మాజీ మంత్రి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని ఆదివారం తెల్లవారు జామున పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం జేసీబీలతో ఆయన ఇంటి వెనుక గోడను కూల్చివేశారు. పంట కాల్వను ఆక్రమించి దాదాపు రెండు సెంట్ల మేర గోడను నిర్మించినట్లు పురపాలక అధికారులు గుర్తించారు. ఆ రెండు సెంట్లు కూడా ప్రభుత్వ భూమిలోనివి అని సిబ్బంది తెలిపారు.
జూన్ నెల రెండో తారీఖుతో ఉన్న నోటీసును ఇప్పుడే తమకు ఇచ్చి వెంటనే గోడను తొలగించడం ఏంటి అని అయ్యన్న కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. దాంతో కాసేపు గోడ కూల్చివేత పనులను ఆపివేశారు.
మళ్లీ కొనసాగుతున్న పనులు…
అయ్యన్న కుటుంబ సభ్యులు కాసేపు అభ్యంతరం తెలపడంతో గోడ కూల్చివేత పనులను తాత్కలికంగా నిలిపివేసినప్పటికీ.. కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే ఆయన ఇంటి వద్దకు వెళ్లే రెండు దారులను మూసివేశారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. దీంతో కనీసం మీడియా ప్రతినిధులు కూడా ఇంటి వైపు రాకుండా చర్యలు చేపట్టారు.
అంతేకాకుండా అయ్యన్న ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆయన అనకాపల్లి జిల్లా చోడవరం మినీ మహానాడులో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోనికి తీసుకుని ఆయన్ను అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.