చైనాలోని హెనన్ ప్రావిన్స్ లో అతి భారీ వర్షాలు పడ్డాయి. అతి భారీ వర్షాలు అనే పదం కూడా చాలా తక్కువే. ఏడాది మొత్తంలో కురవాల్సిన వాన.. మూడు రోజుల్లో కురిసిందని అధికారులు అంటున్నారు.
ఇక్కడ 12 ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. షెన్ జౌ పట్టణంలో ఒక సబ్‌వే రైల్వే స్టేషన్ నీటమునిగింది. దాదాపు గంటపాటు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. మొత్తం 40 మందికి పైగా ప్రజలు చనిపోయినట్లు అంచనా.
వరదల ధాటికి కార్లు, వాహనాలు, హెలికాప్టర్లు.. నేలమీద ఏదుంటే అది.. కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల భవనాలు, రోడ్లు, వంతెనలు కూలిపోయాయి. భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది.
ఈ క్రమంలో టెస్లా మోడల్ కారు వరద నీటిలో వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ట్విట్టర్ లో దీన్ని షేర్ చేశాడు. ఇది టెస్లా బోట్ మోడల్ 3 అని క్యాప్షన్ ఇచ్చాడు. నిజానికి ఆ కంపెనీ సీఈవో ఎలోన్ మస్క్ చాలాసార్లు ఈ మాట అన్నారు. తమ కంపెనీ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ కార్లు పడవలుగా కూడా పనిచేస్తాయని చెప్పారు. అన్నట్లుగా వరద నీటిలో దూసుకెళ్లిన కారు వీడియో వైరల్ అవుతోంది.