World / Health
మందు కొట్టినా బెదరం
158 days ago

దోమల నివారణకోసం ఫాగింగ్ చేసినా ఫలితం సున్నా అంటున్నారు నిపుణులు. డెంగ్యు, చికెన్ గున్యా వ్యాధులతో ఢిల్లీ వణికిపోతుండగా..వీటికి కారణమైన దోమల సంహారానికి ప్రభుత్వం నడుం బిగించింది. వీటిని మట్టుబెట్టడానికి వాడే కెమికల్స్ ను అవి తట్టుకోగలుగుతున్నాయని, వాటి సంహారం జరగడం లేదన్నది  ఎక్స్ పర్ట్శ్ వార్నింగ్.. వీధుల్లో పెద్దఎత్తున ఫాగింగ్ ను ఆరోగ్య శాఖ చేపట్టింది. కెమికల్స్ తో కూడిన పొగను సిబ్బంది స్ప్రే చేస్తున్నారు. కానీ ఈ రసాయనాలు దోమలను చంపలేకపోతున్నాయి అని ఎయిమ్స్ లో పల్మనరీ డిపార్ట్ మెంట్ హెడ్ రణదీప్ గులేరియా తెలిపారు. ఫాగింగ్ వల్ల కేవలం దోమలను అదుపు చేయగలుగుతామే గానీ పూర్తిగా నివారించలేమని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రక్రియతో దోమల పని పట్టవచ్చునని చెప్పే వాదనలో పస లేదన్నారు. ఇళ్ళ బయటా..వీధుల్లో దోమల మందు కొట్టేస్తున్నారు. ఇక డెంగ్యు, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారి నుంచి మనం బయటపడినట్టే..బే ఫికర్ గా ఉండొచ్చు అని సైకాలజికల్ గా ఫీలవడానికే తప్ప ఈ ఫాగింగ్ వల్ల ఉపయోగం లేదన్నారు. నిజానికి లార్వా దశలోనే డెంగ్యు ను అదుపు చేయాల్సి ఉంటుంది అన్నారు. దక్షిణ ఢిల్లీ మాజీమేయర్  సుభాష్ ఆర్య కూడా ఈయనతో దాదాపు ఏకీభవించారు. ఇళ్ళ బయట దోమల మందు స్ప్రే చేస్తున్నామని, ఇది 5 నుంచి 10 నిముషాలసేపు మాత్రమే పని చేసి ఆ తరువాత గాలిలో కలిసిపోతుందని ఆయన చెప్పారు.

ఇక దోమల సంహారం ఎక్కడన్నారు. పులిమీద పుట్రలా కొందరు డాక్టర్లు మరో బాంబు కూడా పేల్చినంత పని చేశారు. ఈ దోమల మందు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ ఫాగింగ్ యంత్రాల్లో మలాథియాన్ అనే క్రిమి సంహారక మందుతో కలిపిన 95 లీటర్ల డీసెల్ వాడతారని, ఈ పొగ పీల్చితే శ్వాస సంబంధ రుగ్మతలు తప్పవని వాళ్ళు అంటున్నారు. ఢిల్లీ లో డెంగ్యు, చికెన్ గున్యా వ్యాధుల బారిన పడి ఇప్పటివరకు 34 మంది మరణించారు. 40 కి పైగా ప్రైవేటు, 35 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు చికిత్స పొందుతున్నారు.

 

 

 

 
 
 
Related News

JournalistDiary