India / Time Pass
ఆ ఒక్కటీ అడక్కు
1191 days ago

‘జోడుగుళ్లు’ సెంటరు. జెనవంతా వొచ్చేరు. నాయకులు ఇంకా రాలేదు ‘జెనం మనిషి’ తవిట్నాయుడు కాస్త చిరాగ్గానే వున్నాడు - పోలిటిక్సన్నా, లీడర్లన్నా అతనికి పడదు మరి. (పైకి ఓపిక నటిస్తాడంతే)

ఇంతలోనే ఒచ్చేసేరు సీనియర్ నేత గారు, స్టేజీ ఎక్కి బ్రెమ్మాండంగా మాటాడేరు. తన పార్టీనే నెగ్గించమని పదే పదే చెప్పేరు. 

‘బాబూ నాదో మనవి బాబూ’ అన్నాడు తవిట్నాయుడు. 

‘చెప్పండి బ్రదర్. సూటిగా చెప్పండి’ అన్నారు సీ.నే. గారు

‘ఈ ఎలచ్చన్‌లో మా పేట మూడు వేల ఓట్లు మీకే’

‘వెరీగుడ్ బ్రదర్. థాంక్యూ’

‘ఐతే ఓ కండీసను.’

‘అదేంటో చెప్పండి బ్రదర్’

‘మావోళ్లు సర్దాపడతన్నారు బాబు. మన బాలకిస్న గోరు ఆవుత్తరాదిగుంటనేసుకునొచ్చి, ఇదే టేజీ మీద ‘‘నక్సు పాపా - నక్సు పాపా నంచికొస్తావా’’  పాట రికాడ్రుకి డ్రేన్సింగు సెయ్యాల. తవరూ, అరికిస్నగోరూ పక్కనే చేరి స్టెప్పు లెయ్యాల’’ .

‘‘అయామ్ సారీ బ్రదర్. ఆ ఒక్కటీ అడక్కు’’ అని కుర్చీలో కూలబడ్డారు సీ.నే. గారు. ఆ వెంటనే యువనేత గారొచ్చేశారు. రాగానే లయబద్ధంగా చేతుల్తో నాట్యం చేయిస్తూ స్పీచ్చి అదరగొట్టేరు. ‘‘నోట్లో ఏలెడితే కొరకలేని ఎర్రోడి నాగున్నాడీ బాబు. నచ్చకోట్లు నొక్కీసీడంటే నమ్మడవెలాగ!?’’ అనుకుంటూ ‘‘బాబూ’’ అని గోముగా పిలిచేడు తవిట్నాయుడు. ఆ పిలుపుతో కోపం నషాళానికంటిన యు.నే. తనదైన శైలిలో ‘‘నేన్నిన్నడగదల్చుకున్నా. ఒక మహా గొప్ప పార్టీకి అధినాయకుడిగా నేన్నీకు కనిపించడం లేదా అని అడగదల్చుకున్నా. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన నన్ను వినయంగా ‘‘సార్’’ అని పిలవడానికి నీకు నోర్రావడంలేదా అని అడగ దల్చుకున్నా’’ అన్నాడు. 

‘‘నేను కూడా చెప్పదల్చుకున్నా.. నిన్ను నేను ‘‘సార్’’ అని పిలిస్తే నాసిన్న కొడుకుని ‘‘సార్’’ అని పిలిచుకున్నంత అసియ్యంగుంటదని చెప్పదల్చుకున్నా’’ అన్నాడు తవిట్నాయుడు అదే శైలిలో.. 

‘‘అది సరేగాని బాబూ, నీకు మావంతా టోకున ఓట్లెయ్యలంటే ఓ సిన్న కండీషను’’ అని మళ్లీ తనే అన్నాడు. తవిట్నాయుడు. 

‘‘ఏవిటో చెప్పు పెద్దాయనా. ఏదైనా కొత్త పథకం కావాలంటే ఇప్పుడే ప్రకటించేస్తానని చెప్పదల్చుకున్నా’’

‘‘అంత పెద్ద కోరికలేవినేవు బాబు. మా పేటోళ్ల వంతా ఓ టూరిస్టు బస్సు మాటాడుకుని, ఒచ్చేవోరం బెంగుళూరు ఎల్లదల్చుకున్నాం, పనిలో  పనిగా నీ పాలరాతి బంగళాకూడా సూడదల్చుకున్నాం, ఒందలాది గదులూ, చకల చవుకర్యాలూ కళ్లారా చూస్తే మా జెల్మ తరించిపోద్ది. అందుకు నీ పర్మిసను కావాల. కావాలంటే తలకి రెండొందల్రూపాయిలు టిక్కెట్టు పెట్టు కాదనకు బాబు’’

‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ అంటూ యు.నే. ఆసీనుడయాడు. ఇంతలోనే మెగానేత గారు తన పాత్ర మరిపించలేని తీరంలో చప్పచప్పగా మహోపన్యాసం చేసిపారేశారు. 

‘‘బాబూ మెగానేత గోరూ. నా మాట ఆలకించి తవరో పనిసెయ్యాల. అలగ సేస్తే మీ పార్టీకి తిరుగునేదుబావు’’

‘‘అదేంటో చెప్పు పెద్దాయనా’’

‘‘మీరేంటి సెయ్యాలంటే ముందు మీ పార్టీ గొప్పతనం గురించి ఓ నలుగురికి సెప్పాల. ఆ నలుగురూ ఏటి సెయ్యాల? ఒక్కొక్కళ్లు మరో నలుగురికి సెప్పాల. అదే రకంగా ఒక్కొక్కడూ నలుగురికి లెక్కన సెప్పుకుంటూపోతే మీ పార్టీకి గెలుపు గేలంట్రీ, మిగతా పార్టీలకి డిపాజిట్లు గల్లంతు. ఎలగుంది మన అవిడియా?’’ 

‘‘అసలేవిటి నీ వుద్దేశం? స్టాలిన్ పిచ్చర్‌లో పాయింటు పట్టుకుని వేళాకోళం చేస్తే నాకర్థంకాదనుకుంటున్నావా?’’ 

‘‘మా ఓట్లన్నీ మీ పార్టీకే కానీ ఓ కండీసను బావు’’

‘‘ఏంటది?’’ 

‘‘మా కుర్రోళ్లు ముచ్చటపడుతున్నారు. ఇదే టేజీ మీద ‘‘దాయి దాయి దామ్మా-నడిచే కుందనాల బొమ్మ’’ పాటకి తవరు డ్రేన్సు చెయ్యాల.’’ 

‘‘నోనో. ఇంపాసిబిల్. ఆ ఒక్కటి అడక్కు - నేనో బాధ్యతగల కేంద్రమంత్రిని తెలుసా?’’ అంటూ మె.నే గారు కుర్చీలో కూర్చు్న్నారు. 

ఇంతలోనే ఆ ప్రాంతం గొర్రెల పెంపకందార్ల తరపున ఎవరో వచ్చి నాయకుల చేతికి ముద్దొచ్చే బుజ్జి బుజ్జి గొర్రె పిల్లల్ని అందించేరు. నాయకులు ఎంతో ప్రేమగా పసిబిడ్డని ఎత్తుకున్నట్టుగా రెండు చేతులతోనూ ఆ గొర్రెపిల్లలనెత్తుకుని గుండెలకి హత్తుకుని ఫొటోలకి పోజులిచ్చేరు. ఆ గొర్రె పిల్లల్ని తిరిగి నిర్వాహకులకి అందజేశారో లేదో మరో బేచ్చి ఆ స్టేజిమీద సడెన్‌గా ప్రత్యక్షం. వాళ్లనీ, వాళ్ల చేతుల్లోవున్న కూనలనీ చూసీ నాయకులు బాంబు దెబ్బకి అదిరి పడినట్టు ఎప్పుడు, ఎలా, ఎంత చాకచాక్యంగా స్టేజి దిగేరోగాని క్షణంలో మాయవై పోయేరు. పరుగో పరుగు

‘‘ఇదేటి? ఇలగ లగెత్తేరు? ఈళ్లకి పందుల పెంపకందార్ల ఓట్లు అక్కర్నేదేటి? అన్నాడు తవిట్నాయుడు. 

‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ అని చమత్కరించాడెవరో కుర్రోడు.

- ఎస్పీ

 

Read Also

 
Related News
JournalistDiary