ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కి తీహార్ జైల్లో రాచభోగాలు కొనసాగుతున్నాయి. పది మందికి పైగా సిబ్బంది ఆయన సేవల్లో తరిస్తున్నారని జైలు వర్గాలు తెలిపాయి. వీరిలో కొందరు ఆయన బెడ్ సరి చేయడం, బయటి నుంచి పండ్లు, ఫలాలు, బట్టలు వంటివి చేస్తుండగా మరికొందరు ఆయనకు హౌస్ కీపింగ్ సిబ్బంది మాదిరి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
తనకు జైనులకుద్దేశించిన సాత్వికాహారాన్ని అధికారులు ఇవ్వడం లేదని, ఇందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ జైన్ దాఖలు చేసిన పిటిషన్ న్నీ రౌజ్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. జైల్లో పండ్లు, డ్రై ఫ్రూట్లు ఇవ్వడం కుదరదని కోర్టు పేర్కొంది.
ఓ రేపిస్ట్ చేత మసాజ్ చేయించుకుంటున్న జైన్ వ్యవహారం ఇదివరకే వీడియోలకెక్కింది. అవినీతిపరులైన మీ పార్టీ నేతలకు జైల్లో వీవీఐపీ ట్రీట్ మెంట్ లభిస్తున్నదంటూ బీజేపీ నేతలు దుయ్యబడుతున్నారు. జైన్ కి సకల సదుపాయాలూ సమకూర్చిన సుమారు 8 మంది జైలు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసినప్పటికీ.. ఇంకా ఆయన ఈ రాచభోగాలు ఎలా అనుభవిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. నిత్యం తన సహచరులతో జైన్ చర్చలు, మాటా మంతీ జరుపుతున్న వీడియోలు కూడా సంచలనంగా మారాయి.
ఇంత జరుగుతున్నా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందించడం లేదు. కొత్తగా తీహార్ జైలు సూపరింటెండెంటు అజిత్ కుమార్ ను నియమించినప్పటికీ ఆయన తోనే జైన్ ‘మీట్’ కావడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇది తాజాగా విడుదలైన వీడియో కూడా. అజిత్ యవ్వారం బయటకు పొక్కడంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.