AP and TS / Entertainment
పదేళ్ళు వెయిట్ చేశా
26 days ago

డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్‌తో కలిసి పని చేసేందుకు తాను పదేళ్ళు వెయిట్ చేశానని తెలిపాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘స్పైడర్’ మూవీ ఈ నెల 27న రిలీజ్ కానుండగా.. ఇందులో స్పై ఏజంటుగా నటించిన ప్రిన్స్.. మురుగదాస్‌తో కలిసి పని చేయాలన్న తన కల నెరవేరిందని చెప్పాడు. ఈ మూవీ షూటింగ్ గొప్ప అనుభూతిని ఇచ్చిందని, అంతర్జాతీయంగా పాపులర్ అయిన సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ టాలెంట్ ఎలాంటిదో తెలుసుకోగలిగానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. బాలీవుడ్‌లో అంతా అతడ్ని గాడ్ (దేవుడు)గా అభివర్ణిస్తారని, ఇందుకు తానేమీ ఆశ్చర్యపోలేదని అన్నాడు.

‘కోలీవుడ్‌కు నేను వెళ్తున్నానంటే దాని అర్థం మార్కెట్‌ను పెంచుకోవడానికి కాదు.. ఒక నటుడిగా మరింత రాణించాలన్నదే.. నాకు తమిళం కూడా బాగా వచ్చు. బహుశా ఇది కూడా ఈ బై-లింగ్యువల్‌లో నేను నటించడానికి కారణమై ఉండొచ్చు’ అని మహేష్ బాబు తెలిపాడు. ఓ భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా ఇతర భాషల్లోనూ విడుదల కావలసిందే అన్నాడు. బై-లింగ్యువల్ చేయడమంటే ఆషామాషీ కాదని, చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పిన మహేష్.. 190 రోజులపాటు ఏకధాటిగా షూటింగ్‌లో పాల్గొన్నా ఎప్పుడూ నేను డల్‌గా ఫీల్ కాలేదని పేర్కొన్నాడు. ఫ్యామిలీ గురించి ప్రస్తావిస్తూ.. తన లైఫ్‌లో కుటుంబానికి తానెంతో ప్రాధాన్యమిస్తానని, షూటింగ్‌లో అలసిపోయినప్పుడు తన పిల్లలతో, కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు మళ్ళీ ఉత్సాహంగా మారిపోతానని, అది ఎంతో శక్తినిస్తుందని అన్నాడు. ఫ్యామిలీ అన్నది చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించాడు.

తన స్పైడర్ మూవీ ఫినిష్ కాగానే మహేష్ బాబు కొరటాల శివతో ఓ ప్రాజెక్టుకు రెడీ కావడం విశేషం. సాధారణంగా పెద్ద హీరోలు తమ భారీ ప్రాజెక్టు పూర్తి అయ్యాక కొన్ని నెలలపాటు రెస్ట్ తీసుకుంటారు. అయితే తను ఈ మూవీ అయిన వెంటనే మరేదీ ఆలోచించకుండా కొరటాల సెట్స్ లో అడుగు పెట్టా అని ప్రిన్స్ తెలిపాడు. దీని తర్వాత వంశీ పైడిపల్లి తో మహేష్ బాబు కలిసి పని చేయనున్నాడు.

 

Read Also

 
Related News
JournalistDiary