World / Health
వంటింటి మందులు..
460 days ago

మనం ఆహారంలో తీసుకునే కొన్ని పదార్ధాలు ఆకలిని పెంచడమేకాదు.. ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తాయి. బ్రెయిన్, మూడ్‌ను మంచిగా ఉంచడంతోపాటు ఎక్స్‌స్ట్రా కొవ్వును కరిగించేస్తాయంటున్నారు ఫుడ్ ఎక్స్‌పర్టులు. మంచి ఆరోగ్యం, బాడీ ఫిట్‌నెస్ కొరకు సూపర్ ఫుడ్స్ కాకుండా, ఐదు రకాల స్పైసెస్ వాడితే చాలంటున్నారు. స్పెషలిస్టులు చెబుతున్న  ఆయా స్పైసెస్ ఏమిటో ఓ లుక్కేద్దాం! 

 

దాల్చిన చెక్క... 

తరచూ యాపిల్స్, ఓట్ మీల్, ఫ్రెంచ్ టోస్ట్, రుచి కోసం కూరల్లోవాడే దాల్చిన చెక్కకు మంచి ఆరోగ్య లక్షణాలున్నట్టు ది జర్నల్ ఆఫ్ న్యూరో ఫార్మకాలజీ పరిశోధనల్లో పేర్కొంది. మంచి రుచికరమైన ఆహారంగానే కాకుండా, ఆరోగ్యం కలిగించే లక్షణాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. దాల్చిన చెక్క తరుచూ వాడటంవల్ల బయో కెమికల్ చర్యలలో మార్పులకు దోహదపడుతుంది. అంతేకాకుండా మెదడు పనితీరులో గణనీయమైన మార్పు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నమాట. దీంతోపాటు బ్లడ్ షుగర్‌ని నియంత్రించడంలోనూ, చక్కెరకు ప్రత్యామ్నాయంగానూ పని చేస్తుందని చెబుతున్నారు.

పసుపు..

ప్రాచీనకాలం నుంచి వాడకంలోవున్న పసుపు సంప్రదాయంలో భాగమైపోయింది. ఎక్కువగా ఆహార పదార్ధాల్లో వాడే పసుపు.. కేవలం రుచినివ్వడమే కాకుండా ఆరోగ్య ప్రదాయనిగా పని చేస్తుందని అంటున్నారు. సౌందర్య సాధనంగానే కాకుండా గాయాలకు పై పూతగా కూడా దీన్ని వాడతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో వాపులను కూడా తగ్గిస్తుందట. ఆయుర్వేదంలో కొన్నిరకాల ఔషధాలతో పసుపు కలిపి వాడితే  క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధుల నివారణలో కూడా పని చేస్తుందని తేలింది. ఆహారంతో పసుపును తీసుకోవడంవల్ల లివర్ పని తీరు బాగా మెరుగుపడుతుందని కూడా నివేదికలు చెబుతున్నాయి.

అల్లం...

ఘాటైన వంటింటి అల్లంలో ఔషధ గుణాలు పుల్‌గా ఉన్నాయి. జీర్ణశక్తిని మెరుగు పరచడంలో కీలకపాత్ర. అలాగే ఉదర సంబంధ వ్యాధులకు దివ్య ఔషధంగా పనికొస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఉదయం పూట ప్రెగ్నెంట్ వుమెన్‌లో వచ్చే మార్నింగ్ సిక్‌నెస్ తగ్గేందుకు అల్లం వాడితే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. తరచూ అల్లం టీతో కలిపి తీసుకుంటే కడుపులోవుండే వికారం తగ్గించడంతోపాటు శరీరానికి కాంతి ఇస్తుందని తెలుస్తోంది. 

కుంకుమ పువ్వు..

బంగారం ధరతో పోటీపడే కుంకుమ పువ్వులో ఆరోగ్య లక్షణాలు చాలానే ఉన్నాయంటున్నారు స్పెషలిస్టులు. పర్షియా నుంచి దిగుమతి అయిన కుంకుమ పువ్వు. టీ లేదా రైస్‌తో కలిపి తీసుకుంటే మంచిమూడ్ లిఫ్టర్‌గా పని చేస్తుందట. ఇందులోవుండే  సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్ప్రేరకంగా పనిచేసి మెదడును ప్రశాంతంగా ఉంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

కారం పొడి..

తినేటప్పుడు కళ్ల వెంబడి నీళ్లు కారినా.. లోపలికి పోయిన తరువాత వంట్లోవున్న కొవ్వును కరిగించే గుణం కారం సొంతం. ఊబకాయాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు రీసెర్చర్లు. ఎండుమిరప కారంలోవుండే కాప్సాసిన్ జీర్ణక్రియను మెరుగు పరచడమేకాకుండా ఒంట్లో ఉండే అధిక కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుందట. కాప్సాసిన్ కారం కలిగించే గుణం కలిగి ఉండటం వల్లే.. కారం తిన్న తర్వాత మనం స్వీట్ కూడా తినలేక పోవడాన్నే థెర్మో జెనిసిస్ అంటారు. కారానికి వంట్లో వేడి పుట్టించే లక్షణం ఉండటంవల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.


 

Read Also

 
Related News
JournalistDiary