India / Crime
అగస్టా కేసులో సీనియర్ జర్నలిస్టులు
113 days ago

అగస్టా వెస్ట్ లాండ్ కేసులో కొందరు ప్రముఖ జర్నలిస్టులు కూడా ముడుపులు అందుకున్నారన్న విషయం బయటపడింది. కోట్లాది రూపాయల అగస్టా వెస్ట్ లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో ఈ ఇటాలియన్ సంస్థ నుంచి, దాని పేరెంట్ కంపెనీ నుంచి కూడా వీళ్ళు లంచాలు అందుకున్నారని, వాటికి అనుకూలంగా వార్తలు రాశారని తెలిసింది. ఈ మేరకు హరి జైసింగ్ అనే జర్నలిస్టు, రచయిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది.

ప్రస్తుతం ఈ హెలికాప్టర్ల కొనుగోలులో జరిగిన గోల్ మాల్ పై సీబీఐ, ఈడీ సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నాయి. సుమారు డజను వీవీఐపీ హెలికాప్టర్ల డీల్ లో ఇండియన్ మీడియా కూడా జోక్యం చేసుకుందా అన్న విషయం పై ఇన్వెస్టిగేషన్ చేయాలని, ఈ దర్యాప్తు సంస్థల స్థాయీ నివేదికలను సమర్పించాలని వీటిని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. 12 హెలికాప్టర్ల కొనుగోలు కోసం 2006 లో రూ. 3,727 కోట్ల కాంట్రాక్టును పొందేందుకు డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ ప్రొసీజర్స్ రూల్స్ ను ఉల్లంఘించారని 2013 ఆగస్టులోనే కాగ్ పార్లమెంటులో ఓ నివేదిక సమర్పించింది.

ఆ డీల్ లో ప్రముఖ జర్నలిస్టులు కూడా ఈ సంస్థకు అనుకూలంగా వార్తలు రాయడానికి ముడుపులు అడుకున్నారని, ఇండియన్ మీడియాను మేనేజ్ చేయడానికి క్రిస్టియన్ మైఖేల్ అనే మధ్యవర్తి దాదాపు 50 కోట్లను చెల్లించాడని ఆ నివేదిక పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయాలని పిటిషనర్ కోరారు.

 

 
 
 
Related News

JournalistDiary