World / Health
లేటు వయస్సులో పెళ్లయితే..?
01:49 PM on 28th February, 2014

లేటు వయస్సులో పెళ్లయితే రకరకాల సమస్యలొస్తాయని అందరూ అనుకునేదే. అసలు పెళ్లే లేటుగా అయ్యిందంటే పిల్లలు పుట్టడం ఇంకా లేటవుతుందని ఓ టెన్షన్. ఆ పిల్లలు ఎదిగొచ్చేటప్పటికీ వారి కెరీర్‌ని చక్కదిద్దేందుకు మన వయస్సు సహకరించదేమోనని ఇంకొందరు లేట్ మ్యారీడ్ కపుల్స్ అభిప్రాయం. ఈ టెన్షన్స్ సంగతెలా వున్నా ఇప్పుడు కొత్తగా వెలుగుచూసిన ఓ సర్వే ఆలస్యంగా పెళ్లి చేసుకున్నవాళ్లని... పెళ్లయి ఓ పది, పదిహేనేళ్లయినా పిల్లలు పుట్టని వాళ్లని మరింత భయపెడుతోంది. అదేమంటే లేటు వయస్సులో పిల్లలు పుడితే ఆ పిల్లలకు మానసిక రుగ్మతలు, చదువులో వెనకబడటం, బుద్ధి మాంద్యం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయనేది ఈ సర్వే చెప్పిన చేధునిజం. ఇది విని ఉలిక్కిపడిన వాళ్లెంతమందో లెక్కకందడం కష్టమే. చదువులంటూ, కెరీర్ అంటూ ఏదో ఓ కారణంతో పెళ్లిని వాయిదా వేసేవాళ్లకు ఈ అధ్యయనం ఓ హెచ్చరికే అంటున్నారు పరిశోధకులు. 

అయితే ఇది అందరికీ ఎదురయ్యే సమస్య కాదు.. దాదాపు 45 ప్లస్ దాటిన మగవాళ్లే ఈ సమస్య బారిన పడే ప్రమాదం వుందని అధ్యయనం పేర్కొంది. స్వీడెన్‌లో 1973 నుంచి 2001 మధ్యకాలంలో పుట్టినవారి సమాచారాన్ని సేకరించి, వారి ప్రస్తుత స్థితిగతుల్ని విశ్లేషించిన అనంతరమే ఈ ఫలితాన్ని గుర్తించామని పరిశోధకులు చెబుతున్నారు. లేటు వయసు డ్యాడీలకు పుట్టిన పిల్లల్లో ఆటిజం, బైపోలార్ డిజార్డర్, షీజోఫ్రీనియా, చదువులో వెనకబడటం, ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలనిపించడం వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు ఈ సర్వే గుర్తించింది. మగవారిలో వయసు పెరుగుతున్నకొద్దీ వీర్యకణాలు, డీఎన్ఏల్లో చోటుచేసుకునే మార్పులే అందుకు కారణంగా తెలుస్తోంది. స్వీడెన్‌కి చెందిన కరోలిన్‌స్కా అధ్యయన సంస్థ పరిశోధకులతో కలిసి ఓ భారతీయ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనల్లో ఈ ఫలితం వెల్లడైంది.  

 
 
 
Related News