుతూ సీపీఐ నేత నారాయణ వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలమేరకు తెలంగాణా హోం శాఖ దీనిపై కౌంటర్ వేసింది. పిటిషనర్ చేసిన వివిధ ఆరోపణలను ఖండించారు. రాజకీయ కారణాలతోనే పిటిషనర్ ఈ వ్యాజ్యం వేశారని హోం శాఖ ముఖ్య కార్యదర్శి అన్నారు. పోలీసులు సమర్థంగా కేసు దర్యాప్తు చేస్తున్నారని, ఎలాంటి లోపాలు లేవని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోని నక్సల్ సంస్థలతో నయీంకు లింకు ఉందని చెప్పడానికి ఆధారాలు కూడా లేవని అన్నారు. కాగా ఈ కేసులో అధికార టీఆర్ఎస్ పార్టీ స్వప్రయోజనాలకోసం అమాయకులను బలి చేసి బడా బాబులను కాపాడే ప్రయత్నం చేస్తోందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు.  ఈ కేసులో సీబీఐ  దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంలో నాకేమీ స్వప్రయోజనాలు లేవు అని ఆయన స్పష్టం చేశారు.


 

 
 
 
Related News

JournalistDiary