Telangana / Politics
కేసీయార్ దెబ్బకు మూడు పిట్టలు !
18 days ago

రాజకీయంలో మిగతావారి కంటే పదహారు ఆకులు ఎక్కువే చదివిన కేసీయార్ లాంటి నాయకులు వేసే ప్రతీ అడుగు వెనుకా ఒక అర్థం, ఒక పరమార్థం ఖచ్చితంగా ఉంటుంది. గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ఆయనిచ్చిన ఝలక్కులు అటువంటివి మరి. కట్ చేస్తే.. ఇప్పుడు మోదీ వారి బీజేపీ వంతు. 

 

నోట్ల రద్దు ఒక పిచ్చిపని అంటూ ఏకిపారేసిన నోటితోనే.. మోదీ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం అంటూ తెగ పొగిడేశారు తెలంగాణ సీఎం కేసీయార్. ఇంతలోనే అంత మార్పు.. ఎలా సాధ్యం అంటూ ముక్కుమీద వేలేసుకున్న వాళ్ళు.. ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. ఆ తర్వాత మోదీ చెప్పిన డిజిటల్ పిలుపును.. తాను కూడా తూచా తప్పకుండా పాటిస్తున్న కేసీయార్ పటాలం.. బంగారు తెలంగాణా కల సాకారం దిశగా ఇది కూడా ఒక ముందడుగేనంటూ చెప్పుకుంటోంది. కేటీయార్, హరీష్ రావ్ ఆ దిశగా రేయింబవళ్లు కసరత్తు చేస్తున్న ఆనవాళ్ళు కూడా వున్నాయి. ఇంతకీ.. మోదీ ఐడియాను కేసీయార్ మొయ్యడమేంటన్న చర్చయితే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మొదలైపోయింది. 

 

నోట్ల రద్దుతో జరిగే డామేజ్ ఒకవైపు స్పష్టంగా కనిపిస్తూనే వుంది. జనంలో దాని తాలూకు అసంతృప్తి ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీస్తుందన్న 'భయం' బీజేపీని సైతం ఎంతోకొంత వణికిస్తూనే వుంది. ఇటువంటి 'ట్రబుల్డ్ వాటర్స్' లోనే ఈత కొట్టేస్తానంటున్న కేసీయార్ ఉద్దేశం వేరే ఏదైనా ఉంటుందన్న వాసన కూడా  పొలిటికల్ సర్కిల్స్ పసిగట్టేశాయి. కేసీయార్ తీసుకున్న లేటెస్ట్ డిజిటల్ స్టెప్ నుంచి.. అయన కావాలనుకున్నా వద్దనుకున్నా మూడు ప్రయోజనాలైతే దక్కడం గ్యారంటీ. 

 

మొదటిది.. డిజిటల్ విప్లవం పేరుమీద రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఒకరకమైన సాంకేతిక' సందడి. నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం కోసం ఇద్దరు ముగ్గురు మంత్రులు  బిజీగా తిరిగేస్తూ వార్తల్లో కనిపిస్తున్నారు. నగదు రహిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఓ మోస్తరు ప్లేస్ ఖరారు చేసుకుంటే.. ఇది  ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్లస్ పాయింటే అవుతుంది. మోదీకి, మోదీ భావజాలానికి దగ్గరగా మెలగడమంటే.. బీజేపీతో భవసారూప్యత పాటించినట్లే. ఇది సహజంగానే రాష్ట్ర కమలనాథుల చేతులు కట్టేస్తుంది. భూసేకరణ బిల్లు లాంటి ప్రభుత్వ నిర్ణయాలను ధైర్యంగా విమర్శించడానికి రాష్ట్ర బీజేపీ వెనుకాడుతున్న విషయం కూడా కనిపిస్తూనే వుంది.. ఇది రెండో అడ్వాంటేజ్. 

 

మోదీ క్యాబినెట్లో కవితమ్మ చేరిక.. అంటూ ఎప్పుడో వినిపించిన వార్తలు.. ఇప్పుడు మళ్ళీ ఊపందుకోవడం కూడా ఈ కోవలోకే వస్తుందన్నది  ఇంకో మాట. 'అట్నుంచి నరుక్కురావడం' అనే చాప్టర్ పొలిటికల్ సైన్స్ లో చాలా కీలకం. దీన్ని కేసీయార్ బాగా వంటబట్టించుకున్నారు గనుకే.. ఆయన ఖాతాలో అన్నేసి విజయ ఢంకాలు.


 
 
 
Related News

JournalistDiary